గడ్డాలు నెరిసినా అన్నం తినడం రాదేమిటర్రా !!
బామ్మోవాచ !’గడ్డాలు నెరిసినా అన్నం తినడం రాదేమిటర్రా !!’
-లక్ష్మీ రమణ
‘అన్నం కూడా అలా తినాలి , ఇలాతినాలి అని నోట్లో ముద్దలు పెట్టి నేర్పించండి అత్తయ్యగారూ !! వీళ్ళు కాలేజీకెళుతున్నా ఒక్కరూ సరిగ్గా తినరు. ఎంతసేపూ ఆ సెల్లుఫోనూ , టీవీ తప్ప, వడ్డించిన గంటసేపటికి గానీ భోజనానికి లేవరు. వీళ్ళకి తోడు మీ అబ్బాయిగారు ! తిన్నాక అన్ని సర్దుకుని పడుకునేసరికి రాత్రి 12 దాటిపోతోంది “. అత్తగారితో ఒకింత సౌమ్యంగానే వెళ్లబోసుకుంది అమ్మ ! దీనికి మా బామ్మోవాచ మాకు ‘వామ్మో’ అనిపించేలా చేసింది. అదేంటో చదవండి మరి !
ఒరేయ్ అన్నం తింటానికి కాళ్ళుకడుక్కుని కూర్చుంటే, కాళ్లకున్న తడి ఆరిపోయే సమయానికల్లా , అన్నం తిని లేవాలి. అదీ పధ్ధతి . అంతేగానీ మీఅమ్మని ఇలా కాల్చుకొని తినడంకాదు. అంది బామ్మ . ఆ గిన్నెలు అక్కడ పెడితే, మేమె ఆకలి వేసినప్పుడు పెట్టుకుని తింటాంగా ! అన్నాడు చిన్నోడు .
అమ్మ చేత్తో పెట్టినప్పుడు, ఆ ఆహారంలో అమ్మ అనురాగం అనే గొప్ప పదార్ధం కలిసి పిల్లలకి ఆయువు వృద్ధి చెందుతుందిరా ! అయినా పదార్థాలు చల్లారిపోయాక తినకూడదు. వేడివేడిగా ‘ చెయ్యికాలా , నోరుకాలా (కాలేలాగా)’ తింటేనే రుచి, పుష్టి కూడా ! అదలా ఉంచితే, అన్నాన్ని వడ్డించాక, వండాక ఆలస్యంగా తినడం , పదార్థాలమీద మూటలు తీసేసి, అక్కడ పడేసి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు .
ఎందుకంటె, మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయి. అవి అన్నం లోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి. అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం , అన్నం కంచంలో వడ్డించేశాక చాలా సేపటికి తినడం, కంచం పెట్టి అన్నం పెట్టాను రమ్మని గట్టిగా అరిచి పిలవడం, మూతలు పెట్టకుండా ఉంచడం, ఎండిపోయినవి తినడం చేయకూడదు .
అయితే ఏమౌతుంది? అవి కూడా జీవులే కదా! అని మీలాంటి ఈ తరం కుర్రాకాయలు అనుకోవచ్చు. అయితే అవి అన్నం లోని సారమంతా తీసుకున్నాక, మనము ఏవ్ పదార్థాన్ని తింటే శక్తి లభించదు . పైగా మన మనసు పై వాటి ప్రభావం పడి, పాపపు ఆలోచనలో, లేక మానసిక ఒత్తిడికో దారి తీయొచ్చు. అందుకే ఎప్పుడూ అన్నం భగవంతుడికి నైవేద్యంగాపెట్టి, కాకి కి ఒక ముద్ద పెట్టి తినడం మంచిది . కాకికి పెట్టడం వలన పితృదేవతలు కూడా సంతృప్తిని పొందుతారు .
అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అదే తడి కాళ్లతో పడుకోకూడదు. కాసేపు అటూ ఇటూ నడిచాక పడుకోవడం మంచిది.
అయినా వంటచేయడానికి మీ అమ్మ పడే కష్టం , ఆ ముద్ద మీరు తినడంతో మరిచిపోతుందిరా ! ఆవిడకి మీరు చేసే సాయం ఏమీ లేకపోయినా , కాస్త తినయినా కష్టపడండి . లేటుగా తింటే, ఆ కడుపులోది అరక్క , ఒంటిగంటవరకూ ఆ పక్కమీద అటూ ఇటూ పొర్లాడమే సరిపోతుంది. పైగా చేతుల్లో ఆ వెధవ ఫొనులొకటి ఏడుస్తాయ్ !! లేవండి ! అని ఉపన్యాసం ఏకబిగిన దంచేసింది బామ్మ .
నాన్నతో సహా, నో టాకింగ్స్ , ఓన్లీ ఈటింగ్ అంతే !! ‘దెబ్బకి దయ్యాలు దిగొచ్చాయని’ మా అమ్మ గొణుక్కుంది. అయితే , అది వేరే సంగతి .