దేవునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి?
దేవునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి?
లక్ష్మీ రమణ
మావూళ్ళో ఒకాయన ఉండేవారు . ఆయనకీ వెంకటేశ్వరునిపైన అపారమైన భక్తి, గౌరవం, నమ్మకం కూడా ! ఆ స్వామికి మొక్కుకుంటే, అన్ని పనులూ అయిపోతాయని బలమైన విశ్వాసం. ఎప్పుడు మొక్కుకున్నా, ఇంత డబ్బు వేస్తాననో , ఈ ప్రసాదం చేయిస్తాననో , లేదా ఈ పూజ చేయిస్తాననో మొక్కుకునేవారు కాదు . తలనీలాలిస్తానని మొక్కుకునేవారు. ఆయనకి పెళ్ళి కాకముందు మొదలైన వ్యవహారం , తల తెల్లబడిపోయినా, క్షవరం (కటింగ్) చేయించుకునే అవసరం లేకుండా అలా ఆ స్వామి మొక్కులతోనే కాలం వెళ్లదీశారు . ఓసారి ఆ పెద్దాయనని ప్రశ్నిస్తే, ఆయన చెప్పిన సమాధానం ఇదీ !
అమ్మా ! నీకో కథ చెబుతాను. ఇది మన మహాభారతంలోది . జయద్రధుడు(సైంధవుడు), దౌపదిని చెడు దృష్టితో చూస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త ఈ సైంధవుడు. అంటే, పాండవులకి కూడా దుశ్శల ఆడపడుచు, సైంధవుడు ఆమె భర్త. అయినా, భార్యని అవమానించాడనే కోపం భీముడికి పట్టశక్యం కాదు . అతనిని సంహరించేందుకు భీముడు సిద్ధపడతాడు . ఆ నేపథ్యంలో ధర్మరాజు తమ్ముణ్ణి వారిస్తాడు. చెల్లెలి పసుపు కుంకుమలు తీసేస్తూ , అతన్ని వధించడం అన్నలుగా తమకి ధర్మసమ్మతం కాదని హితవు చెబుతాడు . అలా అని అతన్ని వదిలేయమనలేదు . ఆ పనికి పురికొల్పిన అతని అహంకారాన్ని తుంచేయమన్నారు . తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని ధర్మరాజు ధర్మసూక్ష్మాన్నీ వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. అదే విథంగా రుక్మిణిని తీసుకెళుతున్న మాధవుణ్ణి ఎదుర్కొన్న ఆమె అన్న రుక్మికి కూడా భగవానుడు అదే శిక్షవేస్తారు.
దీనిని బట్టి , తలపైన వెంట్రుకలు అనేవి, మన అహంకారానికి ప్రతీకలని తెలుస్తోందికదా ! ఆ అహంకారమే భగవంతునితో వైరానికి కారణం . అహాన్ని తొలగిస్తే, ఆ పరమాత్మ స్వయంగా మనల్ని ఆదరిస్తారు . ఆయన వాత్సల్యం మనకి అర్థమవుతుంది . ఆ పరమాత్మకీ , మనకీ ఉన్న అడ్డుతెర ఆ అహంకారం మాత్రమే కదా ! అందుకే తలనీలాలిస్తే చాలు, మన అహంకారాన్ని తీసి ఆ స్వామీ పాదాల దగ్గర పెట్టినట్టే. అహంకారానికి ప్రతీక అయినా మన శిరస్సుని ఖండించి ఆయనకి అర్పించినట్టే . ఆయన అనుగ్రహించడానికి , ఆ కరుణని దోసిళ్ళతో ఆస్వాదించడానికి మనం ఇంతకన్నా ఏం చేయగలం ? ’ అని చెప్పారు. యెంత అద్భుతమైన సమాధానం అనిపించింది. ఇంతకన్నా భగవంతునికి సమర్పించగలిగేది మరేదీ లేదని తోచింది .
ఆ పెద్దాయన పెద్దగా చదువుకోలేదు. కానీ చిన్నప్పుడు హరికథా భాగవతులు చెప్పిన విషయాలు, సంప్రదాయ బద్ధంగా తమ పెద్దవారినుండీ నేర్చుకున్న విషయాలూ తప్ప గొప్ప పండితులూ కాదు . కానీ దాని వల్ల సంక్రమించిన సంస్కారం చాలా గొప్పది . అదే ఇప్పటి తరానికి మనం మళ్ళీ వారసత్వంగా అందించవలసింది.
భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. అయితే, ఇది పురుషులు మాత్రమే చేసుకోవాలని, స్త్రీలు కేవలం భర్త కైవల్యాన్ని పొందిన సందర్భంలో తప్ప , అన్యథా శిరోముండనం చేయించుకోకూడదని శాస్త్రం .