ఆలయంలోపలికి వెళ్ళే ముందర గడపకి నమస్కరిస్తారెందుకు ?
ఆలయంలోపలికి వెళ్ళే ముందర గడపకి నమస్కరిస్తారెందుకు ?
లక్ష్మీ రమణ
ఇంటి గడపకి కూడా ద్వారలక్ష్మీగా భావించి పూజలు చేస్తుంటాం . ద్వారానికి పసూపు కుంకుమలతో ప్రతి పండుగకీ అలంకారం చేయడం , పూజించడం మన సంప్రదాయంగా విలసిల్లుతోంది . అయితే మన ఇంట్లో ఉండే గడప సాధారణంగా చెక్కతో చేసినదై ఉంటుంది . కానీ దేవాలయాల్లో , ప్రత్యేకించి పురాతనమైన దేవాలయాల్లో రాతితో చేసిన గడపలు ఉంటాయి . ఆలయంలోపలికి వెళ్లేప్పుడు ఖచ్చితంగా ఈ గడపకి మొక్కే , లోపలికి వెళతారు. అలా ఎందుకో తెలుసుకుందాం .
పూర్వకాలంలో కట్టిన ఆలయాల్లో అద్భుతమైన శిల్పసంపద మన దేశంలోని ఆలయాల్లో ఉన్న గొప్పదనం . ఆధ్యాత్మిక సంపదతోపాటుగా , ఆ ఆలయాల్లో ఉన్న శిల్పకళా సంపద కూడా మన దేశానికే ఉన్న గొప్ప వరాలలో ఒకటి. ఈ ఆలయాల్లో కచ్చితంగా రాతి గడపలే ఉంటాయి . భగవంతుడు ఎక్కడ వెలసిన కొండలమీద ఎక్కువగా స్వయంభువై వ్యక్తం కావడం అనేది ఇక్కడ మనం పరిగణించాల్సిన అవసరం ఉంది . కొండలన్నీ కూడా రాతి బండలే ఎక్కువ . అలాగని వాటిని రాతి బందాలనుకునేరు . ఆ పర్వతాల్లో తపస్సుని ఆచరించిన మహర్షులు , తాపసులు కూడా ఉన్నారు . ఒకప్పుడు ఈ పర్వాతాలకి రెక్కలుండి , అవి ఎగిరే శక్తిని కూడా కలిగి ఉండేవని పురాణాలు చెబుతున్నాయి . గొప్ప చరిత్రగలిగిన, పవిత్రమైన ప్రదేశాలు ఈ పర్వతాలు .
అలాంటివారిలో భద్రుడు , హిమవంతుడు, నారాయణుడు కూడా ఉన్నారు . భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే అటువంటి కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.
అయితే, ఇటువంటి గడపలు దేవాలయాల్లో ఉన్నప్పుడు నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా జాగ్రత్తగా దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.