ధనుర్మాసంలో వాకిళ్ళ ముందు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ?
ధనుర్మాసంలో వాకిళ్ళ ముందు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ?
- లక్ష్మి రమణ
ధనుర్మాసం విష్ణు భక్తిని చాటే నెల. ఈ నెల రోజులూ వైష్ణవాలయాలన్నీ ఉదయాన్నే తిరుప్పావై పారాయణలతో, ప్రత్యేక పూజలతో అలరారుతూ ఉంటాయి. ఉత్తరాయణానికి సూర్యుడు ఉద్యుక్తుడయ్యె ఈ పరమ పవిత్ర కాలంలోరకరకాల ముగ్గులు వేసి, ఆ ముగ్గుల్లో చక్కని గొబ్బెమ్మలు పెట్టి, వాటిని గుమ్మడి పూలతో అలంకరించడం మన సంప్రదాయం . గొబ్బెమ్మలు కేవలం పేడ ముద్దలు కాదు. సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపాలు. గౌరమ్మ రూపాలు. కృష్ణయ్య ఆడిపాడిన గోపెమ్మలు. ఆ కథలేమిటో, ఈ సంప్రదాయ విధానమేమిటో ఇక్కడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం .
మళ్లీ చూడవచ్చావ గొబ్బియల్లో
మంచి గంధం పూతలను గొబ్బియల్లో
మళ్ళీ పూయ వచ్చావా గొబ్బియల్లో
అంటూ గొబ్బి దేవతలకు కన్నెపిల్లలు స్వాగతం పలుకుతారు. పల్లెపడుచులు పాడుకునే గొబ్బిపాటలు ప్రముఖ వాగ్గేయకారులని సైతం ఆకర్షిస్తాయి. ప్రముఖ వాగ్గేయకారులు తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా అనేక గొబ్బిపాటలు రచించారు.
గొబ్బెమ్మ అంటే పేడముద్దా ?
ఈ గొబ్బెమ్మలని గౌరీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు . ఆవు సకల దేవతా స్వరూపం . గోమయాన్ని పరమ పవిత్రంగా భావిస్తాం. అటువంటి గోమయం లక్ష్మీ స్వరూపమే . అటువంటి గోమయాన్నితీసుకువచ్చి, కొంత నీటిలో కలిపి కళ్ళాపి చల్లి, ఆ పచ్చటి నేలమీద తెల్లని బియ్యపు పిండితో చుక్కలు పెట్టి , చక్కని ముగ్గులు తీరుస్తారు. ఇదంతా సూర్యోదయానికి పూర్వమే ఆ సూర్య భగవానుడికి స్వాగతం పలుకుతున్నామా అన్నట్టుగా ఇంటి ఆడపడుచులు చేసే ముచ్చట .
ఆ తర్వాత చక్కగా ఆవుపేడని ముద్దలుగా చేసి, వాటిపైన కూడా బియ్యపు పిండితో ముగ్గు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి , పైన పూవులతో అలంకారం చేస్తారు. విశేషించి ఈ కాలంలో దొరికే , చామంతి, బంతి, బీర, గుమ్మడి పూలతో అలంకరిస్తారు. అప్పుడు ఆ పేడ ముద్దలు గొబ్బెమ్మలవుతాయి. గౌరీ స్వరూపాలవుతాయి. వీటిని చక్కగా పూజించి చక్కగా తీర్చిన ముగ్గుల్లో ఉంచుతారు. ఇలా నెలనాళ్ళ పాటు ఈ గొబ్బెమ్మలు పెట్టె దీక్ష కొనసాగుతుంది. దీనివెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . సృష్టి రహస్యాలున్నాయంటే, అతిశయోక్తి కాదు .కానీ అవి అలా ముగ్గుల్లో అడిగినప్పుడు చూసే కళ్ళకి మనసుంటే, అమ్మవారు కొప్పున పూలెట్టుకొని ముగ్గుల మనోహర మండపంలో దర్శనమివ్వక మానరు !!
గొబ్బెమ్మలని ఏం చేయాలి ?
నెలంతా ఇలా చేసిన గొబ్బెమ్మలని ఎండకి ఎండబెడతారు. పూర్వకాలంలో గోడకి కొట్టి ఎండబెట్టేవారు. ఇప్పుడయితే, మనం ప్లాస్టిక్ సంచులమీద కొట్టి ఆరబెట్టుకుంటున్నాం . వీటిని దండగా గుచ్చి భోగినాడు మంటల్లో వేస్తారు. దీనివల్ల తమ పిల్లా పాపలకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి వృద్ధి పొందాలని అగ్ని దేవుడిని పూజిస్తారు. ఆ తర్వాత రథ సప్తమి నాడు వీటిమీదే పాలు పొంగించి, చక్కగా పొంగలి వండి సూర్యునికి నివేదిస్తారు. అలా సూర్యారాధన, సూర్య కిరణాలు కూడా కలిసిన ఆ నివేదన వలన కూడా ఆయురారోగ్యాలు ఇంటిల్లిపాదికీ సిద్ధిస్తాయి .
మకర సంక్రాంతిని గ్రామీణ స్త్రీలు గొబ్బెమ్మల పండుగ అని పిలుస్తారు. ఈ గొబ్బెమ్మలు వరుసగా గోవర్ధనగిరికి, గోమాతలకు, గోపాలకృష్ణునికి సంకేతాలుగా చెప్తారు. ఆ విధంగా మూడు గొబ్బిళ్ళు తయారు చేసి , ఒక పీట మీద ఉంది , సంక్రాంతి వేళ సాయంకాలం, పడతులంతా గొబ్బెమ్మల చుట్టూ చేరి చేతులు తడుపతూ ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుకుంటారు. ఈ పాటలు అయ్యాక పసుపు కుంకుమలతో పాటు, పెసరపప్పు, శెనగలు, మరమరాలు అటుకులు మొదలైనవి నై వేద్యంగా పెట్టి, పేరంటం చేస్తారు .
దుక్కులు దుక్కులు దున్నారంట
ఏమి దిక్కులు దున్నారంట
రాజు వారి తోటలోనా
జామి దుక్కులు దున్నారంట
అక్కల్లారా చెల్లెల్లారా
చంద్రగిరి భామల్లారా
గొబ్బియల్లో గొబ్బియల్లో..
అంటూ ఆశాజనకమైనటువంటి రేపటి జీవితానికి ఈ నాటి నుంచే మంచిని కోరుకునే పాటలుగా గొబ్బి పాటలు ప్రాశస్త్యం పొందాయి. ఈ ఆటపాటల వల్లా , నెలరోజుల ఈ గొబ్బిళ్ళ వ్రతం వల్ల కన్నెపిల్లలకి చక్కని వరుడు దొరుకుతాడని , కన్నయ్యలాగా ప్రేమగా చూసుకుంటాడని నమ్మిక . వివాహంలో కలతలు తీరి ఆదిదంపతుల అనుగ్రహంతో అన్యోన్యత కలుగుతుందని విశ్వాసం.
ఇంటిముందర ముగ్గులు వేసి, వాటిల్లో గొబ్బిళ్ళు పెట్టడం అనే సంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, శాస్త్ర చర్చలని పక్కన పెడితే, ఈ సంప్రదాయంలో ఉన్న ఆనందం, సౌందర్యం, అనుభూతి యెంత రామణీయమైనవో, అవి మనకి మిగిల్చే జ్ఞాపకాలు యెంత గొప్పవో ఒకసారి ఆలోచించుకోవాలి . మన ధర్మం మీద గౌరవం, నమ్మకం ఉన్నప్పుడు సందేహాలకు తావుండదు . ఆ గౌరవాన్ని మనం నిలుపుకొని భద్రంగా ముందుతరానికీ అందిద్దాం . శుభం !!
#gobbemmalu #sankranthi #dhanurmasam
Tags: gobbemmalu, sankranthi, dhanurmasam, bhogi