ఉల్లి, వెల్లుల్లి ఎందుకు వద్దు ?

ఉల్లి, వెల్లుల్లి ఎందుకు వద్దు ?
-లక్ష్మీ రమణ
ఉల్లి చేసిన మేలు తల్లయినా చేయదని సామెత. అది నిజంకూడా ! కానీ దైవికమైన పూజలు వ్రతాలు చేసేప్పుడు , పర్వదినాలలో వీటిని తీసుకోవద్దని చెబుతారు పెద్దలు. సమాజంలోని కొన్ని జాతులవారు, ఆధ్యాత్మిక సాధన చేసేవారూ పూర్తిగా వీటిని విసర్జించాలని శాస్త్రం . ఎందుకలా ?
అంటే, దీనికీ మనిషిలోని గుణాల ప్రకోపానికి సంబంధం ఉంటుంది అని చెబుతుంది ఆయుర్వేదం. సాత్వికం, రాజసికం, తామసికం అనేవి వ్యక్తి యొక్క త్రిగుణాలు . ఆహారంలోని ఒక్కో పదార్థం మనిషిలోని ఒక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి. మాంసాహారం, మసాలా దినుసులు ఇంకా కొన్ని మొక్కలు రాజసిక తత్వానికి చెందినవి. వీటిని తీసుకోవడం వలన కోపం, ఆలోచనలలో అస్థిరత, ఏకాగ్రతలోపం కలుగుతాయట.
‘తినదగిన వస్తువు దుర్గంధముతో కూడిన ఘాటును కలిగియుండ కూడదు. శాస్త్రవిహితములైన ఆహారపదార్థములలో ఈ లక్షణం ఉండదు. ఒకవేళ ఇటువంటి దుర్లక్షణం తినే పదార్థాలలో ఉంటే అది రజోగుణాన్ని తమోగుణాన్ని పెంచి సూక్ష్మవిచారమునకు అనుకూలమైన బుద్ధిని నాశనంచేస్తుంది. ఉల్లి, వెల్లుల్లిల్లో ఈ లక్షణం ఉంది కాబట్టి అవి నిషేధితములు ’ అని మన ధార్మిక గ్రంధాలు చెబుతాయి .
ప్రత్యేకించి ఉల్లి, వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. ఆధ్యాత్మిక నిష్టతో ఉండాలనుకునే వారి మనసును మళ్లిస్తాయట. తపస్సు చేసుకొనే మునివర్యుని మనసుని మళ్లించేందుకు ఇంద్రుడు అప్సరసలని పంపించినట్టు, మనసుని వికలము చేసి, ఏకాగ్రతకి భంగంకలిగిస్తాయట ఈ ఉల్లి , వెల్లుల్లి . యోగగ్రంధాలు కూడా , సాధకులకు ఇవి అవిహితాలనే చెబుతున్నాయి .
అందుకే పూర్తిగా నిషేధించ లేనప్పుడు, కనీసం , ప్రత్యేక సందర్భాలలో ముఖ్యంగా ఎక్కువసేపు ఏకాగ్రతగా కూర్చుని చేయవలసిన పూజలు, వ్రతాలలో ఆహారంలో వాటిని నిషేధించారు. ఇక , భూఅంతర్భాగంనుండీ లభించే ఈ గడ్డలకి తొమ్మిది రకాల ప్రాణాలుంటాయంటుంది జైన సిద్ధాంతం . కాబట్టి వీటిని తినొద్దని చెబుతుంది . పైగా భూగర్భం నుండీ వీటిని వెలికితీసి శుభ్రం చేసే సమయంలో సూక్ష్మజీవులు హత్యకు గురవుతాయని వాటిని తినడానికే దూరంగా ఉండాలని మరో విశ్లేషణ .
ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు అవి పెరిగే ప్రదేశం శుచీశుభ్రత లేకుండా ఉంటాయని వాటికి దూరంగా ఉంటారట, భగవంతుణ్ణి భక్తితో కొలిచేటప్పుడు ఇలాంటివి సేకరించడం, వాటిని ఆహారంలో తీసుకోవడం తప్పుగా భావిస్తారు.