ఆంజనేయుడు సూర్యునికి మనవడా ?
ఆదిత్యాంజనేయం !! ఆంజనేయుడు సూర్యునికి మనవడా ?
సేకరణ
ఈ పేరు చదవగానే ఆదిత్యుడు ఆంజనేయుడు కలిసిన రూపం మనసులో మెదిలి ఆశ్చర్యానికి గురిచేసిందా !! ఇటువంటి రూపాన్ని ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నారా ? ఇదేమీ ఆంజనేయుని అవతారం కాదు . కానీ ఆంజనేయునికి సూర్యునితో ఉన్న బంధాన్ని, స్నేహాన్నీ పరిశీలిస్తే మాత్రం సూర్యఆంజనేయుడు మనకి దర్శనమిస్తారు . ఆయన సూర్యనారాయణుడు . ఈయన రుద్రాంశ సంభూతుడు . వీరిద్దరి మైత్రీ చూస్తే, మనకి నారాయణుడు, శివుడూ ఇద్దరూ కళ్ళముందు కదలాడుతారు. రామాయణం తోసహా పలు పురాణాల్లో, ఆధ్యాత్మిక వాగ్మయంలో వీరి అనుబంధం చాలా గొప్పగా కనిపిస్తుంది .
బాలాంజనేయుడికి దొరికిన పంసందైన పండు :
ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం. ఈ ఉదంతమే ఆంజనేయుని హనుమంతునిగా మార్చింది . మహాబాలునిగా వరాలు పొందేలా చేసింది . అంటే, ఒకరకంగా సూర్యుని వల్లే ఆంజనేయుడు తిరుగులేని శక్తివంతుడయ్యారు.
ఆదిత్యుని శిష్యరికం :
బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని, ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యని అభ్యర్ధించారు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు.
అలా హనుమంతుడు ఆదిత్యుని వద్ద విద్య అభ్యసించిన విధానాన్ని గురించి వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించారు. (గడియకు లక్షా డెబ్బై వేల యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) .
జాజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.
సూర్యుపుత్రునికి స్నేహితుడు :
సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.
సూర్యుని మనుమడు :
కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి, సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.
సూర్యుని అల్లుడు :
వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.
సూర్యవంశీయుని భక్తుడు :
హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైన నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.
త్రిమూర్తుల శక్తి :
సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.
#hanuman #anjaneya #aditya #surya
Tags: sungod, surya, aditya, hanuman, anjaneya, suvarchala