పెద్దలు అదేపనిగా కలలో కనిపిస్తున్నారా ?
పెద్దలు అదేపనిగా కలలో కనిపిస్తున్నారా ? అయితే, ఇలా చేయండి .
లక్ష్మీ రమణ
సృష్టంతా రకరకాల డైమన్షన్ లలో నిర్మించబడింది అని మన ఆధ్యాత్మిక గ్రంధాలు బోధిస్తాయి. అదే విధంగా ఆయా డైమన్షన్ లలో కాలం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఇలా కాలం అనేది భూమి కాక ఇతరత్రా లోకాలలో ఎలా ఉంటుంది అనే దానికి మన పురాణాలూ, ఇతిహాసాలూ రకరకాల ఉదంతాలని చెబుతాయి. ఈ రహస్యమే పితృదేవతలు కలలో కనిపించే దానికి పరిష్కారం చూపించగలదని అంటున్నారు పండితులు. ఆవిశేషాలేమిటో తెలుసుకుందామా !
భూమికి పైన ఏడు క్రింద ఏడు లోకాలుంటాయని మన ధర్మం చెబుతుంది. ఇక, ఆయా లోకాల్లో సమయం అనేది రకరకాలుగా ఉంటుందట . మనకి ఒక్క ఏడాది కాలం కొన్ని ఊర్ధ్వ లోకాలలో ఒక రోజుతో సమానం. దీనికి ఉదాహరణగా భాగవతంలోని కథలని చూడండి . శ్రీ కృష్ణుడు చిన్నారి బాలుడై నందుని ఇంట పెరుగుతున్నాడు . జగత్తుని రక్షించేవాడు గోకులాన్ని రక్షించడా! అయినా బ్రహ్మదేవునికి ఒక చిలిపి జిజ్ఞాస కలిగింది ! నేను సృష్టించిన సృష్టిని ఈయన ఎలా కాపాడుతాడో చూదాం అనుకున్నారు . గోపబాలురందరినీ ఒక రోజు ఎత్తుకెళ్ళిపోయారు. అలా గోకులంలో ఏడాది గడిచిపోయినా ఒక్క కుటుంబం కూడా కంట తడిపెట్టలేదు. కారణం ఏంటంటే, ఆ బాలుర రూపాలన్నీ తానే ధరించి, అందరి ఇళ్ళలో వారి బిడ్డడై మురిపిస్తున్నాడు గోపాలుడు. బ్రహ్మ గారు ఆశ్చర్యపోయారు . ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బ్రహ్మ వారిని ఎత్తుకెళ్లింది ఒక్క ఘడియ మాత్రమే. కానీ గోకులంలో ఏడాది గడిచింది.
అదే విధంగా పితృదేవతలు ఉండే లోకంలో కూడా కాలం మనకి ఒక ఏడాదయితే వారికి ఒక రోజుతో సమానమట. అందువల్ల ఏడాదికి ఒకసారి వారికి తృప్తిగా భోజనం పెడితే, ప్రతిరోజూ వారికి భోజనం పెట్టిన ఫలం దక్కుతుంది . ఇలా గనక పితృ కార్యాలు నిర్వహించక పొతే, వారు ఆకలితో అల్లాడి , సంతానానికి కలలో కనిపిస్తారట .
పిరుదేవతలు కలలో కనిపించడమే కాకుండా, భోజనంలో వెట్రుకలు కనిపించడం, ఇంట్లో అకారణంగా దుర్గంధం రావడం వంటివి జరుగుతాయట . ఇక వారసులకు పెళ్లిళ్లు ఆలస్యం అవడం , సంతానం కలగకపోవడం, అన్నదమ్ముల్లో ఎవరికీ, పుత్రసంతానం లేకపోవడం వంటివి కూడా సంభవిస్తాయట .
మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఇలా వారు పదేపదే కలలోకి రావడంలోని ఆర్తిని అర్థం చేసుకోవడం ఎలా అంటే, వారికి ఏవైనా తీరని కోరికలు ఉన్నాయా అని ముందుగా తెలుసుకోండి . సాధ్యమైనంతవాకూ వాటిని నిర్వర్తించే ప్రయత్నం చేయండి . వారికి ఇష్టమైన వస్తువులను పితరుల పేరుమీద ఇతరులకు దానం చేయడం సత్ఫలితాలని ఇస్తుంది. వీటన్నింటికీ మించి పితృకార్యాలని అలక్ష్యం చేయకండి . వీటి వలన వారు సంతృప్తిని పొందుతారు అని సూచిస్తున్నారు పండితులు .