పూజల్లో తమలపాకుకి ఎందుకంతటి ప్రాధాన్యత ?
పూజల్లో తమలపాకుకి ఎందుకంతటి ప్రాధాన్యత ?
-లక్ష్మీరమణ
తమలపాకు మనకి ఒక పవిత్రమైన పత్రం. పూజల్లో విరివిగా తమలపాకుని వినియోగిస్తాం. తాంబూలమనే పేరిట మనం తమలపాకుని వినియోగించినట్టుగా ప్రపంచదేశాల్లో మారె దేశమూ ఈ పాత్రరాజాన్ని వినియోగించాడంటే, అతిశయోక్తి కాదు . మరి పూజల్లో దీనికి ఎందుకంతటి ప్రాధాన్యత ఏర్పడింది? రండి తెలుసుకుందాం ఈ తమలపాకు కథ .
స్కాంద పురాణం ప్రకారం క్షీరసాగర మథనంలో పుట్టిన అపురూపమైన వస్తువుల్లో తమలపాకు కూడా ఒకటి. ఈ తమలపాకుని గౌరీ శంకరుల స్వయంగా కైలాసం నుండీ తీసుకొచ్చి , హిమాలయాలలో నాటారనే కథకూడా ఉంది . ఏదేమైనా, శ్రీకృష్ణుడు దేవపారిజాతాన్ని ఇలకి తీసుకొస్తే, ఆ పరమేశ్వరుడు తమలపాకుని భువిజనులకోసం అనుగ్రహించారన్నమాట.
ఇక తమలపాకులోనికి ప్రతి భాగమూ కూడా దేవీ దేవతలకి నిలమై ఉంటుందని, దాని విశిష్ఠతని ఇలా పండితులు వివరిస్తున్నారు . తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారు. తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన జ్యేష్టా దేవి ఉంటుంది. తమలపాకులో విష్ణుమూర్తి ఉంటాడు. ఈ ఆకుల పైభాగంలో శివుడు, కామదేవుడు ఉంటారు. తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు. తమలపాకుకి కుడి భాగంలో భూమాత ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటారు.
కాదని అంటిపెట్టుకొని జేష్టాదేవి ఉండడం వలన ఆ కాదని తొలగించి , తాంబూలం వేసుకోవాలి. అలాగే, దేవీదేవతలని తాంబూల సహితంగా ఆహ్వానించేప్పుడు , కాదని తొలగించి దానిపైన వక్క, పసుపుకొమ్ము, ఖర్జూరాలు, పూలు పెట్టి , దక్షిణ సహితంగా సమర్పించాలి .
తమలపాకుల పైన మన్మధుడు ఉంటాడు. అందువల్ల దంపతుల అన్యోన్యతకి తాంబూల చర్వణం మంచిది. ఇక పార్వతీదేవి, భూదేవి, మాంగల్యదాయని గౌరమ్మ ఉంటారుకాబట్టి ఇది మహిళలకి సౌభాగ్యదాయని . దేవీదేవాలటని ఆవాహన చేసేందుకు సరైన పత్రము .
ఇక ఆయుర్వేదంలో తమలపాకుకున్న విశిష్టతని గురించి ఎంతగా చెప్పుకున్న తక్కువే . ఇంత గొప్పదనాన్ని అణువణువునా నింపుకున్నది కాబట్టే, ఆ ఆంజనేయునికి ఆయనంత ప్రీతిపాత్రమైనది తమలపాకు. హిందువుల పూజల్లో గణనీయమైన ప్రధమస్థానాన్ని పొందింది . అష్ట మంగళాలలో (1.పూలు 2.అక్షింతలు, 3.ఫలాలు,4,అద్దం, 5.వస్త్రం, 6.తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా నిలవగలిగింది .