గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీస్తారు ?
గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీస్తారు ?
- లక్ష్మీరమణ
గణపతి ఆలయాల్లో, గణేశుని నవరాత్రుల్లో కఖచ్చితంగా ఆ గణపయ్య ముందర గుంజిళ్ళు తీయడం కనిపిస్తుంటుంది. కొన్ని ప్రాంతాలవారైతే, ఇళ్లల్లో పూజించిన తొమ్మిది గణపతి మూర్తులని దర్శించుకొని, ఒక్కొక్కరి ముందూ తొమ్మిది చొప్పున గుంజిళ్ళు తీసి వస్తుంటారు. ఇటువంటి కొన్ని సంప్రదాయాలు రావడానికి పురాణాలలో కథలకన్నా, జానపద కథలే ఆధారంగా ఉండడం ఒక విశేషం . బహుశా అటువంటి ఒక విచిత్రమైన ఉదంతమే ఈ సంప్రదాయం వెనుకా ఉండి ఉండొచ్చు . దానికి సంబంధించి పెద్దలు చెప్పే కథని ఒకసారి తలచుకుందాం .
పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన పరమేశ్వరుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. మంచి భోజన ప్రియుడు. పైగా మన బొజ్జ గణపయ్యకు ఆకలి కూడా కాస్త ఎక్కువే ! బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం, ఆయనకీ పార్వతీ దేవి చేసిపెట్టే, మురుకుల చక్రం లాగా కనిపించింది కాబోలు, చట్టుక్కున నోట్లో వేసుకుని మింగేసి, అమాయకంగా కూర్చున్నాడు.
మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణుమూర్తి , దాన్ని ఎక్కడ ఉంచానా అని వెతకడం మొదలుపెట్టారు. మామయ్యా ఏం వెతుకుతున్నారో అర్థం కాక, చల్లగా వచ్చిన చిన్నారి గణపయ్య ‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’ అని అమాయకంగా అడిగాడు. “ఇక్కడే నా సుదర్శన చక్రాన్ని పెట్టాను అల్లుడూ ! కంపించడం లేదు. ఆ చక్రాన్ని వెతుకున్నా” అన్నారు శ్రీ మహావిష్ణువు.
“ఓ అదా! గుండ్రంగా , నొక్కులు నొక్కులుగా భలే ఉందని నేనే నోట్లో వేసుకున్నా మామయ్య!”అని చిరు దరహాసం ఒలికించాడు బుజ్జి గణపతి . అసలే సుందరాకారుడు . చిన్నారి రూపంలో చిలిపి చేష్టలు చేస్తుంటే , ముచ్చట పడిపోడా ఆ మామయ్య మహావిష్ణువు. వెంటనే అల్లుణ్ణి బుజ్జగించి చక్రాన్ని దక్కించుకొనే పనిలో దిగాడు . ‘బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహా సుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా’ అని నానారకాలుగా బ్రతిమిలాడుకున్నారు . అయినా సరే , మన బొజ్జ గణపయ్య బొజ్జ నిమురు కుంటారే గానీ, చక్రాన్ని బయటపడేసే మార్గం మాత్రం ఆలోచించరు.
జగమేలే మామయ్యకి మాయోపాయాలకి తక్కువా ? ఆయన చిన్నారి గణపతిని మాటల్లో పెట్టి , తన కుడి చేతితో తన ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని గణపతి ముందుర గుంజీళ్ళు తీయడం ఆరంభించారు .
విష్ణుమూర్తి మామయ్య చేసిన ఈ పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి పుట్టేంతగా నవ్వారు. అలా నవ్వుతూండగా , ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం అదే అదననుకొని , గబుక్కున బయటపడింది . చక్రం చిక్కిందిరా నాయనా అని ఊపిరి పీల్చుకున్నారు శ్రీ మహావిష్ణువు.
ఇలా అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది అని హరికథా భాగవతులు సరదాగా కథ చెప్పేవారు. ఆ విధంగా గణపతి ప్రసన్నుడై, శ్రీమహావిష్ణువు చక్రాన్ని తిరిగి ఇచ్చేశారు . కాబట్టి గణపతి ముందు గుంజీళ్ళు తీసి ఏదైనా కోరుకుంటే, ఆనందపడి మనము కోరిన కోర్కెలు కూడా తీరుస్తారట విఘ్నేశ్వరుడు. ఇందులో “తండ్రీ! నా అహంకారాన్ని నీ పాదాల ముందర పెడుతున్నాను, కరుణించి అనుగ్రహించమని” ప్రార్థన ఉంది . దానితోపాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సారి గణేషుని ఆలయానికి వెళ్ళినపుడు గుంజిళ్ళు తీయడం మరచిపోకండి .
గం గణపతయే నమః శుభం .
#ganapati #gunjillu
Tags: ganapathi, vinayaka, ganesa, gunjillu