మంగళసూత్రాలమీద లక్ష్మీదేవి రూపు వేయించుకోవచ్చా ?
మంగళసూత్రాలమీద లక్ష్మీదేవి రూపు వేయించుకోవచ్చా ?
-లక్ష్మీ రమణ
మంగళసూత్రాలమీద లక్ష్మీదేవి రూపు వేయించుకోవచ్చా ?మంగళ సూత్రాలు చేయించుకునేప్పుడు ఆ సూత్రాలమీద రకరకాల దేవీదేవతలు బొమ్మలని వేయించుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్గా మారిపోయింది . కొంతమంది ప్రత్యేకించి, లక్ష్మీ రూపుని వేసి నల్లపూసలు కూడా చేయించుకుంటారు. ఇలా చేయించుకోవడం పైన పండితులు యేమని చెబుతున్నారో తెసుసుకుందామా ?
మంగళసూత్రం అంటే, పవిత్రమైన బంధనం అని అర్థం. ఇందులో గుచ్చే రెండు సూత్రాలూ పుట్టింటివారొకటి, మెట్టినింటివారొకటి తీసుకొస్తారు. ఈ రెండూ కూడా పరమేశ్వరి, పరమేశ్వరులకు ప్రతీకలు. అందువల్ల వీటిమీద ఎటువంటి దేవతా మూర్తుల ప్రతిరూపాలూ వుండకపోవడమే మంచిది . ఆది దంపతులు ఆ జంట అన్యోన్యతనీ, సర్వమంగళాదేవి ఇల్లాలి సౌభాగ్యాన్ని , పసుపు , కుంకుమలనూ రక్షిస్తూ ఉంటారు. అందువలనే , ఇది పరమపవిత్రమైనది అని చెబుతారు పెద్దలు .
ఇక కొంతమంది, కేవలం నల్లపూసలు మాత్రమే ధరించి,ఉంటారు . ఆ నల్లపూసలకి గౌరీపూజ సమయంలో నవవధువు చేత, పూజలు చేయిస్తారు. అప్పుడు ఆ గౌరీ నల్లపూసల్లో నిలిచి, నీలలోహిత గౌరిగా మారి, ఆ వధువుకి, నూతనమైన వారి దాంపత్యబంధానికి రక్షణగా నిలుస్తుంది . అది నల్లపూసల్లో ఉన్న విశిష్ఠత .
అయితే, దీంట్లో గుచ్చుకోకుండా సూత్రాలని బంగారం తాడుకి పసుపు సూత్రంతో కట్టి వేసుకోవడమే సరైనదని పండితులు చెబుతున్నారు . ఇక ఇలా వేసుకున్న సూత్రాన్ని మెడలో నుండీ తీసి పక్కపెట్టడం, దిండుకింద, పక్కబట్టలకింద పడెయ్యడం సరైన విధానం కాదని సూచిస్తున్నారు . ఇంకా దీనికి వేరే ఏవిధమైన దేవీదేవతల బొమ్మలనీ తగిలించుకోకూడదని అంటున్నారు. ప్రత్యేకించి లక్ష్మీ దేవి ప్రతిమని అస్సలు వేయించుకోవద్దని, అలా చేస్తే , అరిష్టమని చెబుతున్నారు .