ఉదయం నిద్ర లేవగానే చూడాల్సినవి , చూడకూడనివి

ఉదయం నిద్ర లేవగానే చూడాల్సినవి , చూడకూడనివి ?
-లక్ష్మీ రమణ
‘ఉదయం లేవగానే ఎవరి ముఖం చూశానో ఏమో ! ఇవాళ నాకన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి ‘. అంటే,’ నీముఖమే అద్దంలో చూసుకున్నవేమో గుర్తుచేసుకో’ అని మా అమ్మ సమాధానం . ఇలా ప్రశ్నించుకునేవారు, సమాధానము చెప్పేవారూ మనకి నిత్యం కనిపిస్తూనే ఉంటారు . కొన్ని సార్లు మనకి కూడా అది స్వయంగా అనుభవమే ! అయితే, ఇటువంటి దురవస్థలు రాకుండా , మనం ఉదయం లేవగానే ఏం చూడాలో ఎందుకు చూడాలో శాస్త్రం చెప్పింది .
‘కరాగ్రే వసతే లక్ష్మీ
కర మధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ
ప్రభాతే కర దర్శనం’
చేతి పైభాగంలో - సంపద దేవతైన (కార్యము-క్రియా శక్తి) లక్ష్మీ దేవి ఉంటుంది. అరచేతి నడుమ విద్యాధి దేవతయైన సరస్వతి వశిస్తుంది (శబ్దము-జ్ఞాన శక్తి). అరచేతి మొదట పవిత్రమైన ఆలోచనలకును సహజ ప్రతిభకు దేవతైన (ఆలోచన, ఇచ్ఛా శక్తి) గౌరి నివాసముంటుంది. మనము నిద్ర నుండి మేల్కొనగానే అరచేతిలో ఈ ముగ్గురు పరమ దివ్య శక్తులను భావన చేత చూసి, వారిని ఈ శ్లోకంలో ప్రార్థించాలి . దీనివల్ల భావశుద్ధి సంప్రాప్తిస్తుంది . త్రిశక్తుల కరుణ లభిస్తుంది . సర్వకార్య జయం కలుగుతుంది .
ఆ తరువాత మనం భూమి మీద కాలు పెట్టగానే భూదేవత కు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది కనుక ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ప్రతీ రోజు మన దినచర్యను ప్రారంబిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇవి కాకుండా , ఉదయం నిద్ర లేవగానే చూడాల్సిన వాటిని పరిశీలిస్తే, బంగారం, సూర్యుడు, ఎర్రచందనము, సముద్రము, గోపురం, పర్వతము, దూడతో ఉన్న ఆవు, కుడి చేయి, తన భార్యని చూడటం మంచిది. తల్లిని లేదా తండ్రిని కూడా చూడొచ్చు. ఇవికాక ఇష్టదైవం పటం చూడటం కూడా శుభప్రదమే .
ఇక నిద్రలేవగానే చూడకూడని విషయాలు పరిశీలిస్తే.. మురికిగా, విరిగిపోయిన వస్తువులు చూడవద్దు. విరబోసుకుని ఉన్న భార్యను కూడా చూడకూడదు . బొట్టులేని ఆడపిల్ల, క్రూరజంతువులు లేదా వాటి ఫోటోలు చూడకూడనివి .
శుభం !!