శబరిమలకు అయ్యప్పలు కట్టే ఇరుముడిలో ఏముంటుంది ?

శబరిమలకు అయ్యప్పలు కట్టే ఇరుముడిలో ఏముంటుంది ?
- లక్ష్మి రమణ
నియమాల మాలే అయ్యప్ప మాల . ఆ పదునెట్టాంబడి ఎక్కినవాడికి ఇక మరు జన్మ లేదు. అంతగొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష. ఇరుముడి కట్టు శబరిమలకు అంటూ అయ్యప్పలంతా ఆ శబరిమల వాసుని దర్శించుకునేందుకు ఇరుముడి కట్టుకొని బయలుదేరతారు. అసలు ఇరుముడి అంటే ఏమిటి ? అందులో ఏముంటాయి ? పరమ పవిత్రమైన ఆ ఇరుముడిని కిందెక్కడా దించకుండా, తలమీదనే మోస్తూ, శబరిగిరికి చేరి ఆ పదునెట్టాంబడికి చేరుకుంటారు. అటువంటి పవిత్రమైన ఇరుముడిలో ఏముంటుంది ?
ఇరుముడి అంటే రెండు ముడులు అని లేదా రెండు ముడుపులని అర్థం. వీటిల్లో మొదటి భాగం భక్తికి, రెండవ భాగం శ్రద్ధకి సంకేతాలు. వీటిల్లో భక్తి అనే భాగంలో ముద్ర కొబ్బరికాయ ఉంచిన ముద్ర సంచీని ఉంచుతారు. ఈ మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మపండు, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, నున్నగా చేసిన మూడు కొబ్బరికాయలు పెడతారు.
ఇక శ్రద్ధ అనే రెండవ భాగములో తాత్కాలికంగా అయ్యప్పలు ఉపయోగించే ద్రవ్యములని ఉంచుతారు. అంటే అయ్యప్పల ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వగైరాలతో పాటుగా జాకెట్టు ముక్కలు కూడా పెడతారు. ఇందులోనూ గొప్ప అంతరార్థం దాగి ఉంది .
భక్తి, శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే భగవంతుని కృపా కటాక్షలుంటాయి . అందుకు సంకేతంగానే ప్రణవ స్వరూపమైన ఓంకారం ఓంకారమనే త్రాటితో ఇరుముడిని బిగించి కడతారు.
ఇందులోని మొదటి భాగంలో ఉంచే ముద్ర సంచిలో, గురుస్వామిగారు మూడుసార్లు బియ్యము వేయటం వలన యాత్రా సమయములో మూడు విధములైన విఘ్నములు తొలగిపోతాయని నమ్ముతారు . ఆధిదైవిక విఘ్నములు (మెరుపులు, వర్షము, వడగండ్లు వంటివి), ఆధిభౌతిక విఘ్నములు (భూకంపములు, అగ్ని ప్రమాదములు, వరదలు వంటివి), ఆధ్యాత్మిక విఘ్నములు (జడత్వము, భక్తిశ్రద్ధలు సన్నగిల్లుట, కామక్రోధాది అరిషడ్వర్గములు చుట్టుముట్టుట) లను అతిక్రమించవచ్చునని భక్తుల నమ్మకము.
అన్ని కొబ్బరికాయలని , వాటితోపాటు అవసరమైన సరుకుల్ని , తలమీద మోస్తూ, ఆ శబరిగిరికి అరణ్యంలో నుండీ నడుస్తూ, వెళ్లే అయ్యప్పలకి ఆ ధర్మశాస్తే అడుగడుగునా తోడూ నీడ! ఆయన శరణు ఘోషే ఆపదల్లో తిరుగు లేని అస్త్రం .
స్వామియే శరణమయ్యప్ప!!
#ayyappa #irumudi
Tags: sabarimala, ayyappa, irumudi, bhakthi, bhakti,