ఒక దేవతకి నైవేద్యం పెట్టిన పదార్థాన్ని మరొక దేవతకి పెట్టొచ్చా ?
ఒక దేవతకి నైవేద్యం పెట్టిన పదార్థాన్ని మరొక దేవతకి పెట్టొచ్చా ?
- లక్ష్మి రమణ
ఒకరికి ఇచ్చిన వస్తువులు మరొకరికి ఇవ్వరాదు అని శాస్త్రం చెబుతోంది . ఒక దేవతకు గానీ, వ్యక్తికి గాని అర్పించిన ద్రవ్యాన్ని కానీ, వస్తు విశేషాలను కానీ ఇలా వేటిని కూడా మరొక దేవతకు అర్పించడం దోషము. అదేవిధంగా ఒక మనిషికి ఇచ్చిన ద్రవ్యాన్ని కానీ, వస్తు విశేషాలను కానీ వేరొకరికి ఇవ్వడం కూడా దోషమే. అయితే దైవానికి లేదా మానవులకు ఒకరికి ఇచ్చిన దానిపై మనకు ఏ విధమైన అధికారము ఉండదా ? అంటే అందుకు ఉదాహరణగా ఈ ఊసరవెల్లి కథ పురాణాల్లో మనకి కనిపిస్తుంది .
ఒకరికి ఇచ్చేసింది మరొకరికి ఇవ్వాలంటే, దానిని ముందుగా మనం తిరిగి తీసుకోవాలి కదా! దానివల్ల దోషం సంక్రమిస్తుంది. అంటే ఇచ్చిన దానిని తిరిగి స్వీకరించిన దోషం సంక్రమిస్తుంది. ఆ విధంగా ఒకరికి ఇచ్చిన దానిని మరొకరికి ఇచ్చిన దోషం కారణంగానే నృగుడు అనే మహారాజు ఊసరవెల్లిగా మారవలసిన శాపాన్ని పొందాడు. ఈ వృత్తాంతము భాగవత పురాణంలోనూ, వ్యాసభారతంలోనూ చెప్పబడి ఉంది.
పూర్వం నృగుడనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు బంగారు ఆభరణాలతో అలంకృతులైన దూడలతో కూడిన గోవులను నిత్యము అసంఖ్యాకంగా దానమిస్తూ ఉండేవాడు. ఒకసారి అలా దానం ఇచ్చిన ఆవు ఒకటి తిరిగి వచ్చి తిరిగి రాజావారి ఆవుల మందలో కలిసిపోయింది. అది తెలియక నృగమహారాజు మరొక బ్రాహ్మణుడికి అదే గోవుని దానంగా ఇచ్చాడు. దాంతో దానం పుచ్చుకున్న విప్రులు ఇద్దరూ వివాదపడి చివరకు రాజు అయిన నృగుని వద్దకు వెళ్లారు. ఎన్నో రోజుల వరకు నృగుడు వారికి దర్శనం ఇవ్వలేదు. ప్రజలను పట్టించుకోని ఆ రాజు పై వారికి కోపం కలిగింది.
ప్రజలు తమ విన్నపాలు చెప్పుకోవడానికి వీలుగా పరిపాలకుడు ఉండాలి కానీ, ప్రజలకు సమీపించరాని వాడుగా పాలకుడు ఉండరాదని ఆ విప్రులు ధర్మాన్ని తలిచారు. అధికార మద్దతుతో ప్రజలకు చేరరాని వాడుగా ఉన్నందుకు ఆ రాజు పై విప్రులు ఆగ్రహించారు. ప్రజలకు అందుబాటులో లేనందు వల్ల, అపరాధి అయినటువంటి నృగమహారాజును ఊసరవెల్లిగా మారి, ఒక పాడు నూతిలో పడి ఉండమని శపించారు.
విప్రుల శాపము గడ్డిమంటలాంటిది. వెంటనే చల్లారిపోతుంది. దాంతో నృగుడుకి శాపవిమోచనం కూడా అనుగ్రహించారు . దాంతో అలా ఊసరవెల్లిగా మారి, అనేక సంవత్సరాలు ఉన్న తర్వాత, యదువంశంలో జన్మించిన శ్రీ మహావిష్ణువు కరస్పర్శ వల్ల నృగునికి శాప విముక్తి కలుగుతుందని అనుగ్రహించారు ఆ విప్రులు. ఆ విధంగా ఒకే గోవును తనకు తెలియకుండా విప్రులు ఇద్దరికీ దానమిచ్చిన ఫలంగా శాపాన్ని పొందారు నృగమహారాజు.
ఆ తర్వాత విప్రులు దానంగా స్వీకరించిన గోవుని ఇద్దరు కలిసి వేరొక విప్రునికి ఇచ్చేసి వెళ్లిపోయారు. తాను దానం చేసిన గోవును తిరిగి స్వీకరించిన పాపం వల్ల నృగునికి నరకలోకం ప్రాప్తించింది. కొంతకాలం నరకంలో ఉన్న తర్వాత, నృగుడు తాను పొందిన శాపం వల్ల ఊసరవెల్లిగా అంటే తొండగా జన్మించాడు. ఆ విధంగా కొన్ని వందల సంవత్సరాలు పాడు నూతిలో ఉన్న నృగమహారాజు కాలాంతరంలో శ్రీకృష్ణుని కరస్పర్శ వల్ల శాపవిమోచనాన్ని పొందారు.
ఇటువంటి అనేకానేక కథలు మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఒకరికి దానం ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకొని మరొకరికి దానంగా ఇవ్వడం, ఒక దేవతకి నివేదించిన పదార్థాన్ని మరొకరికి నివేదించడం మహా అపరాధాలు , దోషాలు. కాబట్టి అటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు .
#naivedyam #danam
Tags: naivedyam, danam, king, raja, nruga, krishna