ఏ సమస్యకి ఏదేవుని ఆరాధించాలి?
ఏ సమస్యకి ఏదేవుని ఆరాధించాలి?
-లక్ష్మీ రమణ
లోకములో సమస్యలు లేనివారెవరు ? కానీ సమస్య చుట్టుకుందంటే, యెంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు ‘ అంగట్లో అన్ని ఉన్నాయి , అల్లుడినోట్లో శని ఉంది’ అన్నట్టు ఉంటుంది వ్యవహారం. తినబోయే లోపల మన ముందర నుండీ కంచం లాగేసినట్టుంటే, భరించడం చాలా కష్టమైన పనికదా ! అటువంటి సమస్యలు భయంకరంగా వేధిస్తున్న సమయంలో ఇక నీకు దేవుడే దిక్కురా అంటూంటారు . కానీ ఏ దేవుడు ? ఏ సమస్యకి ఏదేవుని ఆరాధించాలి అనే విషయంలో పండితులు ఇలా చెబుతున్నారు .
గ్రహ దోషాలో, ప్రారబ్ద కర్మలో, లేక పితృ శాపాలో కొన్నిసార్లు అనుకున్న పనులేవీ ముడిపడవు. పైగా లేనిపోని సమస్యలు ఎదురై పట్టి పీడిస్తుంటాయి. మానసిక, శారీరిక రుగ్మతలు ఏ వైద్యానికి లొంగకుండా ఇబ్బంది పెడతాయి . అటువంటి సమయాల్లో సమస్యలకి పరిష్కారం దైవానుగ్రహమే . ఆ అనుగ్రహాన్ని పొందేందుకు ఏయే సమస్యలకి ఏ దేవతని పూజించాలనే విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం .
మానసిక బలం, శరీర దృఢత్వం కోసం - రాజరాజేశ్వరిని, శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్ధించాలి.
ఆయురారోగ్యాల కోసం - రుద్రుడిని పూజించాలి.
వ్యాధులు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలి అంటే- శ్రీ ధన్వంతరీని పూజించాలి.
విద్యారంగలో రాణించాలి అంటే - శ్రీ సరస్వతిని, శారదాంబని కొలవాలి.
గృహం, భూమిని కొనాలంటే -శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని, అంగారకుడిని పూజించాలి.
వివాహ అడ్డంకులు తొలగిపోవాలి అంటే -శ్రీ కామాక్షి దేవిని, శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.
మాంగల్య దోషాలు తోలగిపోవాలి అంటే -శ్రీ పార్వతిదేవిని పూజించాలి.
భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు తొలిగిపోవాలంటే- కాత్యాయనీదేవిని ప్రార్ధించాలి .
శత్రుబాధలు తొలగిపోవాలి అంటే -నారసింహుని పూజించటం ఉత్తమం.
వ్యాపారంలో లాభం కోసం -శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లాభం.
సంతాన ప్రాప్తికోసం -సంతాన గోపాలుని, సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.
ఏ విభాగం వారు కార్యాలయంలో ఆ విభాగానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తూ, కార్యాలయం లాభాలలో నడిచేలా చూస్తుంటారు కదా ! ఇది కూడా అలాంటిదే అన్నమాట . ఈ సమస్యలకి ఈ దేవీ దేవతలని లని ప్రార్థించడం వలన పరిష్కారం జరుగుతుంది .