కృష్ణుడు అపరిమితంగా వెన్నని ఆస్వాదించడం వెనుక పరమార్థం ఏమిటి ?
కృష్ణుడు అపరిమితంగా వెన్నని ఆస్వాదించడం వెనుక పరమార్థం ఏమిటి ?
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వివరణ నుండీ కృతజ్ఞతలతో !!
కన్నయ్యని తలుచుకుంటే చాలు హృదయం ఆనందంతో పొంగిపోతుంది . అటువంటి సౌందర్యం మూర్తీభవించిన చిన్నారిగా ఆ పరమాత్మ ఈ భువి మీదికొచ్చారు . ఆయనకీ ఇష్టమైన పదార్ధం నవనీతం . ఆయనకే ఆ వెన్న ఎంత ఇష్టమంటే , యెంత తిన్నా తరగనంత. అంతటి అనంతమైన రుచి వెన్నలో ఏముందని ? ఇంట్లో యశోదమ్మ చేసి పెట్టె కుండల కొద్దీ వెన్న చాలదన్నట్టు , ఆయంట్లో ఈ ఇంట్లో ఉట్టిమీద దాచిపెట్టిన వెన్నలన్నీ , ఉట్టికొట్టిమరీ ఆరగించిన ఆ పరమాత్ముని అల్లరి లీలలోని పరమార్ధం ఏమై ఉంటుంది ? భాగవత కథామృతాన్ని పంచుతూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ ప్రశ్న లకి అద్భుతమైన వివరణ ఇచ్చారు . దానిని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
కృష్ణుడు వెన్ననే ఎప్పుడూ తినడం దివ్యమైన పరమార్థం ఉన్నది . వెన్న షడ్రుచులైన తీపి, చేదు, పులుపు, కారం , ఉప్పు , వగరు రుచులకి చెందినది కాదు . ఆ రుచి అమృతంతో సమానమైనది . అమృతం వంటి ఆనందాన్నీ ఇచ్చేటటువంటిది . ఉదాహరణకి ఈ షడ్రుచులనీ ఒకదానితో ఒకటి కలిపి తీసుకున్నా, ఒకే రుచిని అదేపనిగా ఆస్వాదించినా కొంత తడవి తర్వాత అది యెంత ఇష్టమైనదైనా దానిని తినలేనంత వెగటు పుడుతుంది. కానీ వెన్న అలాకాదు . యెంత తిన్నా , అంతులేని ఆనందాన్ని మాత్రమే ఇచ్చేది వెన్న . ఈ వెన్న అమితంగా పరమాత్మ ఆరగించడంలోని విశేష మర్మాన్ని పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లోనే ఆస్వాదించండి .
చిన్నారి కృష్ణుడు అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి పోయేవాడు. అన్ని ఇళ్ళల్లో వున్న వెన్న నెయ్యి అన్నీ తినేసేవాడు. ఎవరయినా తన మీద నేరములు చెపితే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే మూతి అంతా శుభ్రంగా తుడిచేసుకునే వాడు. అలా వెన్నలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ అలా వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉంది.
మొదట మీ అంతట మీరుగా చేసుకోవలసిన ప్రయత్నంతో ఏర్పడే మనస్సు నిర్మలమయిన మనస్సు ఈ నిర్మలత్వము ఎవ్వరూ తేలేరు. మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి, భగవంతుడిని మనస్సుకి ఆలంబనం ఇచ్చి రాగద్వేషములకు అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా నిర్మలంగా ఉన్న మనస్సును “పాలకుండ” అని పిలుస్తారు.
ఇపుడు ఈ మనస్సుకు ఈశ్వరుని తీసుకు వచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే అది పొంగిపోవడం మొదలుపెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణమును సంతోషంతో కూడిన పూజను చేయడం మొదలు పెడతారు. అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత ఏర్పడిన కర్మ వలన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి వలన వైరాగ్యభావన కలుగుతుంది. ఈ వైరాగ్యమనే అగ్నిహోత్రము మీద నిర్మలమయిన మనస్సు అనబడే పాలుకాగాలి. ఈ పాలు ఎర్రటి తొరక కడతాయి. కమ్మటి పాలు నిర్మల కైంకర్యము అయిన మనసు వలన, భక్తివలన వైరాగ్యభావన అనే అగ్నిహోత్రం మీద కాలి, కాగి వున్నాయి. ఇప్పుడు ఈ పాలు పెరుగు అవ్వాలి.
పాలను పెరుగుగా మార్చాలంటే తోడు పెట్టడానికి పెరుగు కావాలి. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకూ పూర్వం ఈశ్వరుని గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవరు అనుభవించాడో వాడే వచ్చి మరల ఆమాట చెప్పాలి. గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురూపదేశమును కదలని కుండలా పట్టాలి. ఈ పాలలోకి ఆ పెరుగు పడాలి. అలా పడితే ఆ పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరగా గురువు వెనుక గురువు తయారవుతాడు.
పెరుగు గట్టిగా తోడుకున్న తరువాత ఇప్పుడు మీరొక పని చెయ్యాలి. ఇంతకూ పూర్వం గురువులు చెప్పిన మాటలను చెవితో విని వదలడం కాకుండా వారు చెప్పిన మాటలను లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననము అనే కవ్వము. ఇది తిరుగుతుంటే పెరుగు చిలకబడుతుంది. గురువు వలన తాను విన్న విషయములను కూర్చుని మనసుపెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు.
పెరుగును చిలికితే లోపలనుండి వెన్న పైకి వస్తుంది. పైకి తేలుతుంది. వెన్నకి రెండు లక్షణములు ఉంటాయి. ఈ వెన్నను అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలోకాని, మజ్జిగలో కానీ వేస్తె తేలుతుంది. భగవత్సంబంధమయిన జ్ఞానమనే అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే వున్నా పైకి కనపడని నెయ్యి యిప్పుడు చిట్టచివరి దశలోపైకి వస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. కానీ నేతిని తిరిగి పాలుగా మార్చలేము. ఒకసారి బ్రహ్మ జ్ఞానమును పొందేసిన తర్వాత ఇంక తాను వెనక్కి వెళ్ళడు. తాను ప్రారబ్ధం అయిపోయే వరకు శరీరంలో ఉంటాడు. శరీరం పడిపోతూ ఉండగా అమ్మయ్య శరీరమును వదిలి పెట్టేస్తున్నాను అని జీవుడు సంతోషిస్తాడు.
ఇటువంటి ఆత్మజ్ఞాన స్వరూపమయినది వెన్న నెయ్యి కాదు. దీనిని ఆధారం చేసుకుని ఆత్మదర్శనం అవ్వాలి. దానికి నిధి ధ్యాసనం లోనికి వెళ్ళాలి. లోపలి వెన్న ఎవ్వరికీ పనికిరాదు ఒక్క ఈశ్వరునికే పనికి వస్తుంది. అనగా అత్యంత ప్రశాంతమయిన ప్రదేశమునందు కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఈ వెన్నను ఒక్క ఈశ్వరుడే తింటాడు. అన్యులు దీనిని తినలేరు.
ఈశ్వరుడు ఇక్కడకు వచ్చి ఆ విదాహముగా వెన్న తినడమే గోపకాంతల ఇళ్ళల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడం. అప్పుడు ఆ భక్తి, ఆ వెన్న కృష్ణ స్పర్శ చేత జ్ఞానముగా మారుతుంది. అది నేయి. అది యజ్ఞమునందు పడుతుంది. అదే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతాడు. ఇదీ కృష్ణుడు వెన్న తినడం అంటే! అంతేకానీ చేతకాక, పనిలేక, అవతారమును స్వీకరించి వాళ్ళింట్లోకి, వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఎందుకు వెన్న తిన్నాడో అంతరము నందు విచారణ చేయాలి. దీనిని నవనీత చోరత్వము అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించడం వెనకాతల వున్న రహస్యం అది!