కృష్ణార్పణం అనడంలో మర్మం ఏమిటి ?
కృష్ణార్పణం అనడంలో మర్మం ఏమిటి ?
లక్ష్మీ రమణ
ధనుర్మాసం ఆరంభంకాగానే మాఊరిలో హరిదాసుల సందడి మొదలయ్యేది. ఇంటింటికీ చిడతలు పట్టుకొని నారద స్వరూపంగా వచ్చి, చక్కగా ఇచ్చిన బియ్యాన్ని నెట్టి మీద పెట్టుకున్న పాత్రలో పోయించుకొని, ‘కృష్ణార్పణం’ అనేవారు . ఇక ఇంటివెనకాలే ఉన్న గుడిలో ఆచారిగారికి ఏమిచ్చినా సరే, ఆయన ‘ కృష్ణార్పణమస్తు’ అనేవారు . వీరందరికీ మించి, మా బామ్మగారు ప్రతి పని పూర్తయిన వెంటనే, ఒక మంచిమాట చెప్పినవెంటనే కృష్ణార్పణం అనేది . అసలీ కృష్ణార్పణం లోని మర్మమేమి ?
ఏదోఒక కర్మ చెయ్యకుండా ఉండడం అనేది ప్రాణులకి సాధ్యమైన విషయం కాదు . కర్మ అంటే, పనే కదా ! మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి.
ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా? లేక ఈ చక్రాన్ని తాప్పించుకొనే మార్గం ఏదైనా ఉందా ? అంటే, శ్రీకృష్ణ భగవానుడు , కురుక్షేత్రం అనే సంసారం వంటి చదరంగంలో జీవుడనే అర్జనుడికి భగవంతునిగా తన వాణిని వినిపిస్తూ, ఒక చక్కని మార్గం బోధిస్తారు .
‘అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ పూజ చేసినా, ఆ ఫలితం విజయమైనా, ఆపజయమైనా దాన్ని నాకు (భగవంతునికి ) సమర్పించు. దానివల్ల కర్మ యొక్క ఫలం నిన్ను అంటుకోదు . ఆ కర్మ యొక్క ఫలం కూడా నాకే చెందుతుంది’. అంటారు. దీనినే కదా కర్మయోగము కూడా బోధిస్తుంది. సర్వమూ ఈశ్వరార్పితం చేయడాన్నే ఈశ్వర ప్రణిధానం అని కూడా అంటారు . ఇది గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ కాబట్టి మరింత జాగ్రత్తగా పరిశీలిద్దాం .
అయితే భగవంతుని ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.
మొదటిది కర్తృత్వ త్యాగం:
ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదిలిపోతుంది. ఏ పనైనా భగవంతుడు చేయిస్తున్నదానే భావనతో చేయడం అనేది అలవాటు చేసుకోవాలి . భగవంతుడు ధర్మానువర్తుడు. కాబట్టి అవినీతి పనులు చేయడం, అసత్యం పలకడం , చెడు మార్గాల్లో వెళ్లడం వంటివి చేయలేము .కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు మాత్రమే పూనుకుంటాము.
రెండోది ఫలత్యాగం:
నీపని నువ్వు శ్రద్ధతో , నిష్ఠతో , ఎంతవరకూ దానికోసం కష్టపడాలి అంత కష్టంతోటి చెయ్యి . దాని ఫలితాన్ని నాకు వదిలేసెయ్యి . అంటారు కదా గీతలో కృష్ణ పరమాత్మ . అలాగే ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని మాత్రమే చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.
మూడోది సంగత్యాగం:
ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి.
ఇక్కడ ఈ మూడు త్యాగాలనీ ఒకసారి గమనించండి . సంకల్పం మనది కాదు . ఆ భగవంతుని సంకల్పాన్ని మనం ఆచరిస్తున్నాం. సంకల్పం సిద్ధించడానికి పూర్తిగా కృషిచేస్తున్నాం . కానీ దానికి కర్తవీ నీవేనని భగవంతునికి అర్పిస్తున్నాం . చివరికి శుభాశుభ ఫలితాలు - దానివల్ల జనించేవి ఏవైనా అవి భగవంతునికే అర్పిస్తున్నాం . అప్పుడిక, నిరాశలు ,నిస్ప్రుహలు ఆత్మహత్యలు , ఆత్మ త్యాగాల అవసరం ఎక్కడుంటుంది ? ఒత్తిడి ఎక్కడ పుడుతుంది ? ఒత్తిడిని ఎదుర్కోవడానికి కేవలం ఈ మూడు పనులు చేస్తే, సరిపోతుంది . అసలు ఈ మూడు పనులూ చేయడానికి ఒకే ఒక్క పని చేస్తే, చాలు .
అదేంటంటే, ఆ భగవంతుణ్ణి తలుచుకొని, నమస్కారం చేసుకొని, కృష్ణార్పణం అంటే చాలు . చూడండి ! యెంత సులువైన పనో ! ఇంత గొప్ప ఫలితం కేవలం ఒకేఒక్క చిన్న ఖర్చులేని సులువైన పనితో మనకి లభిస్తుంది. కావలసిందల్లా స్వచ్ఛమైన మనసు మాత్రమే ! అంతే !
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు !