పండుగ రోజుల్లో శుభముహూర్తాలు నిర్ణయించరెందుకు ?
రామనవమి, దుర్గాష్టమి, వంటి పండుగ రోజుల్లో శుభముహూర్తాలు నిర్ణయించరెందుకు ?
-సేకరణ
ముహూర్త జ్యోతిషం లో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
జ్యోతిష శాస్త్రం కొన్ని తిథులను వాడకూడదని నిర్దేశించింది. ఉభయ పక్షాలలోని విదియ, తదియ, పంచమి , సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి మాత్రమే ముహూర్తములకు యోగ్యమైనవి. పై చెప్పిన తిథులలో కూడా శుక్ల పక్ష పంచమి నుంచీ కృష్ణ పక్ష దశమి వరకూ మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కృష్ణ పక్ష త్రయోదశి వాడకము తక్కువనే చెప్పాలి.
ముహూర్త భాగంలో తిథి, వారం, నక్షత్రం, లగ్నం, యోగం , కరణం అనే అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. వీటిలో లగ్నం అన్నది చాలా చాలా ముఖ్యమైనది. మనము ఏ కార్యం కోసం ముహూర్తం వెతుకుతున్నాము అన్న దాన్ని బట్టి వారం, నక్షత్రం, లగ్నం మారుతాయి.
ఉదాహరణకు వివాహానికి వృషభ, మిథున, కటక, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన లగ్నాలు ముహూర్త శాస్త్రం నిర్దేశించింది. బుధ, గురు, శుక్ర వారాలు పనికివస్తాయి. నక్షత్రాల విషయానికి వస్తే రోహిణి, మృగశిర, మఖ,ఉత్తర , హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి లలో వివాహ ముహూర్తాలు పెడతారు.
ఆదే గృహప్రవేశానికి అయితే వృషభ, మిథున, కన్య, ధనుస్సు, మీన లగ్నాలు మాత్రమే ఆమోదిస్తారు. మఖ నక్షత్రము వివాహానికి పనికివస్తుంది, కానీ గృహప్రవేశానికి ఆ రోజున లగ్నం పెట్టరు. అలాగే, శతభిషం ఉన్న రోజున గృహప్రవేశం చేస్తారు ..కానీ ఆ నక్షత్రం వివాహానికి పనికిరాదు.
మరి శ్రీ రామ నవమి మంచి రోజు కాదా అంటే.. అది జగత్ప్రభువు శ్రీ రాముల వారు అవతరించిన రోజు. కానీ, జ్యోతిష శాస్త్రం ఆ నవమి తిథిని ముహూర్తానికి సంబంధించి శుభ తిథి గా పరిగణించలేదు. నరక- చతుర్దశి పండుగే ..కానీ చతుర్దశి తిథి ముహూర్తములకు పనికిరాదు. దుర్గాష్టమి పండుగ రోజే..కానీ అష్టమి తిథి ముహూర్త భాగంలో వర్జ్యనీయము. సంకష్ట చతుర్థి శ్రీ వినాయక వ్రతమునకు ఉత్తమం..కానీ చవితి తిథిని రిక్త తిథి అంటారు. ఆ తిథిన ముహూర్తములు ఉండవు.
కాబట్టి పండుగ తిథులలో( చవితి, షష్ఠి, అష్టమి, నవమి,ద్వాదశి, చతుర్దశి ) లోక కళ్యాణం జరిగినా అవి ముహూర్త శాస్త్రానికి సంబంధించినంతవరకూ అనానుకూలమైన తిథులే. కానీ కొన్ని ముహూర్త గ్రంథాలలో చవితి లాంటి తిథులలో కూడా కొన్ని ఘడియలు వదలివేస్తే, ఆ తిథులు ఉపయోగించుకోవచ్చని రాయడం వలన కూడా ఈ తిథులలో ముహూర్తాలు పెడుతుండవచ్చును.
మరి చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే మరి ఆయా తిథులలో కొన్ని పంచాగలలో ముహూర్తాలు ఉన్నట్లుగా చూపుతున్నారు కదా అని. ఇక్కడ మనము పైన చెప్పిన తిథి, వార, నక్షత్ర, లగ్నమనే అంశాలను పరిగణన లోనికి తీసుకోవాలి. లగ్నమునకు అత్యధిక ప్రాముఖ్యత ఉన్నది కనుక, కొందరు దైవజ్ఞులు తక్కిన అంశాలైన వార, నక్షత్ర, తిథులను కొంత మేరకు రాజీ పడి( ఇంతకంటే వేరే పదం దొరకలేదు ) చవితి, షష్ఠి, అష్టమి, నవమి,ద్వాదశి, చతుర్దశి లాంటి తిథులలో ముహూర్తాలు ఇస్తున్నారు. దీనిపై చర్చ చేయడానికి ఇది సమయం కాదు.
విషయం నుంచీ ప్రక్కకు వెళుతున్నామనుకోకుంటే.. సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఆయనను సూర్య నారాయణమూర్తిగా కొలుస్తాము. అయినా జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు ఒక నైసర్గిక పాప గ్రహము.
కాబట్టి, పండుగ రోజున ఉన్న తిథి ముహూర్తానికి సంబంధించినంతవరకు శుభ తిథి కానవసరము లేదు
#muhurtham #muhoortam #festivals #sriramanavami #durgastami #jyothisyam
Tags: Pandaga, festivals, ramanavami, sriramanavami, durgastami, muhurtam, muhoortham,