అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు ?
అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు ?
లక్ష్మీ రమణ
అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటాం . ఇంకా నిమ్మకాయల దండలు వేసి అర్చిస్తూ ఉంటాం . ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు ? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది . మానమొకసారి పీపరిశీలిస్తే, లక్ష్మీ దేవికి , సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండాలు వేసే ఆచారం కనిపించదు . కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది .
శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది . లయకారుని శక్తి కదా మాత . కాలస్వరూపమై , దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది . దేవి సత్వ సరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది . ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా , రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ , దుష్ట శిక్షణ చేస్తారు . అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు .
‘కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః
ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం’.
వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! రాజులు మాంసాహారాన్ని, బ్రాహామానులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు . మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె ‘బలిప్రియ’. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి . శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ‘ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ). అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి , నా ఆపదలని నశిపజేయి’ . అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది .
అదేవిధంగా నిమ్మకాయ దండాలని సమర్పించడము కూడా ! రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ , పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి , శాంతిస్తారని చెబుతారు . అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు .
కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకొనే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో వాడకపోవడం మంచిది . ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే, మీరు తయారు చేసి, గుడిలో ఉన్న దేవతకి సమర్పించి, మీ పేరిట అర్చన చేయించుకొని, అక్కడ చేసిన అర్చనలో నుండీ నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధనానికి, వాహనానికి కట్టుకోండి. దానివలన ద్రుష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి .
దుష్టశక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదు.