Online Puja Services

వల్లెవాటు వేసుకోవడంలోని అర్థం ఏమిటి?

3.144.4.54

వల్లెవాటు వేసుకోవడంలోని అర్థం ఏమిటి?
- లక్ష్మి రమణ 

పెళ్ళిళ్ళల్లో పెళ్లి కూతురు , కొన్ని సంప్రదాయాల్లో పెళ్లికూతురు అమ్మగారు కూడా ఈ వల్లెవాటుని ధరిస్తూ ఉంటారు . కోస్తా జిల్లాలలో, హిందూ పెళ్ళికూతురు మధుపర్కంతో పాటు విడిగా వేసుకొనే ఉత్తరీయం లాంటిదే ఈ వల్లెవాటు. వల్లెవాటును మామూలు ఉత్తరీయంలాగా కాకుండా, రెండు భుజాలపైనుంచి తీసి, ముందు భాగంలో  X ఆకారం వచ్చేలాగ వేసుకొంటారు. ఈ సంప్రదాయం గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువ కనబడుతుంది. ఈ సంప్రదాయానికి అర్థం ఏమిటి ? 

సాధారణంగా వల్లెవాటు మధుపర్కం చీరలాగే ఎర్రటి అంచుతో ఉండే తెల్లటి వస్త్రం. పెళ్ళిబట్టలు అమ్మే దుకాణాలలో వల్లెవాటును మధుపర్కంతో పాటు కలిపి అమ్ముతారు. కొన్ని కుటుంబాలలో పెళ్ళికూతురు తల్లికూడా కన్యాదాన సమయంలో వల్లెవాటు వేసుకొంటూ ఉంటారు.

 ఇంతకీ ఈ అసలు ఈ వల్లెవాటు వేసుకోవడంలోని అర్థం ఏమిటి? అంటే, ఇద్దరు వ్యక్తులని బంధనం చేయడం . పెళ్లంటేనే బంధం కదా ! అలా మంగళ సూత్రం కట్టడం , వల్లెవాటు కట్టడం కూడా ఈ బాంధవ్యాన్ని ఏర్పరిచే కృత్యాలే కానీ వేరు కాదు . ఆవుల్ని బంధించడానికి వాడే గళ సూత్రంతో మంగళ సూత్రాన్ని పోల్చిన మహానుభావులూ లేకపోలేదు . పెళ్ళిలో కట్టే సూత్రాన్ని ‘మంగళ’సూత్రంగా, పవిత్రమైన సూత్రంగా పెద్దలు పేర్కొనడాన్ని ఇక్కడ మనం గమనించాలి . ఈ మాంగల్యం కట్టేప్పుడు కూడా వరుడు నా జీవన సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను.  అని చెబుతాడు . ఆ మంత్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి . అందులోని గొప్పదనాన్ని గ్రహించాలి . ఈ క్రమంలోనిదే వల్లెవాటు కూడా ! ‘వల్లె’ అన్న పదానికి ‘బంధించే తాడ’ని అర్థం . ‘వాటు’ అంటే ‘విధానం’. ఇక్కడ వల్లెవాటు అంటే దంపతుల మధ్య చేసే వివాహ బంధనం అని అర్థం చేసుకోవాలి . కన్యాదానానికి ముందర కట్టించే ఈ వల్లెవాటుకి అర్థం  ‘శ్రీహరిగా భావించి లక్ష్మీ స్వరూపమైన ‘కన్య’ని దానం చేస్తున్నానయ్యా ! ఆమెను భార్య అనే బంధంతో గ్రహించి చక్కని సంతానాన్ని పొందమని’ పిల్ల తల్లిదండ్రులు చెప్పడం.     

ఈ విధంగా గొప్ప అంతరార్థం కలిగిన క్రియలు మన సంప్రదాయ వివాహాల్లో ఉన్నాయి .దేశకాల పరిస్థితులని బట్టి ఇరుగుపొరుగు జాతులవారి ఆచారాలు అనుకరించడం, అవలంబించడం అన్ని సమాజాల్లో జరుగుతుంది. పెళ్ళికి సంబంధించిన అనేక ఆచారాలు అంచెలంచెలుగా, తరతరాలుగా పరిణామం చెందుతూ వచ్చాయి. ఆ క్రమంలోనే కొన్ని ఆచారాలు కూడా కనుమరుగు కావడం సంభవించి ఉండవచ్చు.  అలాటి వాటిల్లో తాజాగా వల్లెవాటు కూడా చేరిందేమో అనే అనుమానం కొందరు కోస్తా జిల్లాల వాసులు వ్యక్తం చేస్తూ ఉండడం ఇక్కడ గమనార్హం . మన సంప్రదాయాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాల్సిన ఆవసరం, బాధ్యత మనందరికీ ఉంది. 

శుభం !!

#vallevatu #madhuparkam #marriages

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda