పుష్యమాసంలో ముహూర్తాలు ఉండవా ?

పుష్యమాసంలో ముహూర్తాలు ఉండవా ? శూన్యమాసమా ?
- లక్ష్మి రమణ
పుష్యమాసంలో బోలెడన్ని పండుగలు వస్తాయి . సంబరంగా , సందడిగా ఉండే సమయం . అన్నింటికీ మించి కార్యాలయాలకి, పాఠశాలలకీ శలవులు దొరుకుతాయి. కానీ పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు మాత్రం ఉండవు . పుష్యమాసం పౌష్యమాసం కదా ! అటువంటి పుణ్యప్రదమైన రోజుల్లో ముహూర్తాలు ఉండకపోవడమేమిటి ?
మనకి కాలగణనలో సూర్యమానం, చాంద్రమానం అని రెండురకాల విధానాలున్నాయి . వాటిల్లో సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు. ధనుర్మాసము మొత్తము కూడా శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తము కూడా శూన్య మాసం కాదు.
ధనుర్మాసం ప్రారంభమైన కొద్దిరోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయినా ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. అదేవిధంగా ధనుర్మాసము అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు.
అదే విధంగా మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు.
ఈకాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. కనుక ముహుర్తాలు లేని ఈ నెలలను శూన్య మాసాలంటారు. ఎటువంటి దైవకార్యలయినా, పితృ కార్యాలయినా శూన్య మాసంలో చేయవచ్చు. ఎటువంటి నిషేధం లేదు.
సర్వేజనా శుఖినోభవంతు !!
#soonyamasam #muhurtam #gruhapravesam
Tags: muhurtham, muhoortam, soonya masam, pushya, masam, maasam