ఈ రోజు కోసిన పూలని రేపు పూజకి ఉపయోగించవచ్చా ?
ఈ రోజు కోసిన పూలని రేపు పూజకి ఉపయోగించవచ్చా ?
- లక్ష్మి రమణ
పూజని పూలతో చేసినప్పుడు ఆ స్వామి ఎంతో సౌందర్యదీప్తితో శోభాయమానంగా దర్శనమిస్తారు. అమ్మవారికి పూలతో చేసిన పూజ మరింత త్వరగా ఫలిస్తుంది అని చెబుతారు . అమ్మకి కదంబ పూలంటే చాలా ఇష్టం అట . ఆవిడకి కదంబవనవాసిని అని పేరు . మన మనసుని కూడా విరిసిన పుష్పంగా, అంతటి సౌందర్యంతో వికశించేలా, చక్కని ఆధ్యాత్మిక భావనలని సౌరభాన్ని నింపుకొని ఆ పరమాత్మ పాదాల చెంతన అర్పిస్తే, ఆ పరంధాముడు అడిగినదల్లా ఇచ్చి ఆదరిస్తారు. గోదామాతగా అమ్మా తానూ అల్లిన ఆ భక్తి పూలదండలతోనే కదా ఆ రంగనాథుని మనస్సుని దోచుకుంది. ఆ దేవదేవుని అనుగ్రహానికి మనలని దగ్గర చేసే పూలని ఏ విధంగా స్వామికి సమర్పించాలనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం .
పూజకి సాధారణంగా మనం పూలని మన ఇంటి పెరటి నుండీ అర్పిస్తున్నామా ? కొనుక్కొస్తున్నామా అనేది కూడా ఒక పరిశీలించాల్సిన విషయమే. పూలని తోటలో నుండయితే, మన పెరటి నుండయితే, ఏరోజు కారోజే కోసుకొచ్చి, దేవునికి అర్పిస్తాం కదా ! ఇంట్లో పూసిన పూలనయితే తాజాగానే స్వామికి అర్పిస్తాం . ఇలా ఏరోజుకారోజు తాజాగా పూచిన పూలని అర్పించడం ఉత్తమమైన విధానం . ఇలా మనం పెంచిన చెట్ల నుండీ సమర్పించే పూల వల్ల మోక్షం సిద్ధిస్తుందట.
సాధారణంగా పూలని ఆ పక్కింట్లో ఈ పక్కింట్లో పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళినప్పుడు గోడలమీది నుండీ తీసుకొచ్చే పూలతో పూజ చేయ కూడదు. అది దోషం కూడా . యజమాని అనుమతితో కోసుకున్న పూలతో పూజ చేయవచ్చు . కొనుక్కొచ్చిన పూలతో పూజించడం అధమం .
మరి, ఏరోజు కోసిన పూలతో ఆ రోజు పూజ చేసే వీలు లేనప్పుడు ఏం చేయాలి ? మారేడు, తులసి, పద్మాలు, లేదా తామర పువ్వులు ఈ మూడు రకాలు మరుసటి రోజు కూడా వాడొచ్చు. ఇది తప్ప మిగిలిన పువ్వులని ఏ రోజు కోసిన వాటిని ఆ రోజే ఉపయోగించాలి. మరుసటి రోజుకి పనికిరావు.
ఒకసారి అర్చన చేసిన తరువాత ఆ పుష్పాలు నిర్మాల్యం అవుతాయి. కాబట్టి వాటిని తర్వాతి రోజు ఉపయోగించడానికి పనికిరావు. వీటికి నిర్మాల్య దోషం ఉంటుంది గనుక వాటిని ఉపయోగించకూడదు.
ఇవికాక వెండి బంగారం వంటి లోహాలతో చేసినటువంటి బిల్వ దళాలు పుష్పాలకు నిర్మాల్య దోషము ఉండదు. కాబట్టి వాటిని కడిగి శుభ్రపరిచి ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చు.
#flowers #pooja
Tags: pooja, puja, flowers, maredu, tulasi, padmam,