Online Puja Services

నదులలో నాణేలు విసిరేస్తున్నారా !

18.119.163.95

నదులలో నాణేలు విసిరేస్తున్నారా !
లక్ష్మీ రమణ 

రైలు కృష్ణానది ఆనకట్ట మీద పరిగెడుతోంది. కిటికీపక్కన కూర్చుని ఉన్న నామీదనుండీ ఒంగిమరీ నాణేలు వరుసగా కృష్ణమ్మ ఒడిలోకి విసిరేస్తున్నారు ప్రయాణీకులు . అలా ఎన్ని నాణేలు ప్రకాశం బ్యారేజీ దిగేలోపల ఆ కృష్ణమ్మలో చేరిపోయాయో తెలీదు. అప్పుడు తెలుసుకోవాలనిపించింది ! ఎందుకిలా నాణేలు నదిలోకి విసురుతున్నారా అని . మీకుకూడా ఈ సందేహం వచ్చిందా ! అయితే, మరి పూర్తిగా చదవండి !!

నిజానికి ఈ సంప్రదాయం చాలా గొప్పది. ఎంతో నిగూఢమైన అద్భుతమైన అర్థాన్ని కలిగింది కూడా ! ఈ విధానాన్నీ మనం దాదాపు 5000 సంవత్సరాల నుండి కొనసాగీస్తూ వస్తున్నాం . నదులని మనం దేవతా స్వరూపాలుగా కొలుస్తామనేది అందరికీ తెలిసిందే ! ఇలా డబ్బుని ఆ దేవతకి దక్షిణగా సమర్పించడం అనేది నదుల్లోకి నాణేలు విసరడం అనే సంప్రదాయానికి అర్థం కావొచ్చు. కానీ ఇందులో దాగిన పరమార్థం మాత్రం వేరేది . 

మన పూర్వీకులు ఏపని చేసినా అందులో చాదస్తాన్ని మూటగట్టి చెప్పలేదు . ఆ సంప్రదాయం వెనుక చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుపరిచి చెప్పారు . అదేంటంటే, పూర్వం మనకి కానీలు , చిల్లు కాణీలు  ఉండేవి . వాటిని రాగితో చేసేవారు . ఆ రాగికాణీలని నదులలో వేసేవారు పెద్దలు. ఆ సంప్రదాయాన్ని వారసులూ కొనసాగించేలా వారు చూశారు. ఇక్కడ విషయమంతా కూడా ఈ లోహాన్ని వినియోగించడంలోనే ఉంది. ఆ ప్రత్యేకత ఏంటనేది చూద్దాం పదండి .  
   
రాగి ఒక ముఖ్యమైన లోహం, ఇది మానవ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి మంచిది. నీటి శుద్ధి కోసం రాగి, వెండి పాత్రలలో నీటిని నిల్వ చెయ్యడం గురించి పురాతన ఆయుర్వేద రచనలలో పేర్కొన్నారు . వేవుడికి వాడే పంచపాత్ర , ఉద్ధరిణ వంటివి కూడా ఖచ్చితంగా ఈ లోహాలతోటే చేసినవిగా ఉండాలని పెద్దలు చెప్పడంలో అంతరార్థం కూడా ఇదే కావొచ్చు . 

యాంటీమైక్రోబయల్ -కాపర్ . ఇది  99.9% కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాను చంపగలిగినంది. ప్రస్తుత కాలంలో, బస్సులు & రైళ్లు వంటి ప్రజా రవాణాలో రాగి రెయిలింగ్లు ఏర్పాటు చేయడం గమనించారా ? కరోనాని వ్యాప్తి చేసే కోవిడ్ వైరస్  కూడా రాగితో చేయబడిన సర్ఫేస్ లపైన, ఇతరలోహాలతో పోల్చి చూసినప్పుడు ఎక్కువ సేపు బ్రతకదని తేల్చిన నివేదికలని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి .  ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేస్తుంది. అందుకనే , బ్యాక్టీరియాను నివారించడానికి తాగునీటి కోసం రాగి గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే  ఊపయోగిస్తున్నాయి.

రాగి నాణేలను పవిత్ర నదులలోకి విసిరేయడం అనేది మన పూర్వీకులు ఇలాంటి ప్రయోజనం కోసమే ఉద్దేశించి ఉండొచ్చు . త్రాగునీటి  ప్రధాన వనరులు నదులే. ఇంట్లో కుండకి మూతబెట్టి నీటిని క్రిమికీటకాలనుండీ కాపాడుకున్నట్టు , నదికి మూతబెట్టగలమా ? పైగా నదీస్నానం చేసేవారు కూడా మన దేశంలో ఎక్కువేకదా ! అలా నీటికి సంక్రమించిన సూక్ష్మ క్రిములు మనని చేరకూడదు . కాబట్టి, రాగి నాణేలను నీటిలోకి వదలడం, బ్యాక్టీరియాను నాశనం చేయడానికి సహాయపడుతుంది. 

ఇలా రాగి నాణేలు చాలా కాలం నదులలో ఉంటే, అది త్రాగేవారికి అలాగే భవిష్యత్ తరాలకు ప్రయోజనకరంగా మారుతుంది. అందుకోసం మన పూర్వికులు రాగి నాణేలను నదులలో పడేసేవారు. 

మన పూర్వీకులు రాగి నాణేలను పవిత్ర నదులలోకి విసిరేయడం అనే పద్దతిని మనం కోసం మొదలు పెట్టారు. కానీ దీన్ని ఆచారంగా మార్చడం వల్ల భవిష్యత్ తరాలు ఈ పద్ధతిని అనుసరిస్తాయని అనుకున్నారు. కొన్ని తరాల పాటు ఇది అనూహ్యంగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ ఆధునిక కాలంలో, రాగి నాణేలను ఉపయోగించడం లేదు. ఇప్పడు చలామణిలో ఉన్న కరెన్సీ స్టీల్, అల్యూమినియం, పేపర్‌తో తయారు చేయబడింది. వీటిని నదుల్లో వేయడం వలన అవి కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ . కాబట్టి వాటిని ఆ నదీమతల్లి పేరు చెప్పి ఎవరైనా ఆకలిగా ఉన్న వారికి ఇవ్వండి. ఒక బిస్కెట్ పాకెట్ కొనుక్కుంటాడుకదా ! అప్పుడు నిజంగా ఆ మాధవుడు సంతృప్తిని పొందుతాడు . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore