భోగినాడు తలమీద రేగిపండు

భోగినాడు తలమీద రేగిపండు నిలబడితే యోగి ! చిల్లర నిలబడితే ?
-లక్ష్మీ రమణ
పుష్యమాసం వచ్చేసిందంటే, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినట్టే. ఉత్తరాయణ పుణ్యకాలం . ఈ సమయంలో రైతులు గాదెల నిండా ధాన్యాన్ని నింపుకొని ఆనందంగా ఉంటారు . అటువంటి సమయంలో వచ్చేదే సంక్రాంతికి పండుగ. ఈ పండుగనాటి భోగి రోజు ఏంటో విశిష్టమైన అలవాట్లని మన పెద్దలు మనకి సంప్రదాయంగా ఇచ్చారు . అదేమిటంటే, రేగిపళ్ళు పిల్లలకి తలమీద పోయడం . ఎందుకలా ?
యోగిత్వం.. బదరీఫలం అంటుంది శాస్త్రం .‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక.
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం సిటీ జీవనాన్ని తనలోకి లాగేసుకొని రకరకాల కొత్తపుంతలు తొక్కుతోంది . పేపరు బాల్స్ , చమ్కీ ముక్కలు ఈ భోగినాటి పాళ్లల్లో కలువుతున్నారు . కానీ అది మంచిది కాదు . సహస్రార చక్రానికి, ఈ రేగిపండు తగలడం వలన తామస గుణాలు తగ్గి పిల్లల్లో , చక్కని సత్వగుణ వృద్ధి జరుగుతుంది . అదే విధంగా , వారి కున్న ద్రుష్టి దోషాలు తొలగిపోతాయని పెద్దల మాట .
భారత దేశంలో అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు.
హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోసే సంప్రదాయాన్ని పెట్టారని మనం గ్రహించాలి . ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.