‘గరికె’ అంటే వినాయకుడికి ఎందుకు అంత ఇష్టం?
‘గరికె’ అంటే వినాయకుడికి ఎందుకు అంత ఇష్టం?
-లక్ష్మీ రమణ
గరిక పూజలు చేసేము మమ్మేలవయ్యా , మాబొజ్జ గణపయ్య ! అని గణాధిపతినే కదా మనందరమూ కూడా తొలిగా పూజించి ప్రార్థిస్తూ ఉంటాము . ఆయనకి ఆ గరికె పూజలంటే ఎందుకంత ఇష్టమో ! కనీసం పూవులు పూయవు. చక్కని సువాసన వెదజల్లవు . అందంగా , అద్భుతంగా ఉండవు . కాయలు కాయవు. తినడానికి పనికిరావు . మరెందుకయ్యా నీకాగరికంటే అంతటి ఇష్టం ?
‘ఓం గణాధిపాయ నమః దూర్వారయుగ్మం పూజయామి’ అంటూ గణపతిని 21నామాలతో పూర్తిగా గరికెతో అర్చిస్తాం . ఏటా చేసుకొనే వినాయక చవితి పుస్తకంలో ఈ గరికపూజ ఉంటుంది చూడండి . ఈ గరిక గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. ఆయన గజముఖంతో ఉన్నందుకు గరికను ఇష్టపడ్డారనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే లెక్క . తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక.
గరికెను సంస్కృతంలో ‘దూర్వాయుగ్మం’అంటారు. దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. అందుకేకాబోలు శ్రీనాథమహాకవి తానొచోట గరికతో చేసిన పచ్చడిని తిని , దానిపైనా వదలకుండా ఒక చాటుపద్యాన్ని వదిలారు . ఈ పచ్చడి మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.
ఇది ‘దర్భల’ జాతికి చెందిన మొక్క. ‘దర్భలు’ శ్రీ మహావిష్ణువు రోమకూపాల నుండి జన్మించాయి. పైగా గరుక్మాంతుని పుణ్యమా అని, అమృత స్పర్శకు నోచుకోబడ్డాయి. అందుకే అవి అతి పవిత్రాలు. ఆ జాతికి చెందిన ‘గరికె’ కూడా దర్భలవలె పవిత్రమైనవి. అంతేకాక, గడ్డిపూలు ఉన్నాయి గానీ, ‘గరికె’ పూవులు పూయదు. ప్రకృతి సంబంధమైన పరాగసంపర్క దోషం ‘గరికె’కు లేదు. అవి స్వయంభువాలు. కనుక, సంపర్క దోషం లేకుండా పార్వతీదేవికి స్వయంభువుడుగా జన్మించిన వినాయకునికి ‘గరికె’ అంత ఇష్టం. అందుకే ఆయన ‘దూర్వాయుగ్మ’ పూజను పరమ ప్రీతిగా స్వీకరిస్తాడు గణపయ్య .
ఇంకేమరి, చక్కగా గణపయ్యకు గరికెతో అల్లిన మాలని అందంగా అలంకరించి ఆయన కృపకి పాత్రులు కండి . ఏ రూపంలో నైనా ఇమిడిపోయే మన గణపయ్యకు గరికె కూడా అందంగానే ఒప్పుతుంది ఏమిటో !