హనుమంతుడు భూత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణమేమిటి ?
హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణమేమిటి ?
- లక్ష్మి రమణ
భూతమో , ప్రేతమో , పిశాచామో తర్వాతి సంగతి, అసలు హనుమ నామమే ఒక ధైర్యానికి సంకేతం . రాముడంతటి వాడికే ధైర్యాన్నిచ్చిన భక్తుని నామం అది . భక్తునికి , భగవంతుడు , భగవంతునికి భక్తుడు ఎలా అనుసంధానం అవ్వాలో చెప్పిన మహిమాన్వితమైన నామం శ్రీ ఆంజనేయం. అందుకే తెలుగునాట మరే దేవునికి లేనన్ని ఆలయాలు ఆంజనేయునికి కనిపిస్తాయి. ఆలయాల కన్నా, ఆంజనేయ విగ్రహాలు లెక్కకి మిక్కిలిగా కనిపిస్తుంటాయి. పైగా అవి నూరు యోజనాల సంద్రాన్ని అధిగమించడానికి ఉద్యుక్తుడయిన ఆంజనేయుని భారీ రూపాల్లాగా ఎత్తుల్లో , భారీ తనంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఉంటాయి. అల్లంతదూరానికి కూడా తన అభయహస్తంతో భక్తులని రక్షిస్తున్న ఈ స్వామిని చూస్తేనే , గుండె నిండా ధైర్యం నిండుతుంది. ఉత్సాహం ఉరకలు వేస్తుంది . ఆయనలోని ఈ ప్రత్యేకతకి కారణం ఏంటి ?
ఆంజనేయుడు అంజనాదేవి తనయుడు. రుద్రాంశ సంభూతుడు. స్వయంగా పరమేశ్వరుని అంశమే ఆంజనేయ స్వామి. బ్రహ్మ సమానుడైన వాడు. సూర్యుని శిష్యుడు. సూర్యతేజోస్వరూపమయిన సువర్చలని చేపట్టిన బ్రహ్మచారి . వీటన్నింటికీ మించి రామభక్తుడు . తులసీదాసు ఒక్కమాటలో చెప్పేస్తారు, “ ఆ రాముని చేరాలంటే, ఈ రామదాసుని పట్టుకోవాలి” అని. అటువంటి మహాజ్ఞాన స్వరూపమే ఆంజనేయ స్వామి. ఆ స్వామి గుణగణాల గురించి చెప్పుకోవడానికి అక్షరాలు సరిపోవు .
లంకారాక్షసి లంకిణిని ఒక్క చరుపుతో అబ్బా అనిపించాడు . లంకేశ్వరుడిని ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువులు తాగించాడు. రామకార్యము సీతని చూసి రావడం, హనుమ ఘన కార్యం లంకని కాల్చిరావడం . యుద్ధంలో లక్ష్మణ స్వామిని సంజీవినితో బ్రతికించుకున్నాడు . మైరావణుని మాయాసౌధం నుండీ రామలక్షణులని రక్షించుకున్నాడు. అందుకే రాక్షసులకు ఆయన ప్రతాపం బాగా పరిచయం . ఆంజనేయుని మాట , ఆయన పేరు వినిపించిందో వారు శతయోజనాల దూరం పరిగెడతారు .
తన భక్తుల జోలికి వచ్చేవారి పట్ల స్వామి అపరనారసింహుడే !! రుద్రస్వరూపుడు కూడా కావడం చేతనేమో భూత ప్రేత పిశాచాలు కూడా ఆ ఆంజనేయుని మాట చెబితే, దెబ్బకే వదిలి పారిపోతాయి మరి ! కాళీ విజృంభణ వలన పెరిగిపోయే పాపాల వరదలో తన భక్తులని కాపాడే బాధ్యతని రాములవారే ఆంజనేయునికి అప్పజెప్పారట .
రామావతార పరిసమాప్తి సందర్భంగా స్వామి హనుమతో, “హనుమా కలియుగం అంతమయ్యేవరకు భూలోకంలో ఉండి సజ్జనులను రక్షించు. వారికి కలిగే భయం, ఆందోళన నుండీ వారిని కాపాడు. భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపు. అంటూ అవతారాన్ని చాలించారు.
ఈ విధంగా శ్రీ రాముడు ఆంజనేయుని కోరడంతో, రామాజ్ఞని హనుమంతుడు నెరవేరుస్తానని మాటఇచ్చారట. ఆ మాటకి కట్టుబడి ఆంజనేయస్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి, వారికి కలిగే భయాందోళనలను నుంచి రక్షిస్తున్నారు. అదన్నమాట సంగతి .
ఇటువంటి భయాందోళనలు, దుష్టశక్తి బాధలు ఉన్నవారు చేయాల్సింది, హనుమాన్ చాలీసా , లేదా శ్రీ ఆంజనేయ దండకం .
శుభం !!
#hanuman #anjaneya
Tags: hanuman, anjaneya