పెళ్లికూతురుకి మంగళ స్నానం చేయించడం వెనుక గల కారణం
పెళ్లికూతురుకి మంగళ స్నానం చేయించడం వెనుక గల కారణం ఏమిటి ?
లక్ష్మీ రమణ
మంగళ అంటే, శుభప్రదమైనది అని అర్థం. ఆ శుభాన్ని చేకూర్చే దేవదేవి అనికూడా అర్థం. మంగళ స్నానం అంటే, శుభప్రదమైన స్నానం అని అర్థం . శుభకార్యానికి ముందర ఇలా మంగళ స్నానం చేయించడం అనే సంప్రదాయానికి మూలం క్షీరసాగర మథనం అని చెబుతారు పెద్దలు . మంగళ స్నానానికి క్షీరసాగర మథనానికీ సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? నిజమే , కానీ నిజంగా ఈ సంప్రదాయానికి ఆ కథనానికీ సంబంధం ఉంది . మనవాళ్ళు ఏ సంప్రదాయాన్ని పెట్టినా అందులో బోలెడంత అర్థం, అంతరార్థం ఉంటాయి కదా ! ఆ విశేషాలు చెప్పుకుందాం రండి !
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం విధిగా చేయాలని చెప్పారు మన పెద్దలు . శరీరానికి నువ్వులనూనెను బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చటి నీటితో తలంటి స్నానం చేయడాన్ని ‘అభ్యంగన స్నానం’ అంటారు. ఇక శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటారని ఆర్యోక్తి. కాబట్టి అలా నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసినట్టయితే లక్ష్మిదేవి తో పాటుగా , గంగాదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు.
‘అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం’ అంటే, అభ్యంగన స్నానం అన్ని అవయవాలకూ ఆరోగ్యాన్ని, పుష్ఠిని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతుంది . మంగళ స్నానం కూడా అభ్యంగన స్నానమే ! కానీ వారానికొకసారి చేసే సాధారణమైన అభ్యంగనం కాదు . ఇది నిజంగా దేవీదేవతలు వరప్రసాదాన్ని నవవధువుకి అనుగ్రహించేది . అసలు ఈ ఆచారంలోనే ఒక అద్భుతమైన సౌభాగ్యదాయకమైన విశేషముంది . మంగళ స్నానానికి ముందర వధువుని సువాసినులు ఒక పీఠం పైన కూర్చోబెడతారు . నాల్గుపెట్టి అభ్యంగన స్నానం చేయిస్తారు . ఆ సమయంలో మంగళ వాయిద్యాలు మ్రోగిస్తారు . వేదపండితులు వేదఘోష చేస్తారు . దీనివలన ఏ ప్రయోజనాలైతే అభ్యంగన స్నానం వలన శరీరానికి కలుగుతున్నాయో , వాటికి తోడుగా ఆ ఆదిదంపతుల ఆశీర్వచనం ఆ వధువుకి దక్కుతుంది .
ఇలా మంగళ స్నానం చేయించే విధానమంతా కూడా భాగవతంలో లక్ష్మీదేవి క్షీర సాగరం నుండీ ఉద్భవించిన ఘట్టంలో మనకి చక్కగా వివరంగా ఉంటుంది . పంచపల్లవములు కలిపినా మగలా , సుగంధ జలాలతో ఆమెకి మంగస్నానం చేయిస్తారు దేవతలు. తన అదృష్టం చేత ఆ మహాదేవికి తండ్రి స్థానాన్ని పొందిన ఆ సాగరుడు ఆమెకి పట్టుపుట్టములు కట్టబెట్టి , చేతికి వరమాలనిచ్చి స్వయంవరాని ప్రకటిస్తాడు . అప్పుడు అమ్మ నీలమేఘశ్యాముడై, పద్మములని పోలిన నేత్రాలతో సౌదర్యమూర్తిగా ఉన్న స్థితికారకుడైన విష్ణుమూర్తిని వరిస్తారు . అందువల్ల ఈ సంప్రదాయం అక్కడ నుండీ మనకి అలవడింది. అడివల్లనే నూతన వధూవరులని లక్ష్మీ నారాయణులుగా మనం భావిస్తూ ఉంటాం . అలా మనకి ఈ అద్భుతమైన సంప్రాయ వచ్చిందన్నమాట !