Online Puja Services

కాశీదారం ఎందుకు కట్టుకోవాలి?

3.133.128.168

కాశీదారం ఎందుకు కట్టుకోవాలి?
-లక్ష్మీ రమణ 

కాశీ వెళ్లినా, తిరుపతికి వెళ్లినా నల్లని దారాలని వెంట తెచ్చుకుంటాం వాటిని చేతికో, మెడలోనో కట్టుకుంటాం. పదిమందికి ఆ ప్రసాదంతోపాటుగా ఈ దారాలనీ పంచిపెడతాం. కట్టుకునే వారికీ, వాటిని పంచిపెట్టేవారికీ కూడా వాటిని ఎందుకు కట్టుకోవాలి అనేది తెలుసో లేదో మరి! నాకుకూడా ఇదే సందేహం. గూగుల్ తల్లిని గాగుల్స్ పెట్టుకుని మరీ ప్రార్ధించాను. కనికరించనేలేదు . దాంతో  సర్వదా, సందేహాలకు శరణ్యమైన మా బామ్మగారే  దిక్కని, ఆవిడని ఆశ్రయించాను . సమాధానంగా ఇదీ మా బామ్మోవాచ ! 

‘కాశీ వెళితే నల్లదారాలు చేతికి కట్టుకొని రావడం కాదే , ఆ కాలభైరవుని రక్ష కట్టుకోవాలి . కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు . రక్షకుడు . ఆయన దగ్గర రక్షకి పూజ చేయించుకొని దాన్ని చేతికి కట్టుకోవాలి. అంతేకానీ, రోడ్డుమీద దొరికే నల్లదారాన్ని తెచ్చుకొని కట్టుకోవడం వల్ల ప్రయోజనమేమీలేదే అమ్మాయి’ అంది మా బామ్మ. 

‘ఇక గోవిందుని సన్నిధిలో తిరుమలోనూ కాశీదారాలు అమ్ముతారుకదా ! మరి వాటినికూడా జనం కొనుక్కుని కట్టుకుంటారుకదా బామ్మా ! మొన్న వెంకన్న పంతులుగారు పంపిస్తే, నువ్వుకూడా ఎడం చేతికి భక్తిగా కట్టుకున్నావుగా !’ మా రావిగాడు అడగానే అడిగాడు . ‘బాగా అడిగావులేరా భడవా! ఆ దారం కట్టుకుంది భక్తితో కాదు, ఆడవాళ్లు ఎడం చేతికి నల్లదారం  కట్టుకుంటే, డబ్బు చేజారిపోకుండా ఉంటుంది . అందుకని కట్టుకున్నాను. అంతేకానీ అది వెంకన్న కంకణం అనికాదు. 

తిరుపతి నుండీ తెచ్చుకోవాల్సింది కాశీదారం కాదురా! వేంకటేశ్వరునికి కళ్యాణం చేసి , ఆ పసుపు పచ్చటి కళ్యాణకంకణం ఇస్తారు.  ఆ కంకణము తెచ్చుకోవాలి. నీలాంటి పెళ్లికాని ముదిరిన దొండకాయలకి తొందరగా కళ్యాణం అవుతుంది, ఆవేంకటేశుని కృపతో !’ అన్నది . రావిగాడి నోట్లో ఇక సౌండ్ లేదు అంతే !

కాస్త జంకినా, సందేహం వచ్చినప్పుడు తీర్చేసుకోవడమే ధర్మం కాబట్టి , ‘మరి కాలికి నల్లదారం  కట్టావేందుకే బామ్మ’ అని అడిగాను. ప్రసన్నవదనంతో , సావధానంగా ఆవిడ ఇలా చెప్పింది . అమ్మవారి కరుణాకటాక్షాలతో . ‘అదెందుకంటే, నరుడి దృష్టికి నల్లరాయయినా పగులుతుందే పిల్లా ! చిన్నప్పుడు, నువ్వు బోసినవ్వులు నవ్వితే దిష్టి తగులుతుందని , కణతన, నుదుటనా కాసంత సాదు (సగ్గుబియ్యంతో చేసే నల్లని బొట్టు) దిద్దేదాన్ని ! అడ్డాలనాడు బిడ్డలుగానీ, గడ్డాలనాడు కాదని, నువ్వూ నీ తమ్ముడూ నా అంత ఎత్తయ్యారు! ఇప్పుడు బొట్టు పెట్టుకొండిరా అంటేనే, కంట్లో నలుసంట దిద్దుకుంటారు, నా కళ్ళుతుడవడానికి ! అందుకే ఆ నల్లదారం . మీకు దిష్టి తగలకుండా ఉంటుంది. ఏదైనా చేడు శక్తి ఉంటె, మీ భాషలో చెప్పాలంటే, నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరకి రాకుండా కాపాడుతుంది !’ అని చెప్పింది . 

నమ్మినా నమ్మకపోయినా , మా బామ్మ మాట కాబట్టి మాకైతే నమ్మకమే మరి ! అవునా కాదా అన్నది పండితులైనవారు మరింత వివరణ ఇస్తే , మరింత గొప్పగా ఉంటుంది . ఏమంటారు .   

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha