దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు
దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు అంటారు ఎందుకు ?
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం నుండీ .
దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కున యమధర్మరాజు గారు ఉంటారు. ఎవరైనా మనకి నమస్కరిస్తే దానిని ఊరికే పుచ్చుకోకూడదు. వారిని ఆశీర్వదించి వారిని మనం ఏ రకంగా అనుగ్రహించగలమో ఆ విధంగా కాపాడాలి.
ఇప్పుడు యమధర్మరాజు గారికి నమస్కరిస్తే? ఆయన శక్తి అనుసారంగా ఆయన ఎలా అనుగ్రహించగలరో అలా అనుగ్రహిస్తారు. తప్ప నమస్కారాన్ని ఊరికే పుచ్చుకోరు ఎవరు. తప్పనిసరిగా ఆశీర్వదించి తీరాలి! ఎంత మేరకు వీలైతే అంత వరకు. “ఒహో! వీడికి పాపం ఈ శరీరం బాధాకరంగా ఉంది . అందుకని నన్ను శరణు వేడుతున్నాడు” అని శరీరంతో ఉన్న బంధనాన్ని తీసి వేస్తారు. లేదా, రోగాలు ప్రబలడానికి కారణం యమధర్మ రాజు గారి ఆగ్రహం అంటారు. “ఒహో నాకు నమస్కరించావు కదా, సరేరా అబ్బాయి(అమ్మాయి), నువ్వు చేస్కున్న పాపాలన్ని ఈ రోగం రూపంలో అనుభవించేయి, అప్పుడు ఇక నీకు వాటితో ఒక గొడవ వదిలిపోతుంది”. అని ఒక రోగాన్ని ప్రసాదిస్తారు, చేస్కున్న పాపాలు అన్ని పోయేలాగ. ఆయన చేతుల్లో పనులేంటో అవి కటాక్షించగలరు. కానీ ఈ రెండూ కూడా సహజంగా ఎవరూ కోరుకునే కోరికలు కాదు కాబట్టి దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.
ఒక్క సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని దిక్కులకి పెట్టే నమస్కారం తప్ప, ఇక వేరే ఎప్పుడూ దక్షిణ దిక్కుకి నమస్కారం పెట్టకూడదు. ఒకవేళ ఎవరైన పెద్దవారు దక్షిణ దిక్కున నిలబడినప్పుడు వారికి నమస్కరించాలి అనుకుంటే ‘అయ్యా కాస్త ఇటుగా తిరగండి, మీకు నమస్కరించుకుంటాను’ అని చెప్పి, దిక్కు మరల్చి, అప్పుడు నమస్కరించాలి. అది గురువుకైనా సరే తల్లిదండ్రులకైనా సరే.
#chaganti #chagantikoteswararao #dakshinadikku
Tags: namaskaram, chaganti koteswara rao, yama dharmaraju