స్త్రీలు చీరనే ఎందుకు ధరించాలి?
స్త్రీలు చీరనే ఎందుకు ధరించాలి?
లక్ష్మీ రమణ
కుర్తా , కుర్తీ వేసుకుంటే, దానికన్నా జీన్స్ , టీషర్ట్ వేసుకుంటే చాలా కన్వీనియంట్ గా ఉండే మాట వాస్తవం . చీర కట్టుకుంటే, అలవాటులేని వారు చాలా ఇబ్బందిని పడాల్సిందే ! కానీ చీరలో నిండుతనం వేరే ఏ డ్రెస్సులో ఉండదని ఈ తరం అమ్మాయిలూ కూడా చెప్పేమాట . చీరకట్టు మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరకంగా ఉంటుంది. అయితే సనాతన ధర్మంలో మహిళ చీర ధరించడానికి శాస్త్రీయ కోణం కూడా ఉందని కొంతమంది శాస్త్ర పరిశోధకులు అంటున్నారు . ఆ విశేషాలపైనా ఒక లుక్ వేద్దాం పదండి !
ఈ శరీరమనే ఆలయాన్ని ప్రక్రుతి స్వరూపంగానూ, అందులో ఉండే ఆత్మా స్వరూపమైన జీవుణ్ణి పరమాత్మగానూ మన ధార్మిక గ్రంథాలు వర్ణించాయి . భూమి ప్రక్రుతి అయితే, ఆమె భర్త నారాయణుడు అయిన పరమాత్మా అని మనకి అర్థమయ్యేలా ఒక కథలా చెప్పారు కదా మన ఋషులు . అందుకే స్త్రీలు లలితంగా అందంగా వంపులు తిరిగిన శరీరంతో సుకుమారమైన పూవుల్లా ఉంది ఆకర్షణా శక్తిని కలిగి ఉంటారు . అయితే, దీనికీ భారతీయ చీరకట్టుకీ సంబంధం ఏమిటి ? అంటారా ? అదిగో అక్కడికే వస్తున్నాం !
మన శరీరంలో, భూమిలో అదే విధంగా విశ్వంలో ఆరోగ్యకరమైన శక్తి కదలికలు ఒకే విధంగా ఉంటాయి. ఇవి వృత్తాల్లో కదులుతాయి. ప్రకృతికి , శక్తికి ప్రతీకయైన స్త్రీలు ఆరోగ్యంగా ఉండటానికి, వారి శరీరంలో ఈ విశ్వశక్తి వృత్తాకార కదలికతోటి ఉండడం అవసరం. శరీరాన్ని తాకే ఏ శక్తయినా, మొదట మన బట్టలను తాకి, ఆపై అది శరీర భాగాలలోకి, దాని శక్తి మార్గాల్లోకి, నాడుల్లోకి ఆ తరువాత అంతర్గత అవయవాలలోకి ప్రవేశిస్తుంది.
ఈ సిద్ధాంతాల ప్రకారంగా , చీర శరీరం చుట్టూ వృత్తాకారముగా ఉంటుంది కాబట్టి , ఒక శక్తి చీరను తాకినప్పుడు, అది శరీరం చుట్టూ ఉన్న వృత్తాలలో ప్రయాణిస్తుంద. ఇది విశ్వ శక్తిని సరైన మార్గంలో ప్రయాణించి శరీరంలోకి ప్రయాణించేలా , తద్వారా వారు ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది .
ఆ ప్రయాణం అనేది 5-6 గజాల వస్త్రంలో ప్రయాణించేటప్పుడు, లోపలికి వచ్చే ప్రతికూల శక్తులు లేదా నెగిటివ్ ఎనర్జీలు ఆ వస్త్రంలో చిక్కుకుంటాయి. అవి చీరను ఉతికిన సమయంలో విసర్జిపబడతాయి అని విశ్వాసం . ఆవిధంగా పాజిటివ్ శక్తిని చీర అది కూడా , చక్కగా నేసినటువంటి , నూలు లేదా పట్టు చీరల్లో ఈ శక్తి ప్రవాహం అనేటటువంటిది సరైన విధానంలో జరుగుతుందని పెద్దలు చెప్తారు . అదన్నమాట సంగతి . అందుకనే మనపెద్దలు నూలు, పత్తి పట్టు వంటి సహజమైన పద్దతుల్లో తయారు అయిన వస్త్రాలనే ధరించే వారు.