ఏనుగు చర్మాన్ని ధరించిన శివుణ్ణి పూజించాలా ? లేక
ఏనుగు చర్మాన్ని ధరించిన శివుణ్ణి పూజించాలా ? లేక పులిచర్మాన్ని ధరించిన మూర్తినా ?
- లక్ష్మి రమణ
పరమేశ్వరుణ్ణి లింగస్వరూపంగా ఆరాధిస్తూంటాం. అయితే ఆ స్వామిని సశరీరంగా భావన చేసినప్పుడు ఆయన వ్యాఘ్రచర్మాన్ని ధరించి ఉంటారని కొందరు , గజచర్మాన్ని ధరించి ఉంటారని కొందరూ చెబుతుంటారు . అసలాయన వస్త్రాలేమిటి ? ఆయన రూపంలోని ఆంతర్యం ఏమిటి ?
పాతాళము నుండి ఆకాశపు అంచుల వరకు వ్యాపించిన బ్రహ్మాండము అంతా నిండుకున్న జ్యోతి స్వరూపుడు శివుడు. ఆది, అంతములు లేని వాడు. అటువంటి పరమేశ్వరుని కప్పే వస్త్రము అసలు ఈ జగతిలో ఉందా? అందుకే శివుడు దిగంబరుడు - దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు.
అందరినీ శాసించే ఈశ్వరుడు. తనను శాసించే వారెవ్వరూ లేని వాడు కాబట్టి దిగంబరుడు. వస్త్రధారణ లోకములో వ్యావహారిక నియమాలను సూచించే కనీస కర్తవ్యము - కూడు, గుడ్డ, నీరు అంటారు కదా! తనకు ఎటువంటి నియంత్రణ లేదని చెప్పేదే దిగంబర తత్వము. ఆ స్వామి దిగంబర తత్త్వం ప్రపంచ రాహిత్య స్థితిని సూచిస్తుంది.
శంకరుడెప్పుడూ బోళా శంకరుడే . భక్తుల మనసుమాత్రమే ఆయనకీ కావాలి . మారె భేదాలూ పాటించేవాడు ఆ రుద్రుడు. అందుకే తన భక్తులు కూడా స్వయంగా రుద్రులుగా మార్చేస్తాడు. రాక్షసులైనా, మానవులైనా , దేవతలైనా ఆయన్ని శరణంటే చాలు అమితమైన ఆనందంతో అనుగ్రహిస్తాడు . వారి మనసులోని రాక్షసత్వాన్ని తుడిచేసి, చరితలో నిలిచిపోయే అమరత్వాన్ని ప్రసాదిస్తాడు .
భక్తితో ప్రార్ధించి తన ఉదరంలో నివశించామని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధించాడు గజాసురుడు . భక్తునికోరిక కాదనలేని స్వామీ సరేనన్నాడు . కానీ లోకాలన్నీ పరమేశ్వర దర్శనం లేక అట్టుడికిపోయింది. లయకారుని లీలకి నోచుకోని కైలాసం దిగాలుపడింది . విష్ణుమూర్తి జ్యోక్యంతో గజాసురుడు తన తప్పు తెలుసుకున్నాడు . ప్రాయశ్చిత్త పడ్డాడు . ఆత్మనే శివునికి సమర్పించుకుని, తన శరీర చర్మాన్ని ఏ బాధా లేకుండా వలిచి పరమేశ్వరునికి అర్పించాడు . ఆ రక్తం కారుతున్న చర్మాన్ని చుట్టుకొని భక్తుని కోరికను తీర్చి , అతని ఆత్మ సమర్పణకు అమరత్వాన్నిచ్చాడు ఆ మహేశ్వరుడు.
అన్నీ తానైన వాడికి శుచీ , అశుచీ అనేదేముంది ? ఆయనకి ఎటువంటి ఆశుచి అంటదు. అదే ఆయన స్వరూపము . తలపైన అన్ని దోషములను పోగొట్టి పవిత్రము చేసే గంగ, అమృత ధారాలను కురిసే చంద్రుడు. వంటిపై రక్తంకారుతున్న గజచర్మము, స్మశానములోని బూడిద, శరీరమంతా ఆభరణాలుగా చుట్టుకున్న భయంకరమైన పాములు!! ఇలా శుభములు, అశుభములు ఒక్క చోటే కొలువైన రూపము అదొక్కటే. కాబట్టి ప్రపంచాన్ని ఒక్క చోట చూపే ప్రతిరూపమే ఆ నిరాకార శివుని సాకార స్వరూపము.
మదించిన ఏనుగు రాక్షస స్వరూపమై గజాసురునిగా మారింది . కానీ విజ్ఞులైన ఋషులు గర్వాంధకారంలో పడి, మోహపుమాయలో చిక్కి, విచక్షణ విడిచిన పులిలా ప్రవర్తించారు . దారుకా వనంలో ఋషులకు యజ్ఞము మొదలైన కర్మలతో, తమకు తెలిసిన జ్ఞానంతో ఏదైనా సాధించవచ్చు అనే గర్వం కలిగింది. తమకి, ఫలానికి మధ్య పరమేశ్వరుడు ఉంటాడనే విషయం మరిచారు. ఈశ్వర శక్తిని ధిక్కరించే వరకు వచ్చారు.
ఆదిపురుషుడైన శివుడు వారిని పరీక్షించడానికి, వారిని దారిలోకి తేవడానికి ఒక యువ భిక్షువు రూపంలో దిగంబరంగా దిగి వచ్చారు. తన నాటకంలో ఆ విష్ణుమూర్తిని మోహినిని చేసి తోడుగా తీసుకెళ్ళారు. జగన్మోహన సౌందర్యంతో ఉన్న ఆ జవ్వనిని చూసి , మోహానికి లోనయ్యారు ఆ మహర్షులు . అంతేకానీ , యజ్ఞ రక్షకుడైన మహా విష్ణువును గుర్తించలేక పోయారా నిత్యాగ్నిహోత్రులు.
తేజోస్వరూపంతో ఉజావాలంగా తమ ముందు నిలబడిన మహేశ్వరుణ్ణి కనుగొనలేకపోయారు . ఎలాగైనా ఆ మాయాజవ్వనిని దక్కించుకోవాలనే ఆలోచనతో , ఆమెకు తోడుగా ఉన్న ఆ యువకుణ్ణి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. తమ శక్తులను ఉయోగించి, ఆభిచారిక హోమం చేసి, పామును ప్రయోగించారు.ఆ యువకుడు ఆ పాముని తీసుకొని మెడలో వేసుకున్నాడు.
వాళ్ళు పులిని సృష్టించి విడిచారు. దాని ఉగ్రంగా రెండు చేతులా పట్టి ఝులిపించి చర్మాన్ని ఒంటికి చుట్టుకుని నవ్వాడు . తమ మాయలను కూడగట్టి అపస్మారుడనే రాక్షసుణ్ణి సృష్టించి వదిలారు. ఈ అజ్ఞాన రాక్షసుని కాలితో తొక్కాడు. ఇక చేసేది లేక యజ్ఞ అగ్నిని ప్రళయాగ్నిగా ప్రయోగించారు. వారి కోపానికి రూపమైన ఆ అగ్నిని చేతిలో పట్టుకుని, నవ్వుతూ నాట్యం చేసాడు. అలా తనను ధిక్కరించిన వారికి అపురూపమైన నటరాజ రూపం చూపాడు పరమేశ్వరుడు . అలా గజ చర్మము రాక్షసుని పై కృప చూపి కట్టుకునే పంచగా మారితే, పులి చర్మము ఋషులపై కృపతో అంగ వస్త్రంగా మారింది.
ఆదిమధ్యాంత రహితుడు, నిరాకారుడు అయిన పరమేశ్వరుడు భక్తులు కోరిన రూపంలో దర్శనమిస్తారు. యద్భావం తత్భవతి అని దర్శనమిచ్చే దయాస్వరూపుడు ఆ దేవదేవుడు . గజచర్మ ధారా , వ్యాఘ్ర చర్మధారా, లేదా పట్టు పీతాంబరాలు ధరించిన దివ్యస్వరూపమా , స్మశానవిభూతి ధరించిన దిగంబరుడా , కిరాత రూపంతో ఉన్న వేటగాడా … ఇలా మనము ఎలా భావన చేస్తే అలా దర్శనమిస్తాడు ఆ పరమేశ్వరుడు .
ఓం నమః శివాయ
#shiva #siva
Tags: Shiva, Siva