పారాయణం అంటే ఏమిటి ?
పారాయణం అంటే ఏమిటి ? అసలు దానివల్ల ఉపయోగం ఉంటుందా ?
- లక్ష్మీరమణ
చాలీసా 5, 9, లేదా 11 రోజులపాటు పారాయణ చేస్తారు . భగవద్గీతని నిత్యమూ ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేస్తుంటారు. భాగవతాన్ని ఏడు రోజుల్లో పారాయణ చేసి పూర్తి చేయడం ఒక పధ్ధతి. లలితా సహస్రనామ పారాయణ ఇల్లాళ్ళు అందరూ కలిసి వారానికి ఒకరి ఇంట్లో అనుకోని వైభవోపేతంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా సహస్రనామాలనో , పౌరాణిక గ్రంధాలనో , చాలీసానో నియమిత రోజుల్లో, నియమిత సంఖ్యలో పారాయణ చేయడం వలన ఉపయోగం ఉంటుందా ? అని ప్రశ్నిస్తే, పండితోత్తములు ఈ విధంగా చెబుతూ ఉన్నారు.
పరా సంబంధమైనది పారాయణం. అయనం అంటే ప్రయాణం. పరాగతి, పరాశక్తి లలో ఉండే శబ్దము * పరా* అంటే అన్నిటికంటే శ్రేష్ఠమైనది అని అర్ధం. దీన్ని అనుసరించి శ్రేష్ఠమైన ప్రయాణమే పారాయణము. ఈ ప్రయాణం భగవంతుని పొందడం కోసము చేసేటటువంటిది. ఉత్తమ గతి పొందడానికి చేసే ప్రయాణం.
‘నామ స్మరణాత్ అన్యోపాయం న హి పశ్యామః భవతరణే ..’అని
కలియుగంలో పరమాత్ముని పొందడానికి ఉన్న మార్గాలలో ఇష్టదైవ నామం స్మరించడం తేలికైనది, ఉత్తమమైనది . ఏకాగ్రతతో భగవన్నామాలు గానీ, భగవంతుని లేదా భాగవతుల విషయాలు గానీ స్మరించడం, చింతించడం పారాయణం అని వ్యవహరించడం జరుగుతుంది .
పారాయణం అంటే ఉట్టిగా అక్షరాలని చదువుకుంటూ వెళ్లిపోవడం కాదు. అందులో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి . అప్పుడు ఆ భగంతుని నామ కథలో లీనమై తాదాత్మ్యతని పొందగలం . అంతరార్థం సంగతి పక్కన పెడితే, కనీసం అర్థం కూడా తెలియకుండా, అటువంటి పారాయణం చేసినప్పటికీ ఫలితం ఉండదు. భగవంతునికి కావలిసినది మన మనస్సు అనే ప్రధానమైన పూజాద్రవ్యం ఒక్కటే . అది గుర్తుంచుకొని పారాయణం చేయడం మొదలుపెట్టాలి . పారాయణ చేసే విషయంలోని అర్థం బాధపడే కొద్దీ అందులో మనకి కలిగే సంతృప్తి అధికంగా ఉంటుంది . చదవడానికి సరిగా రానివాళ్ళు, ఇతరులు పారాయణం చేస్తూ ఉంటే విని ఆనందిస్తారు. అలా చదివిన వారికి, విన్నవారికి కూడా సద్గతులు అనుగ్రహిస్తానని పరమాత్మ అనేక పారాయణా గ్రంధాలలో చెప్పి ఉన్నారు .
భగవద్గీత, రామాయణము, భాగవతము, దేవీ భాగవతం, దుర్గా సప్త శతి, భగవద్గీత - పారాయణం చేయడం మనకి తెలిసినదే. దేవతల సహస్ర నామాలు గూడా పారాయణం చేస్తారు. వేదము , పురాణాలూ పారాయణ క్రమంలో ఉండేవే. రామాయణం , విష్ణు సహస్ర నామ స్తోత్రం , వేదంలో కొన్ని పన్నాలు నిత్య పారాయణం చేయడం కొందరు విధిగా పెట్టుకొని పఠిస్తూ ఉంటారు. దేవి నవరాత్రులలో, చైత్ర మాసం శ్రీ రామోత్సవాలలో ఈ పారాయణాలు విశేషంగా చేస్తారు. భాగవతం ఏడు రోజులలో చదివి పూర్తి చేయడం ఒక సంప్రదాయం. వీటిని పారాయణ చేసే విధానాల్లోనూ కొన్ని పద్ధతులని అవలంభిస్తూ ఉంటారు.
ఉదాహరణకి రామాయణం సుందర కాండ మాత్రమే పారాయణం చేయడం ఒక పధ్ధతి . ఇందులో ప్రతి రోజూ ఏడు సర్గలు మాత్రమే చదువుతూ ఆ విధంగా ఏడు సార్లు పారాయణం చేస్తారు. చివరలో రామ పట్టాభిషేకం ( యుద్ధ కాండ లోది ) చదువుతారు.
ఒక సర్గ చదివేటప్పుడు, అది పూర్తి అయ్యేవరకు మధ్యలో లేవడం వంటివి చేయరు. మరుసటి సర్గ మొదటి శ్లోకం ప్రారంభించి నాటి పారాయణం నివేదన మంగళ హారతులతో పూర్తి చేస్తారు.
ఇలా కొన్ని నియమాలు పెట్టుకొని అవి పాటించడం వల్ల, భగవంతుని కథలని పారాయణ చేయడం వలన ఏకాగ్రత పెరుగుతూ వచ్చి ధ్యానానికి మనసు నిలబడుతుంది. సన్మార్గంలో నడవడానికీ , ఉన్నతి సాధించడానికీ సాయపడుతుంది . కలియుగంలో భగవంతుని పొందే సులభోపాయం పారాయణం.
శుభం !!