తిరుమల గర్భాలయంలో ఉండే వేంకటేశుని పంచబేరాలు ఎవరు ?

తిరుమల గర్భాలయంలో ఉండే వేంకటేశుని పంచబేరాలు ఎవరు ?
- లక్ష్మీరమణ
వేంకటేశ్వరస్వామిని కొలవని ఇల్లు , గోవిందనామం చెప్పని గడపా తెలుగు గడ్డమీద ఉండదంటే అతిశయోక్తి కాదు . హిందువులే కాక, తమ ఇంటి బిడ్డని పెండ్లాడాడని కొందరు ముస్లీములు కూడా కొలిచే దైవం శ్రీనివాసుడు. ఆపదల్లో ఆదుకునే కలియుగ ప్రత్యక్ష దైవం . శనివారం వచ్చిందంటే, ఆ గోవిందుని నామం చెప్పుకొని ఉపవాసం ఉండే దేశవిదేశీయులు ఎందరో ఉన్నారు . పైగా ఇది తర తరాలుగా ఇంటి వారసత్వంగా కూడా నిలుపుకుంటున్న కుటుంబాలున్నాయి . అటువంటి శ్రీనివాసుడు తిరుమలలో ఐదు రూపాల్లో పూజలు అందుకొంటూ ఉంటారు. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం .
కలియుగరంలో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవాడని తొండమాన్ చక్రవర్తి కథ ద్వారా తెలుస్తుంది. తొండమానుడి వల్ల జరిగిన ఒకానొక సంఘటన కారణం చేత వేంకటేశ్వరుడు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఏదైనా విషయం చెప్పాలనుకుంటే అర్చకులను ఆవహించి కానీ, స్వప్న సాక్షాత్కారం ద్వారా కానీ చెప్తానని అన్నాడు. కానీ పరమ భక్తులైన వారికి దర్శనం ఇవ్వకుండా ఆయన కూడా ఉండలేడు! అందుకు వెంగమాంబ వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇక చాలామంది ఆనంద నిలయంలో ఉన్నది కేవలం విగ్రహం అని భావిస్తారు అది ఖచ్చితంగా తప్పు అది విగ్రహం కాదు అని మన పురాణాల్లో స్పష్టంగా ఉంది.
న కృతం దైవసంఘైశ్చ
న కృతం విశ్వకర్మణా
స్వేచ్ఛయ క్రీడతే తత్ర
ఇచ్ఛారూపం విరాజితః
ఆనంద నిలయంలో ఉన్న వేంకటేశ్వరుని మూలమూర్తి దేవతలు తయారు చేసింది కాదు. విశ్వకర్మ చేసినదీ కాదు. తన సొంత ఇచ్ఛతో వేంకటేశ్వరుడు శిలా రూపంలో దర్శనమిస్తున్నాడు. అది కూడా ఐదు రూపాలలో !! వీరినే పంచబేరాలు అంటారు . బేరము అంటే విగ్రహరూపి అయిన భగవంతుడని అర్థం .
ఈ పంచమూర్తులు విష్ణువు యొక్క మహారూపాలైన విష్ణువు, మహావిష్ణు, సదావిష్ణు వ్యాపి నారాయణులకు సంకేతంగా పండితులు భావిస్తారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపాలుగా కూడా చెబుతారు.
ధ్రువం తే గ్రామ రక్షార్థ మర్చనార్థం తు కౌతుకమ్
స్నానార్థం స్నాపనం ప్రక్తముత్సవార్థమథౌత్సవమ్
బల్యర్థం బలిబేరం చ పంచబేరాన్ ప్రకల్పయేత్
అని విష్ణ్వర్చనా నవనీతం అనే వైఖానస సంహిత తెలియజేస్తుంది.
ధృవబేరం - అంటే స్థిరమైన (మూలవిరాట్ ) మూలమూర్తి శ్రీనివాసుడు .
అనిరుద్ధబేరం - ఈయన్నే కొలువు శ్రీనివాసుడు , దర్బారు శ్రీనివాసుడు , అళగిప్పిరాన్ అని పిలుస్తారు .
కౌతుకబేరం -పురుషబేరం , భోగ శ్రీనివాసుడు , మనవాళ పెరుమాళ్ అంటారు .
స్వపనబేరం- అచ్యుతబేరం, ఉత్సవశ్రీనివాసుడు, స్నపనబేరం, ఉగ్రశ్రీనివాసుడు అంటారు .
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడు . ఆ మనోహరమైన మూర్తిని చూసేందుకు లోకంనలుమూలలనుండీ భక్తులు తరలి వస్తుంటారు . యెంత చూసినా తనివి తీరని ఆ స్వామి తెలుగు నేలపైననే ఉన్నా , తమిళ సంప్రదాయమే స్వామి కొలుపుల్లో ఎక్కువగా కనిపిస్తుంది . బేరమనే పిలుపు కూడా అందువల్లనేనేమో ! ఇలా ఐదురూపాల్లో కోటానుకోట్లమంది భక్తులు నిత్యం దర్శించే స్వామీ ఎంతమంది వేడికోళ్ళు వింటారో , ఎందరి ఆర్తిని తీర్చి అభయమిచ్చి ఆదుకుంటారో ఆ తిరుమలేశునికే ఎరుక . తిరుమలలో స్వామికి నిత్యకళ్యాణం పచ్చతోరణంమే . ఇలా భక్తులు ప్రేమగా చేసే ఆ కొలుపులన్నీ స్వీకరించేందుకు ఆయన ఐదురూపాల్లో గర్భాలయంలో కొలువయ్యారు. అయినా ఆ శ్రీనివాసుని ఎన్ని రూపాల్లో చూసినా, ఎంతగా తలిచినా మన తనివి తీరదు . ఆయన దివ్యచరణాల సౌందర్యం , ప్రభావం అలాంటివేమో మరి !
నమో వెంకటేశాయ !! శ్రీ శ్రీనివాస చరణారవింద దర్శన ప్రాప్తిరస్తు ! శుభం .
#venkateswaraswamy #panchaberalu #tirumala #garbhalayam
Tags: Tirumala, venkateswara swamy, panchaberalu, pancha, beralu, garbhalayam