పెయింట్ తో ముగ్గులు దిద్దేస్తున్నారా ?
పెయింట్ తో ముగ్గులు దిద్దేస్తున్నారా ?
నిజానికి ముగ్గులు దిద్దేది ఇందుకేనట !
లక్ష్మీ రమణ
ఇంటిముందు ముగ్గువేసుకోవడం మన సంప్రదాయం . రాత్రిపూట నింగిలో మెరిసే చుక్కలు నెలకి దిగివచ్చాయా అన్నట్టు , ముంగిలిదిద్దిన ముగ్గులు ప్రకాశిస్తూ ఉంటాయి . ఇప్పటికీ మన గ్రామాల్లో చక్కగా కళ్లాపిచల్లి దిద్దిన ముగ్గులు ఆదరంగా స్వాగతం పలుకుతుంటాయి . ఇక కార్తీకమాసం , ధనుర్మాసాలలో , సంక్రాంతి పండుగ ముందర వేసే ముగ్గులయితే వాకిలంతా పరుచుకొని ముచ్చటగొలుపుతాయి . ఈ ముగ్గులు వేసే సంప్రదాయం వెనుక ఆరోగ్యకారణంతో పాటు , మరెన్నో ప్రయోజనాలున్నాయట !
సంప్రదాయం :
హిందూ సాంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులేని ముంగిలి అశుభాన్ని సూచిస్తుందని చెబుతారు . అసురీ శక్తులని ఇంట్లోకి ప్రవేశించకుండా , ముగ్గులు అడ్డుకుంటాయట . పితృదేవతల తిథిరోజున ముగ్గులు వేయకూడదు . ఆరోజు పితృవేతలని ఆహ్వానించినప్పుడు వారు ముగ్గువేసివుంటే, ఇంట్లోకి ప్రవేశించలేరని శాస్త్రం .
ఆరోగ్యం :
ఇలా నిత్యం ఇంటిముందర ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలున్నాయి. శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం. ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెట్టి, వాటికి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో ఒక భాగంగా చేశారు .
ఈనాటి జీవనశైలి కూడా మనని మంచి వ్యాయామానికి దూరం చేస్తోందని చెప్పుకోక తప్పదు . మిక్సి , గ్రైండర్లు , ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి ఉపకరణాలు ఎన్నో అందుబాటులోకి వచ్చేశాయి . ఇంట్లోనే ఇలా అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలకు కారణం కావచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని వాడుకలోకి తెచ్చారేమో ! అందుకని పెయింటుతో ముగ్గు పెట్టేసి సరిపెట్టేయడం అంత మంచి విధానం కాదు .
ముగ్గు స్త్రీలే వెయ్యాలా ?
సాధారణంగామన సంప్రదాయంలో స్త్రీలే ముగ్గులు వేస్తుంటారు . లలితా స్వరూపులు కాబట్టి ఇటువంటి లలితమైన కళ వారికి అయాచితవరంగా లభిస్తుందంటే అతిశయోక్తి కాదు . అయితే, ముగ్గు వెయ్యడం అనేది స్త్రీలకి మమాత్రమే పరిమితం కాదు . గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే ముగ్గు వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు. హోమాలు , యజ్ఞయాగాల సమయంలోనూ ఋత్వికులే ముగ్గు వెయ్యడం కనిపిస్తుంది . కాబట్టి ముగ్గు మగవారు వెయ్యడంలో తప్పేమీలేదు .
ఎలా వెయ్యాలి ?
ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు (నాలుగు)అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.
ఏసమయంలో ఏ ముగ్గు వెయ్యాలి ?
ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.
నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది.
మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా.
తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.
యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి.
దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.
దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని పొరపాటున కూడా తొక్కకూడదు.
యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.