కటిక నేలపైన పెట్టకూడని వస్తువులు ఏమిటి?
భూమిపైన కటిక నేలపైన పెట్టకూడని వస్తువులు ఏమిటి?
- లక్ష్మి రమణ
కొన్ని వస్తువులని భూమిమీద పెట్టకూడదు . అలా పెట్టడమే మహా పాపమని పురాణాలు చెబుతున్నాయి . దేవీ పురాణం చెబుతున్న విధంగా ఏయే వస్తువులని, ప్రత్యేకించి పూజా ద్రవ్యాలని వీటిని కింద పెట్టకూడదనే విషయాన్ని ఇక్కడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం .
ముత్యాలు, ఆల్చిప్పలు, తులసి, పూజా ద్రవ్యాలు, శివలింగము, దేవతా మూర్తులు అంటే దేవతల విగ్రహాలు, పటాలు మొదలైనవి అన్నీ. వీటితోపాటుగా శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞ సూత్రము, పువ్వులు, పుస్తకాలు, పుష్పమాల, జపమాల, రుద్రాక్ష, గంధపు చెక్క, దర్భలు, కర్పూరము, బంగారము, గోరోచనము, చందనము, సాలగ్రామ శిలలు వీటిని నేరుగా ఎటువంటి ఆచ్చాదనా లేకుండా భూమిపైన పెట్టకూడదు.
ఈ వస్తువులను భూదేవికి సమర్పించినా, నేరుగా భూమిపై పెట్టినా అటువంటివారు నరకానికి వెళతారని శ్రీమహావిష్ణువు భూదేవితో చెప్పినట్టుగా దేవీ భాగవతం తెలియజేస్తోంది. దీన్ని బట్టి నేలమీద దీపం వెలిగించిన వారు ఏడు జన్మల వరకు గుడ్డివాడుగా అవుతారని దేవీ భాగవతం చెబుతోంది. ఏ ఆచ్చాదనా లేకుండా నేలపైన శంఖాన్ని పెడితే, వారికి జన్మాంతరంలో కుష్టు రోగం వస్తుంది. ఇంకా ఎన్నో నరక శిక్షలు కూడా చెప్పబడ్డాయి.
కాబట్టి ఈ వస్తువులని కింద పెట్టకుండా కింద ఒక పీటని గానీ , మంచి ఇత్తడి పళ్ళాన్ని గానీ, హీనపక్షంలో ఒక పేపర్ గానీ వేసి వాటిని ఉంచాలి . ఈ విషయాలు గుర్తుంచుకుంటారు కదూ !
శుభం !!