కాళ్ళకి పట్టీలు ఎందుకు వేసుకోవాలి ?
కాళ్ళకి పట్టీలు ఎందుకు వేసుకోవాలి ?
లక్ష్మీ రమణ
కాళ్ళకు వెండి పట్టీలు తొడుక్కొని ఇల్లంతా తిరగేస్తుంటే, ఆ చిన్నారి అందేల సందడి సిరిమహాలక్ష్మి సవ్వడిని తలపించదూ ! అందుకే మనవాళ్ళు ఆడపిల్లలకి కాళ్లకు పట్టీలు పెట్టుకోమని చెప్పారంటారా ? లేక మరింకేదైనా కారణముందా ? మా బామ్మయితే, క్షణమైనా ఆ పట్టీలు పక్కన పెడితే, ఇల్లుపీకి పందిరేసినంతపని చేస్తుంది. ఏకాస్తో పెరిగిపోయి ఒక్కరోజు వేసుకోకపోయినా , ఇక ఆరోజు రక్షించమని గోవిందుని బతిమిలాడుకోవాల్సిందే !! మీకూ ఇలాంటి అనుభవమే ఉందా ?
మా నాన్నగారికి పట్టపగలు చుక్కలు చూపించేసింది మా బామ్మ. చెల్లెలికి ఘల్లుఘల్లుమని మోగే పట్టీలు తీసుకురాలేదని! “ఇంట్లో చక్కగా పట్టీలు వెసుకొని పిల్ల అటూ ఇటూ నడుస్తూ ఉంటె, యెంత ముచ్చటగా ఉంటుందిరా! ఇప్పుడా మోతలు మీకు డిస్ట్రబ్బులా !( అని బుగ్గలు ఎడాపెడా ఒత్తేసుకొని) , ఇదిగో ఇదే చెబుతున్నా దానికి చక్కగా మోగే పట్టీలు రేపీపాటికల్లా తెచ్చేయాలి. ఆ మోతల్లో లక్ష్మీ దేవుంటుందిరా! పిల్ల ఎటు తిరిగినా చక్కగా తెలుస్తుంది కూడా అన్నది ! “
ఆమ్మో యెంత కుతంత్రం ! ఎటు తిరుగుతున్నామో ఈ బామ్మ కళ్ళుమూసుకొని కొంగజపం చేసుకుంటూ కనిపెడుతోందన్నమాట ! అనుకున్నాం. కానీ, ఆవిడ ఆతర్వాత చెప్పిన వివరణ విన్నాక, పట్టీలు వేసుకోకుండా ఉండకూడదని నిర్ణయించుకున్న మాట వాస్తవం . ఇంతకీ మాబామ్మోవాచ ఏంటంటే,
ఆడపిల్లలకి పుట్టగానే కాళ్ళకు పట్టీలు, పెళ్లవగానే కాలి వేళ్ళకు మెట్టెలు తొడగాలి. పాదాలకు వెండి పట్టీల తొడగటం వల్ల శరీరంలో ఉన్న వేడి బయటకు వెళ్ళిపోతుంది . అంతేకాక , స్త్రీల యొక్క ఆంతరంగిక నాడులు ప్రేరేపించబడి వారు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయి . అందుచేతనే ఆడపిల్లలకి ఈ రెండూ ముఖ్యము. ఖచ్చితంగా పాటించాలి.
ఫ్యాషన్ అనీ పూసలూ, ముద్దు ఎక్కువై బంగారాన్ని కాలికి పెట్టుకోకూడదు . దానివల్ల ప్రయోజనం లేకపోగా, నష్టాలు , దోషాలూ జరిగే ప్రమాదముంది. ఎందుకంటె, బంగారం లక్షీ స్వరూపం . దాని కాలికి పెట్టుకోవడం, కాళ్లతో తన్నడం, భూమిమీద పెట్టడం, పడేయడం చేయకూడదు. దానివల్ల లక్ష్మీ స్వరూపమైన పట్టీలు వేసుకొని , లక్ష్మీదేవి కటాక్షానికి బదులు ఆవిడ ఆగ్రహానికి కారణమయ్యే ప్రమాదముంది .
కాబట్టి చక్కగా వెంటనే పిల్లలకి పట్టీలు తీసుకురా ! అని ఆజ్ఞాపించింది. అది బామ్మ మాట ! ఆమె మాటే శాశనం . అంతే . ఆ మాటల్లో మరో విష్యం కూడా అర్థమయ్యింది. చిన్నారి పాపలు ఆడుకుంటూంటే, వాళ్ళ అమ్మలు పిల్లు ఎక్కడున్నారో వాళ్ళ అందేల సడిని బట్టీ గమనించుకోవచ్చన్నమాట ! ఇదేదో చాలా బాగుంది కదూ !