కొత్తబట్టలకి పసుపు పెట్టి కట్టుకోవడం ఎందుకు ?
కొత్తబట్టలకి పసుపు పెట్టి కట్టుకోవడం ఎందుకు ?
లక్ష్మీ రమణ
పసుపు భారతీయుల సంప్రదాయంలో గొప్ప భూమికనే పోషిస్తుంది . పసుపు లేదు, అయిపొయింది అని చెప్పడానికూడా భారతీయులు , ప్రత్యేకించి సనాతనావలంబీకులు అస్సలు ఇష్టపడరు . ఆవిషయాన్ని చెప్పడానికి పసుపు నిండుకుంది అని చెబుతారు . ఏదైనా శుభకార్యాన్ని ఆరంభించేందుకు సరుకుల చిట్టా రాసుకోవడానికి ముందుగా పసుపు , కుంకుమ అని రాయడం మనకి అలవాటు . శుచికి శుభ్రతకి కూడా మనం పసుపుని విరివిగా వాడుతూంటాం . ఇది పసుపు ప్రక్రుతి సిద్ధమైన యాంటీ బయోటిక్ అని మాత్రమే అని కోవడానికి లేదు . ఇందులో మన సంప్రదాయం, సైన్స్ తోపాటు గొప్పవిశేషాలెన్నో దాగున్నాయి మరి !
పసుపు స్వయంగా లక్ష్మీ స్వరూపం. గౌరీ స్వరూపం . ఏదైనా పూజ చేసుకునేప్పుడు, పసుపుని తడిపి ముద్దగా చేసి ఆ పసుపు ముద్దని దేవతా స్వరూపంగా ఆరాధించడం మన సంప్రదాయంలో భాగంగా ఉంది . ఇంటికి ముత్తయిదువులు వస్తే, వారికి బొట్టుపెట్టి , పసుపురాసి , తాంబూలం ఇవ్వమని పెద్దలు చెబుతుంటారు . అదేవిధంగా కొత్తబట్టలు కట్టుకొనే ముందర వాటికి పసుపు పెట్టి కట్టుకోమని చెబుతుంటారు. ఇందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఇప్పటి తరానికి ఉండడం చాలా సహజమైన విషయమే .
పసుపు సహజమైన సూక్ష్మక్రిమినాశని. బట్టలు నేసేప్పుడు , ఆ తర్వాత అది పూర్తిరూపాన్ని సంతరించుకునే వరకూకూడా రకరకాలైన మార్పులకి గురవుతుంది . ఈ తయారీ విధానంలో రకరకాల రసాయనాలు కూడా కలుస్తాయి . రంగులు వెయ్యడం , అద్దకం లాంటివన్నీ రసాయనాల మేళవింపేకదా ! ఆతర్వాత వాటికి గంజిపెడతారు . గోదాములలో నిల్వచేస్తారు . ఎన్నో వేలమంది వాటిని పట్టుకొని నచ్చిందా లేదా అని చూసుకొని ఉంటారు . ఇప్పుడైతే మనం ట్రయిల్ రూమ్ లలో వాటిని వంటిమీద ప్రయత్నించి చూస్తున్నాం కూడా ! కరోనా తర్వాత, ప్రపంచానికి ఇటువంటి చర్యలవల్ల సూక్ష్మక్రిములు ఒకరినుండీ ఒకరికి ఎలా సంక్రమిస్తాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు .
అయితే, ఇటువంటి మహమ్మారిని ఆపడానికి మాత్రమే బట్టలకి పసుపుపెట్టమని పెద్దలు చెప్పలేదు . పసుపు నిండుగా ఉంటె అది భాగ్యాన్ని , సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది . అందుకే అశుభకార్యాలలో పసుపుని వాడరు. కనీసం అక్షింతల్లోకూడా పసుపుని కలపరు. పసుపు శుభానికి సూచిక . శుభకార్యాలలో జనంకూడా ఇంటికి నిండుగానే ఉంటారుగా ! అప్పుడుకూడా పసుపు గడపలు, పసుపుబొట్లు , కాళ్ళకి పసుపులేపనాలు , పసుపురాసి బట్టలు ఇవ్వడం వలన అక్కడ సూక్ష్మక్రిమినాశనం జరిగి, ఆఇంట్లో జరిగిన శుభం తాలూకూ సంతోషాలూ , జ్ఞాపకాలు అలా మదిలో పదిలంగా పదికాలాలు ఉండిపోతాయి . అదీకాక, ఆ బట్టలకి ఉండే అసౌచము వదిలిపోతుంది. శుభకార్యానికి మంగళప్రదమైనవాటినేకదా వాడతాము. పసుపుని రాయడం వలన కొత్తబట్టలకి అటువంటి మంగళకరమైన అర్హత వస్తుందన్నమాట . వీటన్నిటితోపాటు , ఆ లక్ష్మీ దేవికరుణ లభిస్తుంది .
తడిపసుపుని పూర్వం బట్టలకి వేసే రంగుగా కూడా ఉపయోగించేవారు . అందువల్ల పసుపు రంగు తొందరగా బట్టలనుండీ వదిలిపొయ్యేదికాదని స్పష్టమవుతుంది . కానీ ఇలా పసుపు పెట్టిన బట్టలు కట్టడం వలన ఆ బట్టలు వేసుకోవడం వలన వచ్చిన కళకొద్దీ తాకే దృష్టిదోషాలు నివారింపబడతాయి అని పండితవచనం .
ఏదేమైనా పసుపు, కుంకుమ భారతీయతకి చిహ్నాలు . శుభ సూచికలు. అందువల్ల మన సంప్రదాయాన్ని అనుసరిస్తూ , చక్కగా ఇన్నిప్రయోజనాలున్న పద్ధతిని కొనసాగిద్దాం .
శుభం .