Online Puja Services

ఆచమనం ఎందుకు చేయాలి?

18.117.75.6

ఆచమనం ఎందుకు చేయాలి? 
సేకరణ : లక్ష్మి రమణ 

సత్యనారాయణ వ్రతం అందరూ ఇళ్లల్లో చేసుకునేదే! ఇక కొంతమందయితే, కేదారేశ్వరవ్రతం ఏడాదికి ఒక్కసారైనా, ప్రత్యేకించి కార్తీకమాసంలో తప్పకుండా చేసుకుంటూ ఉంటారు. ఇలా ఏదైనా వ్రతాలూ , పూజలూ, నిత్య పూజల్లో కూడా ఆచమనం చెయ్యడం ఒక సంప్రదాయం. ఇది చాలా విశిష్టమైనది . పవిత్రమైనది , ప్రత్యేకమైనది కూడా . కానీ ఇందులోని అంతరార్థం ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందామా . 

ఆచమనం ఎందుకు చేయాలి? 

మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది.  అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం.

 స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు.  స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.  ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. 

 ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.

ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు,నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. 

వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.

ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అనిచెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. 

ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.

శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగాతాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ,జాగ్రత్త అలవడుతుంది. 

రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.

“కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. 

చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది.

ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈమంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది.  పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది.

ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంతవిద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. 

చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసిశరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.

ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆకొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, ప్రేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.

ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై,లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.

ఆచమనం ఎప్పుడు చేయొచ్చు ?

ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.

ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.

ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి.

ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది.

 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore