తడిగుడ్డలతో పూజ చేసుకోవచ్చా ?

తడిగుడ్డలతో పూజ చేసుకోవచ్చా ?
- లక్ష్మి రమణ
తడి బట్ట కట్టుకుంటే , మడిబట్ట కట్టుకున్నట్టే అనే అభిప్రాయం ఈరోజుకి చాలా మందికి ఉంది . అలాగే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలలో తడిబట్టల్తో వెళ్లి దర్శనం చేసుకొంటూ ఉంటారు. ఇంట్లోనూ ఒళ్ళు తుడుచుకున్న తడి తువ్వాలుని కట్టుకొని పూజాదికాలు చేసేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన పితృదేవతల శాపానికి గురికావలసి ఉంటుందని చెబుతున్నారు ధర్మవేత్తలు .
తడి గుడ్డలతో పూజలు చేయాలంటే అవి కేవలం అపరాకార్యాలై ఉండాలంటున్నది శాస్త్రం . గుడిలోకి తడి గుడ్డలతో ప్రవేశించగూడదు.ఇంట్లో గూడా తడి గుడ్డ లతో దైవకార్యాలు చేయగూడదు.కొన్ని అపర కార్యాలు మాత్రమే తడి గుడ్డలతో చేస్తారు.దైవ సంబంధిత కార్యాలు పొడి బట్టలతోనే చెయ్యాలి. తడి వస్త్రాలతో దైవకార్యాలు చేస్తే నగ్నంగా చేసిన పాపం వస్తుంది అని ప్రమాణం ఉంది. ఇంట్లో అయితే తడిపి అరవేసిన దుస్తులు వేసుకొని , పూజ వంటివి చేయవచ్చు. గుడికి కూడ ఇలాగే వెళ్ళాలి . మగవారయితే పంచ, ఆడవారు అడ్డకచ్చ చీర, లేదా నిండైన సంప్రదాయ వస్త్రాలతో వెళ్ళాలి.
ఈ రోజుల్లో చాలా మంది, దేవాలయాలు దగ్గర ఉండే కోనేటిలో స్నానం చేసి, ఆ బట్టలతోనే నీళ్ళు ఓడుతు దర్శనాలు చేసుకోడం, పొర్లు దండాలు పెట్టడం చేస్తూ ఉంటారు. నిజానికి అది చాలా పెద్ద దోషం. మనం వేసుకున్న బట్టలు తడిపి, పిండకుండా నీళ్ళు ఓడుతు ఆరవేసినా, మనం కూడ అలా నీళ్ళు ఒడుతున్న బట్టలు వేసుకుని ఉన్నా, ఆ బట్ట నుండి కారుతున్న నీరు పితరులకు ఇవ్వబడుతుంది. దాని వల్ల వారి ఆగ్రహానికి మనం గురి అవుతాము. అందువల్లే బట్టలు పిండకుండా ఆరేయవద్దని చెబుతారు.
ఎవరి పితృ దేవతలయితే ఇలా సంతుష్టి చెందక, ఆగ్రహానికి లోను అవుతారో, వారికి సంపద, సంతానం ఉండవు. ఈ జన్మలో అయినా, మరు జన్మ అయినా, కొన్ని తరాల తరువాత అయినా ఈ దోషం వెంటాడుతుంది. నిజానికి ఇలా తడిబట్టలు వేసుకొని ఉండడం అనేది అనారోగ్య హేతువు కూడా. కాబట్టి శాస్త్ర వచనం సదా ఆచరణీయం.
ఇక మొక్కుల సంగతికి వస్తే, వారి వారి కష్టాలను బట్టి , ఇష్టాలను బట్టి మొక్కులనేవి ఉంటాయి. ఉదాహరణకి కళ్యాణం ( తల మీద కేశాలు తొలగించుకోవడం) పురుషులకు గూడా శిఖ వరకూ ఉంచుకొని , మిగతా చేయించుకోవడం పూర్వ సంప్రదాయం. పూర్తిగా శిరోముండనం అనేది బౌద్ధ సంప్రదాయం. ఒక సన్యాసికి విధించినటువంటిది. కానీ, నేటి కాలంలో తెలిసి , తెలియక స్త్రీ పురుషులు పూర్తయి కళ్యాణం చేయించుకొంటామని మొక్కుకొని ఆ ప్రకారం మొక్కులు తీర్చుకొంటున్నారు. ఇలాంటి మొక్కులు జానపదుల విశ్వాసాలతో ముడిపడినవి.
కాబట్టి శాస్త్ర ప్రకారం మాట్లాడితే, తడి బట్టలతో ఎటువంటి దైవ కార్యాలు చెయ్యకూడదు. అబ్దిక కర్మలు, పితృ కార్యాలు మాత్రమే తడి బట్టలతో చెయ్యాలి. దైవ సంబంధిత కార్యాలు పొడి బట్టలతోనే చెయ్యాలి. శాస్త్రం అనేది సదా అనుసరణీయమైనది అని గుర్తుంచుకోవాలి . శుభం
#pooja #wetclothes #puja
Tags: Pooja, puja, wetclothes