తర్పణానికి, అర్ఘ్యానికి తేడా ఏమిటి?
తర్పణానికి, అర్ఘ్యానికి తేడా ఏమిటి?
_ లక్ష్మి రమణ
తర్పణం , అర్ఘ్యం రెండింటిలోనూ భక్తి పూర్వకంగా నీటిని విడిచిపెట్టడమే చేసేటటువంటి క్రియ . కానీ అన్నీటిని వదలడంతో రెండిటి ఉద్దేశ్యం వేరు వేరు. అర్ఘ్యం మనం ఇంటికొచ్చిన అతిథికి చేసే మర్యాద . తర్పణం పితృదేవల తృప్తి నిచ్చే అర్పణం. ఈ రెండింటికీ ఎంతో తేడా ఉంది.
అర్ఘ్యం :
అర్ఘ్యం అనేది మనకి సంధ్యావందనంలో సూర్యునకు నీరు వదలడం అనే క్రియ లో కనిపిస్తుంది . సంధ్యావందనం చేసేప్పుడు దోసిలి నిండా నీరు తీసుకుని గాయత్రీ మంత్రం పఠిస్తూ ఆ నీటిని పైకి విసురుతారు. లేదా రాగి చెంబు నిండా నీటిని తీసుకొని సూర్యోదయ సమయంలో రెండుచేతులనూ సూర్యునికి అభిముఖంగా పైకి లేపి నీటిని ధారగా కిందికి వదులుతారు. ఇలా ఆయనికి నీటిని సమర్పించడమే సూర్యునికి ఆర్ఘ్యంగా పేర్కొంటోంది శాస్త్రం .
బ్రహ్మనుగూర్చి తపస్సు చేసిన 'మందేహులు’ అనే రాక్షసులు సూర్యునితో పోరాడేటట్టు వరాన్ని పొందారు . సూర్యుని గతిని వీరు అడ్డుకుంటారు. అలా సూర్యుని గతిని అడ్డుకుంటే , లోకాలకి వెలుగు ఎలా వస్తుంది ? అందుకే వారిని సంహరించేందుకు త్రిసంధ్యలలోనూ బ్రాహ్మణులు గాయత్రి మంత్రముతో అభిమంత్రించిన నీటి అస్త్రములను అర్ఘ్యముగా (అర్ఘ్యముగా విడిచిన నీటిబిందువులు) సూర్యునివైపు విసురుతారు. ఈ అస్త్రముల చేత సంహరించబడిన ఆ మందేహులు తిరిగి బ్రహ్మ వరదానమహిమచేత పునర్జీవితులు అవుతూంటారు. అందువల్ల సూర్యునికి అర్ఘ్యం అర్పించేప్పుడు మన లక్ష్యం ‘ మందేహుల’నే రాక్షసుల మీద . ఇక్కడ అర్ఘ్యం అస్త్రమయ్యింది .
ఇంకో అర్థం లో, అర్ఘ్య పాద్యాదులు అన్నప్పుడు, మనం మన ఇంటికి వచ్చిన విశేష వ్యక్తికి చేతికి నీరు అందివ్వడం ( ఆయన చేతిని శుభ్ర పరచుకోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి అన్నమాట ).
తర్పణం :
పితరులకు తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు. పితృ దేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలుగా ఉంటుంది . ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కోక్కరూ ఒక్కొక రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.
ఈ తర్పణాలు 4 రకాలు: దేవతర్పణం , ఋషితర్పణం , పితృతర్పణం , బ్రహ్మతర్పణం .
దేవ తర్పణము లో వేళ్ళ కొసల నుండి నీరు వదులుతాము.
ఋషి తర్పణము లో దోసిలి మధ్య నుండీ నీటిని వదులుతాము.
బ్రహ్మ తర్పణము లో చేతి మొదలు నుంచీ నీటిని వదులుతాము. అంటే మణికట్టు నుంచీ క్రిందకు.
పితృ తర్పణము లో బొటన, చూపుడు వేలు మధ్య నుండీ నల్ల నవ్వులు కలిసిన నీటిని వదులుతాము.
#tarpan #arghyam #tarpanam
Tags: tarpan, tarpanam, arghyam