కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి?
కార్తీకమాసం పరమపుణ్యమైన మాసం. ఈ నెలరోజులూ శివ కేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు. భగవంతునికి ఇష్టమైన సమయంలో , భక్తులు భక్తితో నమస్కరించినా అనంత ఫలం దక్కుతుంది . సంవత్సరంలో ఏరోజు దీపం వెలిగించక పోయినా , కార్తీకమాసంలో దీపం వెలిగించడంవలన ఆ దోషం పోతుందని పెద్దలు అంటారు .
కార్తీకపురాణంలో కార్తీకమాస విశిష్టత చాలా గొప్పగా వివరించారు . ఈ మాసంలో చేసే స్నానం , దీపారాధన , దీపదానం, ఉపవాస దీక్షల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ! కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడు. ఆయన కొడుకైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడు . అంతెందుకు, కుక్కకి కూడా కైవల్యాన్ని, కైలాసాన్ని ప్రసాదించగల మహత్యం ఈ మాసదీక్షకి ఉందని కార్తీక పురాణం తెలియజేస్తోంది.
ఈ నెలరోజులూ ఇంట్లో దీపాలు వెలిగించడం ఒకఎత్తయితే, శివాలయాల్లో లేదా విష్ణాలయంలో దీపాలు వెలిగించడం , చెరువులు, నదుల్లో దీపాలు వదలడం మరో ఎత్తు . కార్తీకమాసంలో ఏ నదీతీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కళకళలాడుతుంటుంది. సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది. నింగిలోని తారకలన్నీ నెలకి దిగివచ్చాయేమో అనే అనుభూతి కలిగిస్తుంది . కన్నుల పండుగగొలిపే ఈ సంప్రదాయంలోని ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం .
శివుడు పంచభూతేశ్వరుడు .
“నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం.
అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం.
శివమ్ శివమ్ భవ హరం హరం”
పంచభూతాలయిన ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమే సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రమయిన ‘న-మ-శి-వా-య’ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. అటువంటి ఈ జగత్తుకి పరమాత్మ ఈశ్వరుడు . పంచభూతస్వరూపుడు.
పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరంలో ఉన్న పరమాత్మ జ్యోతిస్వరూపుడు . ఈ జీవుడు పరమాత్మలో లయమయ్యే సమయంలో జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుకుంటుంది . ఆ జీవజ్యోతికి ప్రతిరూపమైన జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అనే అద్భుత క్రియ ఈ కార్తీకదీపాలని వదలడం . దీని ఆంతర్యం మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరునికి అంకితం చేయడమే. ఇదిలా ఉంచితే, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి కైలాసానికి చేరతారని శృతి వచనం . అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు. ఒక్క తులసీదళానికి , చిన్న బిల్వదళానికి దోసెడు నీళ్ళకి సంతోషపడిపోయే పరమాత్మకు , మన ఆత్మజ్యోతినే కానుకగా అర్పిస్తే, యెంత ఆనందమో వర్ణించ సాధ్యమేనా ?
దానితోపాటుగా , విష్ణువును తులసి దళాలు, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతో; శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు. ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానంచేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఈ విధంగా దీపారాధన చేయడం అత్యంతఫలప్రదం .
చల్లని శీతాకాలపు చలికి వెచ్చని దీపపు వేడిని, చీకటి దుప్పటిని కప్పుకున్న లోకానికి యెర్రని జ్యోతుల వెలుగుని, ఆకలితో అలమటిస్తూ ఉన్నవారికి కమ్మని ప్రసాదాన్ని అందించి దాంతోపాటే ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందడం గొప్ప సంప్రదాయం కాక మరేమిటి. ఇది మన సనాతనధర్మంలో నిబిడీకృతమైఉన్న అద్భుతమేగా !
-లక్ష్మీ రమణ