కంచి గరుడ సేవ అని ఎందుకంటారు?
కంచి గరుడ సేవ అని ఎందుకంటారు?
- లక్ష్మీరమణ
గరుక్మంతుడు శ్రీ మహావిష్ణువుకి అనుంగు సేవకులు . శ్రీమహావిష్ణువు ఏ కార్యార్థమై తరలి వెళ్తున్నా , తన భుజస్కందాలమీద ఆయనని ఎక్కించుకుని రివ్వున ఎగిరి క్షణాల్లో గమ్యాన్ని చేర్చే శ్రీవారి వాహనం గరుక్మంతుడు. ఆ శ్రీహరి ఏ రూపంలో ఈ భూమిమీద ఉన్నా, ఆయా రూపాల్లోనూ స్వామివారికి వాహనంగా గరుక్మంతుడు దర్శనమిస్తుంటారు. రామాలయం, కృష్ణాలయం, నారసింహాలయం, వెంకటేశ్వర ఆలయం , పద్మనాభాలయం ఇలా శ్రీవారు పలురూపాల్లో ఎక్కడున్నా ఆ గరుక్మంతుడు వాహనమై వెంటే ఉంటారు . అలాగే కంచిలో వేంచేసి ఉన్న వరదరాజస్వామి వారి ఆలయంలోనూ ఒక భారీ గరుడవాహనం ఉంది. దీనికీ కంచి గరుడ సేవ అనే నానుడికి ఒక విడదీయలేని సంబంధముంది . ప్రస్తుతం ఒక జాతీయంగా మారిపోయిన ఈ మాట వెనుకున్న ఆసక్తికరమైన విషయం. తెలుసుకుందాం .
వైనతేయుని పరాక్రమానికి తిరుగేలేదు . తన తల్లి దాస్య విముక్తి కోసం సురలోకం నుండీ అమృతాన్ని తీసుకొని వస్తుంటే ఇంద్రుడు అడ్డగించి ఆయనమీద బ్రహ్మాస్త ప్రయోగం చేశాడు . ఆ బ్రహ్మాస్త్రం గౌరవాన్ని తగ్గించకుండా ఉండడం కోసం తన రెక్కల్లోని ఒక ఈకని విదిల్చాడట ఆ గరుక్మంతుడు. అంతటి బలశాలి , ధీశాలి , పరాక్రమశాలి మన గరుడభగవానుడు. అందుకే నిద్రించేముందర వైనతేయుణ్ణి స్మరిస్తే , దుస్వప్నాలు రావు . తలచినంత మాత్రం చేత , స్వప్నములో కూడా రక్షణగా ఉన్నాడంటే, మెలకువగా ఉన్నప్పుడు కూడా స్మరిస్తే, ఇంకెంత రక్షణనిస్తాడో స్వామి .
ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. భక్తులకే కాదు ఆ స్వామి దూతగా సులోకాధీశులందరికీ ప్రియమైనవాడు వైనతేయుడు. స్వామివారి కళ్యాణమైనా , బ్రహ్మోత్సవమైనా , యజ్ఞమైనా మరే శుభకార్యమైనా గరుడధ్వజమై దేవీదేవతలకి ఆహ్వానం ఇచ్చేది ఈ గరుక్మంతుడేకదా !
గరుడవాహనంపైన స్వామి ఊరేగుతుంటే ఉండే శోభే వేరు . తిరుమల కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడవాహనంపై చిద్విలాసమూర్తి విహరిస్తుంటే దర్శించుకోవాలని కోట్లాది భక్తులు కోరుకుంటారు.
అయితే ‘కంచి గరుడ సేవ’ అన్న జాతీయం రావడం వెనుకమాత్రం ఆసక్తికర విషయం ఒకటుంది . 108 దివ్యదేశాల్లో ఒకటైన పవిత్రమైన కంచిలో ఆ వైకుంఠనాథుడు శ్రీ వరదరాజ పెరుమాళ్‌గా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంపైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహానికంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది.
ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇత్తడి సామాను మెరిపించాలంటేనే బోలెడంత శ్రమ చేయాలి . ఇక అంత భారీ గరుడ మూర్తిని శుభ్రం చేసి, స్వామివారి సేవకి సిద్ధం చేయాలంటే, సామాన్యమైన శ్రమ సరిపోదు. ఈ క్రమంలో అయ్యవార్లు అలిసిపోతుంటారు.
గరుక్మంతుడు గొప్పవారే . కానీ అక్కడ ఉన్న పెరుమాళ్ళు ఆయనకంటే గొప్పవారు కదా ! పైగా ఈయన కేవలం వాహనం . ఆయన పెరుమాళ్ళు . వరాలు అనుగ్రహించే వరదరాజు . “ఈ గరుడమూర్తిని తోమి తోమి శ్రమపడి శుభ్రం చేసేకంటే, స్వామి వారికి మరింత సేవ చేస్తే మనకెంతో పుణ్యం కదా! అనుగ్రహించి పెరుమాళ్ళు వరాలని అనుగ్రహిస్తాడుకాదా ! ఈ గరుడ వాహనాన్ని యెంత తోమినా ప్రయోజనం ఏముంది ?” అని ఆ గరుడవాహనాన్ని శుభ్రం చేసేవారు వాపోతుంటారట.
అదీ సంగతి . ‘ఇదంతా కంచి గరుడ సేవరా నాయనా’ అని మనవాళ్ళు వృధాగా శ్రమ పడినప్పుడు అనుకోవడం వెనుక ఇంత కథ ఉంది .
#kanchigarudaseva
Tags: kanchi garuda seva, varadaraja, perumal, kanchi, garuda