ముత్తైదువుగా సౌభాగ్యం నిండు నూరేళ్ళూ వర్ధిల్లాలంటే
ముత్తైదువుగా సౌభాగ్యం నిండు నూరేళ్ళూ వర్ధిల్లాలంటే, ఇలా చేస్తే చాలు .
లక్ష్మీ రమణ
ఐదోతనం కోసం తపించని స్త్రీ ఎవరుంటారు. దైవం అనుకూలించి , తన భర్తని కాపాడాలని, తానూ సుమంగళిగా వెళ్లిపోవాలని కోరుకోని భారత స్త్రీలు ఉండరంటే, అతిశయోక్తి కాదు. సుమంగళిగా ఉండేందుకు ఎన్నో నోములూ వ్రతాలూ ఆచరిస్తుంటారు భారతీయ ఆడపడుచులు . సువాసినీ పూజలు, కుంకుమార్చనలు, దేవతార్చనలు ఇలా వీటికి అంతం లేదు . అంతులేని ఐదోతనాన్ని కోరుతూ ఎంతటి శ్రమకైనా వెనుతీయని తత్త్వం మనది. కానీ ఈ సౌభాగ్యం కోసం ఒక చిన్న పని చేస్తే చాలంటుంది మన మంత్రం శాస్త్రం.
ఆకాశం పరమాత్మని, నాధునిగా పొందిందనుకుంటా! ఉదయాన్నే తలంటుకుని , కురులు ముడేసుకున్న నిండు ముత్తైదువులా , నీలి మబ్బుల ముడి వేసుకొని సూర్యుణ్ణే తన కుంకుమగా ధరించి వెలిగిపోతూ కనిపిస్తుంది. భారతీయ ఆడపడుచులూ అంతే కదా ! నిండు పసుపు కుంకుమలతో ఎదురుగా నిలిచిందంటే ఆ అమ్మవారి స్వరూపం రూపుకట్టి ఎదురుగా నిలబడ్డట్టే .
కలకాలం పసుపు కుంకుమలు నిలుపుకుని, ముత్తైదువుగా ఉండాలంటే ఏంచేయాలి ? సుమంగళిగా ఉన్న ప్రతి స్త్రీ ప్రశ్న ఇది. వాళ్ళందరి తరఫునా , ఆ అమ్మలగన్న అమ్మ పార్వతమ్మ వకాలతు పుచ్చుకొని పరమేశ్వరుణ్ణి ఆ ప్రశ్నే అడిగింది.
ఆయన చాలా సులువైన ఉపాయాన్ని చెప్పారు. అదేమిటంటే, పెళ్లయిన తర్వాత ఆ ఇల్లాలు భర్త పేరిట , తన శరీరంలోని ఐదు చోట్ల కుంకుమ ధరిస్తే చాలు . వైధవ్యం దూరంగా ఉంటుందట . ఎక్కడెక్కడంటే,
1.పాపిట్లో
2. కనుబొమల మధ్యన అనగా భృమధ్య భాగంలో
3. ముచ్చెలి గుంటలో అనగా కంఠం కింద భాగంలో
4. వక్షస్థలం మీద
5. నాభి ప్రాంతంలో .
ఇదే మహాపూజ. ఇల్లాలికి పతియేకదా ప్రత్యక్షదైవము. అందువల్ల ఇలా ఆవిడ చేస్తే, ఆయన నిండైన ఆయుష్షుతో వర్ధిల్లుతారని ఈశ్వరుడు చెప్పారు. ఇది మంత్రశాస్త్రానుగతం అని కూడా వివరించారు. కాబట్టి ఆవిధంగా చేసి మన ధర్మాన్ని కాపాడుకుందాం.
శుభం.