సిద్ధ ఏకాదశి లేదా అపర ఏకాదశి అంటే ఏమిటి ?

సిద్ధ ఏకాదశి లేదా అపర ఏకాదశి అంటే ఏమిటి ?
- లక్ష్మి రమణ
ఏకాదశి (Ekadasi) తిథికి (Tidhi) మన సంప్రదాయం గొప్ప స్థానాన్ని అనుగ్రహించింది. ఏకాదశి ఉపవాసం చేయడం అంటే శ్రీ మహా విష్ణువుకి దగ్గరగా ఉండడమే . ఏకాదశీ వ్రతాన్ని చేసేవారిని స్వయంగా ఆ విష్ణుమూర్తి (vishnu) చక్రధారిగా ఉంది కాపాడతారని దూర్వాసుని కథ చెబుతుంది. ప్రత్యేకించి విష్ణుమూర్తికి ఏంటో ఇష్టమైన వైశాఖ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి ఎంతో విశిష్టమైనది. దీనినే సిద్ధ ఏకాదశి లేదా అపర ఏకాదశి అంటారు.
ఈ రోజుకేవలం ఉపవాసం ఉండడం మాత్రమే కాదు జాగరణతో రాత్రంతా మేలుకుని భగవన్నామ స్మరణలో మునిగితేలడం మరో గొప్ప విశేషం! ఇలా జపం, ఉపవాసం, జాగరణలతో సాగే అద్భుతమైన తిథి ఇది! ఈ నాడు వ్రతాన్ని పాటించడం వలన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి లతో పాటుగా భద్రకాళి అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు ?
పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి క్రమం సాధించే సమయంలో ఆయనకి స్వేద జననం అయ్యింది. అది ఏకాదశి తిధి. బ్రహ్మగారి నుదుటన పట్టిన ఆ చెమట చుక్క రాలి కిందపడింది. సృష్టికర్త నుండీ రాలిన ఆ చెమట చుక్క నుండీ ఒక రాక్షసుడు ఉద్భవించాడు. వాడు ఆహారం ఆహారం కావాలి అంటూ విశ్వమంతా వ్యాపించసాగాడు. అప్పుడు బ్రహ్మగారు స్వేదం నుండీ ఉద్భవించినవాడికి ఆహారంగా ఏమివ్వాలా అని ఆలోచించారు. నువ్వు జన్మించిన ఈ ఏకాదశి నాడు ఎవరైతే భోజనం చేస్తారో ఆ భోజన పదార్థం, ఆహారం నీకు సమర్పించబడినది. కనుక ఈ రోజు ఆయా ఆహార పదార్థాలని ఆశ్రయించి ఉండు. భగవంతునికి అర్పించిన ఆహారాన్నే జీవులు తినాలి. అలా అర్పించకుండా, ఏకాదశినాడు తినేవాడు పాపి అవుతాడు. ఆ ఆహారం నీకు చెందుతుంది అని ఒక నియమం చేశారు. కనుక మనం ఏకాదశి నాడు ఉపవాసం (vupavasam) చేయాలి. ఏకాదశి వ్రతం - ఉపవాస వ్రతం విష్ణువుకు ప్రీతికరం.
భద్రకాళి జయంతి :
దీనినే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భద్రకాళి జయంతి’గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అయ్యింది . ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు, తన జటాజూటం నుంచి వీరభద్రుని, భద్రకాళిని సృష్టించాడు. దుష్టసంహారం చేసే వీరభద్రుడు రుద్రస్వరూపమయితే, భద్రకాళి అమ్మవారి ఉగ్రస్వరూపమే. ఆ ఉగ్రత్వం రాక్షసమూకలకే కానీ శరణన్న భక్తులకు కాదు. భక్తులెప్పుడూ ఆమెకి కన్నబిడ్డలే! ఆ భద్రకాళి అవతార దినోత్సవం ఈ సిద్ధఏకాదశే అనేది విశ్వాసం. అందుకే ఈ రోజు భద్రకాళికి విశేష అర్చనలు చేస్తారు.
జలకృద ఏకాదశి :
ఇక ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే తెలియవస్తున్నాయి . అయితే వేదాంతంలో పరం అంటే ఇహలోకానికి సంబంధంలేనిది , పరమాత్మ స్వరూపమైనది, అపర అంటే లౌకికమైనది అని అర్థం. ఈ అపర ఏకాదశితో ఇహానికి , పరానికి సంబంధించిన బాధలన్నీ తొలగిపోయి, ఆ పరమాత్మ సాన్నిధ్యం ప్రాప్తిస్తుంది. ఇందుకు శిశువుని కప్పి ఉండే మాయపొరని అపరము అని పిలవడమే నిదర్శనం. అటువంటి మాయ పొరని తొలగించి, పరమేశ్వరుని దర్షింపజేసే దివ్యమైన తిధిగా అపర ఏకాదశిని చెప్పుకోవచ్చు. దీనికి నిదర్శనంగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు , ధర్మరాజుతో ఇలా చెప్పారు. ‘అపర ఏకాదశి రోజున నన్ను నిష్ఠగా పూజిస్తే, గొడ్డలితో చెట్టుని నరికినట్టుగా, అగ్ని అడవిని దహించేసినట్టుగా, సూర్యుడు చీకటి చీల్చిపారేసినట్టుగా మనుషుల పాపాలన్నీ నశించిపోతాయి. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే అపర ఏకాదశిని పాటించడం అనంత పుణ్య ఫలాన్ని అనుగ్రహిస్తుంది.
వ్రత విధానం ఇలా :
ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజు తలార స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసాన్ని ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ చేసి ద్వాదశి ఘడియల్లో పారణ చేసి ఉపవాసాన్ని విరమించాలి.
ఇలా మనం అపరి ఏకాదశి ఉపవాస వ్రతం చేస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందం చేకూర్తుంది, పుణ్యబలం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం అంటుంది సంప్రదాయ విజ్ఞానం. కాబట్టి ఈరోజు మనం ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం.
శుభం .
Sidda Ekadasi, Apara Ekadasi
#siddaekadasi #aparaekadasi #vaisakhabahulaekadasi #bhadrakalijayanti