మండపారాధన అంటే ఏమిటి?
మండపారాధన అంటే ఏమిటి? అందులో వక్క , పసుపుకొమ్ము , చిల్లర ఎందుకు పెట్టిస్తారు ?
- లక్ష్మి రమణ
ఏ వ్రతం చేసినా, పూజ చేసినా, కలశ స్థాపన చేసి , మండపారాధన చేస్తారు . మండపారాధన అంటే దేవతలని ఆహ్వానించడం. శుభకార్యానికి మన ఇంటికి అతిధులని, బంధువులని ఆహ్వానిస్తాం కదా ! అలాగే, స్వామీ మీకు పూజచేయాలనుకుంటున్నాం! మా ఇంటికి దయచేయండి అని మంత్రం యుక్తంగా వారిని ఆహ్వానిస్తాం . వారికి అతిధులకు చేసినట్టే , మర్యాదలు చేస్తాం. కలశరూపంలో మనం చేయాలనుకుంటున్న వ్రతం లేదా పూజాతాలూకు ప్రధాన దైవాన్ని ఆవాహన చేసి , ఆ తర్వాత గ్రహాలనీ, దిక్పాలకులనీ, పంచపాలకులనీ స్థాపన చేస్తారు. ఇది ఎప్పుడూ చేసినా , ఆ చేతలకి అర్థం తెలుసుకోవడం అవసరం. అప్పుడు మనసు వాటిని భావ యుక్తంగా ఆచరిస్తుంది . చేసే పూజవల్ల పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది . ఆ కృత్యంల గొప్పదనం అర్థం అవుతుంది .
ఈ విధంగా మన చేత పండితులు ఆచరింపజేసే మందపారాధనకి ఒక ప్రత్యేక క్రమ పద్ధతి ఉంటుంది . వ్రతం చేసుకోదలచిన ప్రదేశంలో చక్కని రంగవల్లులు దిద్దాలి. ఆపైన అరటిఆకు గాని, వెడల్పయిన పీటగాని వేసి దానిపై నూతన వస్త్రం పరచాలి. దానిపై బియ్యం పోయాలి . ధాన్యం ప్రాణాధారం కాబట్టి ఆ ధాన్యాన్ని పోయమని చెబుతారు . ఆ తర్వాత గణేశాది పంచపాలకులని (గణపతి , బ్రహ్మ, విష్ణు, రుద్రుడు,గౌరి)ఆహ్వానం చేస్తారు . ఆ తర్వాత నవగ్రహాలనీ వాటి తాలూకు అధి దేవతా, ప్రత్యధిదేవతా సహితంగా ఒక వరుస క్రమంలో సమంత్రకంగా ఆహ్వానం పలుకుతారు. ఇందులో ఆయా గ్రహల శక్తి మన దేహంపైన, మన నిత్య జీవితంలోనూ ఏవిభాగం పై వుంటుందో తెలియజేసే వివరణ కూడా ఉండడం విశేషం . ఆవిశేషాలు ఒక సారి పరిశీలించండి .
సూర్యుడు - ఆత్మ - అగ్ని - రుద్రుడు
చంద్రుడు - మనస్సు - ఆపః - గౌరి
కుజుడు - రోగ, - భూమి - క్షేత్రపాలకం.
బుధుడు - బుద్ధి - విష్ణుం - నారాయణం
గురువు - సంతానం - బ్రహ్మణం - ఇంద్రుడు
శుక్రుడు - కళత్ర - ఇంద్రాణి - ఇంద్రమరుత్తులు
శని - కర్మ - యమం - ప్రజాపతి
రాహువు - చక్షువు - గామం - సర్వాంగ
కేతువు - మోక్ష - చిత్రగుప్తుడు -బ్రహ్మణం
ఆ తర్వాత అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, క్షేత్ర పాలకుడు, భూమి, ఆకాశం ఇలా సమస్త దేవతలను వారి కుటుంబ, పరివారం, వాహనం, ఆయుధసమేతంగా విచ్చేయమని సమంత్రకంగా ఆృహ్వానిస్తూ వారి వారి స్థానాలకు వారిని ఉపస్థితులను చేస్తారు .
సాధారణంగా వీరితో పాటు గృహస్థుల జన్మనక్షత్రం, అధిదేవత, ప్రత్యధిదేవత సహితంగా ఆహ్వానం చేస్తారు . దీని వలన గృహస్థులు కు గోచార రీత్యా క్షేమం కలుగుతుంది .
వీరందరికీ మంత్రం సహితంగా ఆహ్వానం చెప్పగానే వారు విచ్చేస్తారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరిని ఓ తమలపాకు పైన వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరం, అక్షింతలు, రూపాయికాసు పెట్టి స్వాగతం పలుకుతాం. ఈ వస్తువుల్లో వక్క దేవతాంశ గాను, పసుపు కొమ్ము దేవతాంశ స్త్రీ రూపంగాను, ఖర్జూరం నివేదనగాను, అక్షింతలు వారికి అర్చన గాను, రూపాయి కాసు హిరణ్యరూపకంగాను సమర్పిస్తారు . ఇవి విశ్వాంతరాళలలో నుండి వచ్చే దేవతలకు, వారి పరివారాలకు ఆహ్వానం పలుకుటలో మనకు తెలియని లోపాలను నివృత్తి చేస్తాయి. వారి నిమిత్తం దాన, దక్షిణలుగా ఉపయోగపడతాయి .
ఆ విధంగా వీరందరి మధ్య మనం పూజించదలచుకున్న ప్రధాన దైవాన్ని , ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం అయితే, సత్యనారాయణ స్వామిని కలశరూపకంగా సకల నది జలాలు, సకల దిజ్మండలాల మధ్య, సకల పరివార సహితంగా ప్రతిష్ట చేస్తాం. ఆ తర్వాత సంకల్ప ప్రకారంగా చేయవలసిన మిగతా పూజని జరిపిస్తారు మంత్రవేత్తలు. ఇంత విషయం, అంతరార్థం ఉన్నాయి మండపారాధనలో! ఈ సారి వీటిని భావన చేస్తూ పూజ చేసుకోండి ! దేవతా గణమంతా మీ ఇంట విందు ఆరగించిన అనుభూతి ఫలమూ తప్పక కలుగుతాయి . శుభం !!