గుడిలో దర్శనం చేసుకున్నాక, కాస్సేపు ఎందుకు కూర్చోవాలి?
గుడిలో దర్శనం చేసుకున్నాక, మండపంలో కాస్సేపు కూర్చొని రమ్మని చెబుతారెందుకు ?
- లక్ష్మీరమణ
భగవంతుని దర్శనానికి గుడికి వెళతాం . ప్రదక్షిణాలు చేసుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించాక, కాసేపు అక్కడి మండపంలో కూర్చొని రమ్మని చెబుతారు పెద్దలు . అది మన గ్రామం లేదా పట్టణంలోని స్థానిక కోవెల అయినా, పుణ్యతీర్థమైనా సరే, ఈ నియమాన్ని తప్పక పాటించమని చెబుతూంటారు. ఇలా కోవెల మండపంలో కాసేపు కూర్చొని ప్రార్థన చేయడాన్ని దర్పణ దర్శనం అంటారు. ఇలా ఊరికినే కూర్చోవడం కాదు . ఇందులో ఒక గొప్ప అంతరార్థం ఉంది .
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారంలో కానీ కాసేపు కూర్చుని చిన్న ప్రార్ధనచేసేవారు.
“అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం." ఇదీ ఆ ప్రార్థన .
అనాయాసేన మరణం- అంటే నాకు నొప్పీ, బాధా లేని మరణాన్ని ప్రసాదించు.
వినా ధైన్యేన జీవనం- అంటే నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా గౌరవంగా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
దేహాంతే తవ సాన్నిధ్యం-మృత్యువు నన్ను చేరడానికి వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.
దేహిమే పరమేశ్వరం- ఓ ప్రభూ నాకు ఈ మూడు వరములను ప్రసాదించమని నిన్ను అర్థిస్తున్నాను. కాబట్టి కరుణించు. అని ప్రార్ధించడం .
ఎప్పుడు గుడికి వెళ్లినా కాస్సేపు అక్కడ కూర్చొని రమ్మనడం లోని ఆంతర్యం ఇదీ . ఆ కాస్సేపు భగవంతుని పైన మనస్సుని లగ్నం చేసి, ఆ పరమాత్మని ప్రార్ధించాలి . ఇంతకన్నా ఆయన్ని కోరేదేంన్ది ? జీవితానికి కాయాల్సినదేముంది ? దీనినే దర్పణ దర్శనం అంటారు. మనస్సనే దర్పణంలో పరమాత్మని దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ.