శివధనస్సు ఎత్తలేని రావణుడు సీతాదేవిని ఎలా తీసుకుపోగలిగాడు?
శివధనస్సు ఎత్తలేని రావణుడు ఆ ధనస్సు నెత్తిన సీతాదేవిని ఎలా తీసుకుపోగలిగాడు?
- లక్ష్మి రమణ
రావణుడు అర్బకుడు కాదు సాక్షాత్తు శివుడు ఉన్న కైలాస పర్వతాన్ని ఎత్తిన మహాబలశాలి, సాహసి. అదీకాక శివధనస్సు నెత్తిన సందర్భంలో సీత, రాముడు, రావణుడు, ఈ ముగ్గురి బలానికి పరీక్ష పెడతారా వాల్మీకి మహర్షి ?
అలా ఖచ్చితంగా జరగలేదు. ఆ మాటకొస్తే, శివధనస్సును సీత ఎత్తినట్టుగా వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. దాని నెత్తి సీతను పెళ్లాడడానికి రావణుడు స్వయంవరానికి రానూలేదు. శివ ధనస్సును ఎక్కుపెట్టే సందర్భంలో రావణుడు రావడం అనేది పూర్తిగా వాల్మీకి రామాయణంలో లేనటువంటి విషయం. వాల్మీకి రామాయణానికి పూర్తిగా విరుద్ధమైన విషయం.
రామాయణం అనే మహాకావ్యాన్ని రామాయణ కాలానికి ముందే దర్శించి, రచించి, అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి. ఆయన చెప్పనిది నిజమని ఎలా చెప్పగలరు ? ఆఖరికి సీతతో, సీత సౌందర్యంతో రావణుడికి తొలిసారిగా పరిచయం కలిగించింది శూర్పణకే.
రామలక్ష్మణులని చూసి కామ మోహిత అయిన శూర్పణకని వారు తిరస్కరించారు . ఆ తరువాత ఆమె ప్రేరణ మీదనే దండకారణ్యంలో జనస్థానంలో 14 వేల మంది రాక్షస వీరులు కర దూషణ త్రిశరాధి రాక్షస సేన నాయకులతో సహా రామలక్ష్మణుల చేతుల్లో హతులయ్యారు. ఆ తర్వాతే లక్ష్మణుని చేత ముక్కు చెవులు కోయబడిన శూర్పణక తన పగా తీర్చుకోవాలని రావణుని పంచన చేరింది.
రావణుడు సహజంగా స్త్రీలోలుడు. అదే విషయాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంది. పగ తీర్చుకోవడానికి రావణుడి ఎదుట సీతా సౌందర్యాన్ని వర్ణించి, రావణున్ని రెచ్చగొట్టింది. తాను రామలక్ష్మణుల పట్ల మోహితురాలైనట్టు శూర్పణక రావణుడికి నిజాన్ని చెప్పలేదు. రావణుడి కోసం జగదేక సుందరి అయిన సీతను తేవడానికి పోయి, తాను భంగపడ్డానని రావణుడితో చెప్పింది.
ఈ విధంగా సీతా సౌందర్యాన్ని గురించి వినడం రావణుడికి అదే ప్రథమం. ఆ మాటలకి ప్రేరితుడైన రావణుడు సీతమ్మని ఎత్తుకొచ్చిన విధానం అందరికీ తెలిసినదే . ఇందులో రాముడు , సీతమ్మ, రావణుల బలపరీక్షలు శివధనస్సుని ఎత్తడంతో ముడి పడలేదనేది సుస్పష్టం.
#valmikiramayanam #valmiki #ravana #shivadhanush #rama #seetha
Tags: Valmiki, ramayanam, ravana, shiva, sivadhanush, rama, seetha, sita