పూజల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు?
పూజల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఏ ఉపచారాన్ని ఎలా ఆచరించాలి ?
లక్ష్మీ రమణ
బామ్మ మాట బంగారుబాట అని సినిమా ఒకటుంది చూశారా ! మాయింట్లో అయితే, రోజూ ఇదే సినిమా నడుస్తుంది. ఆమె మాటలు నిజంగానే బంగారుమూటలు మరి! ఎవరి ఇంట్లోనైనా అంతేకదా ! ‘నాలుగు పెట్టి స్నానం చేయించవే అమ్మాయి, వాడికి బాగా జలుబు చేసింది! ఒరేయ్ ఆ కూర్చొని మంత్రపుష్పం చదవడం ఏమిట్రా ! అయినా బొట్టు పెట్టుకోకుండా ఏం పూజలు అఘోరిస్తున్నావ్ !’ అని ఆప్యాయతలో, కాస్త కోపాన్ని మేళవించి సున్నితంగా సంప్రదాయాన్ని పరిచయం చెయ్యడం మా బామ్మ స్టైల్ . అందుకే బామ్మోవాచ అద్భుతః అని అలా ఇల్లంతా పాలో అయిపోతాం. అది సరే, ఆవిడ చెప్పిన కొన్ని ఇలాంటి అద్భుతః ల్ని మీతో పంచుకుందామని ఈ ఉపోద్ఘాతమంతా !
పెద్దవాళ్ళు ఆంటే మరి . ఆప్యాయంగా వాళ్ళు తిట్టే తిట్లు పిల్లలకి దీవెనలేగానీ మరొకటి కాదు. అయినా ఆలా చెప్పేవాళ్ళు లేకపోతె, సంప్రదాయం అలా తరాలుగా నడవడం కష్టమేనేమో అనిపిస్తుంటుంది, ఇప్పటి బిజీ బతుకులు, ఉరుకుల పరుగుల జీవితాలనే తలుచుకుంటుంటే. ఒకపక్కన టైంతో పరిగెత్తలేక ఏడుస్తుంటే, మధ్యలో ఈవిడ నసొకటి అని అప్పటికి అనిపిస్తుంది. మనసుకదా నిజం తెలిసినా అది అనేది అనకుండా ఊరుకోదు మరి. అయినా ఆవిడా అలా కర్ర పోటేసుకొని , అన్ని పర్యవేక్షిస్తూ చెబుతూ చేయిస్తూ, తానూ మధ్యలో ఏకూరో తరిగిపెడుతూ , చూసుకుంటుంటే,ఆ కిక్కే వేరప్పా ! బామ్మ లేకపోతె ఎట్టా అని కూడా అనిపిస్తుంటుంది .
ఇంతకీ ఆమె చెప్పిన కొన్ని గొప్ప విషయాలు , అద్భుతః లు ఏమిటీ అనేగా అడుగుతున్నారు. పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలని గురించి ఇదిగో ఇలా కొన్ని చక్కనివిషయాలు ఆవిడ ద్వారా తెలుసుకున్నాం. వాటిని మీ అనుకూలత కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం . చూడండి .
గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉంచుకోకూడదు . ఒకవేళ అలా ఉంచుకుంటే , రోజూ మహానివేదన తప్పకుండా చేయాలి .
మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవకూడదు. రాములోరిని నిద్రలేపేప్పుడు , విశ్వామిత్రులవారు కూడా నిలబడే సుప్రభాతాన్ని పఠించారు . ఇక సృష్టి కార్యాన్ని, పరమాత్ముని స్వరూపాన్ని, ఆయన విశ్వవ్యాపకత్వాన్ని తెలిపే మంత్రపుష్పాలన్నీ కూర్చొని చదవ కూడదు .
‘జో అచ్చుతానంద జోజో ముకుందా లాలిపరమానంద రామగోవిందా’ అని కమ్మని పాటని పాడుతూ ఈశ్వరుడుకి పవళింపు సేవ చేస్తాం కదా ! అది నిలబడి చేయకూడదు . ప్రశాంతంగా కూర్చొని, ఆయన నిద్దరోయే వేళ మనం కూడా సద్దు చేయకుండా, సేవచేస్తూ బజ్జో పెట్టాలి .
బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. దైవకార్యాలకి, మంగళప్రదమైన బొట్టు ఖచ్చితంగా ధరించాలి. ఆ స్వామికి ధరింపజేయాలి .
గురుదేవోభవ అని కదా ఆయోక్తి ! అందువల్ల ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయకూడదు . అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి. రెండుచేతులూ జోడించి, తల వంచి నమస్కారం చేయాలి .
ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి,
అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కకూడదు . ఆ నిర్మాల్యం భగవంతునిలో ఐక్యం ఐనదానితో సమానం. స్వయంగా భగవంతునితో సమానమే ! ఒకవేళ అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును.
రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
ఇలా ఎన్నో అద్భుతమైన విధుల్ని బామ్మగారు చక్కగా చెప్పేవారు. ధర్మసందేహాలని తీర్చేసే ఇలాంటి గొప్పవిషయాలని దగ్గరుండి నేర్పించిన బామ్మగారికి కృతజ్ఞతలతో, శలవు !