తద్దినాలు ఖచ్చితంగా పెట్టాలా ?
తద్దినాలు ఖచ్చితంగా పెట్టాలా ? అవసరమా ?
లక్ష్మీ రమణ
తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని, ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పని, దీనివల్ల వంశాభివృద్ధి జరగదని చెబుతున్నారు పండితులు. అసలు దీని వెనుకున్న కారణాలేంటి? ఈ ఆచారాన్ని ఎందుకు పాటించాలి వంటి విశేషాలు తెలుసుకుందాం .
పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి.
నిజానికి పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు.
ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. పితృ కార్యమప్పుడు ఒక భోక్తను పితృ స్థానంలో ఇంకొక భోక్తను విష్ణు స్థానంలో కూర్చో పెడతాం . పితృ స్థానంలో కూర్చోపెట్టిన భోక్తకు వాసు, రుద్రా, ఆదిత్య రూపంలో ఉన్న తండ్రి, తాత, ముత్తాత ఇలా మూడు తరాల వారిని ఆవాహన చేస్తాం కదా .అందుకనే భోక్తలను సంతృప్తిగా భోజనం చేయమని అడిగేది .
దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు.పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే.
వాయనము ఇస్తాము, కూరలు ఇస్తాము, బియ్యము ఇస్తాము అని అంటే, అది తప్పనిసరి పరిస్థితుల్లోనే తప్ప, పితృకార్యానికి సమానం కాదని గుర్తుంచుకోవాలి .ఈ తద్దినాన్ని మీరు వుండే ఇంట్లో పెడితేనే చాలా మంచిది. దేవతలకు చేసే కార్యము కాని, పితృ దేవతలకు చేసే కార్యము కాని రెండూ మీరు వున్న ఇంట్లోనే చేయాలి. అలా చేస్తే అది మీకు మీ ఇంటికి మంచిది.
పూర్వపు రోజులలో భోక్తగా ఉండేవారు ఇప్పుడు నలువురు తినే భోజనం తినేవారు . ఇంతకుముందు తద్దినం అంటే అపరాహ్నం వచ్చిన తరువాత యింటివారి భోజనం సుమారు నాలుగు గంటల తర్వాతే .ఇలా ఎందుకంటె, మధ్యాహ్న సమయంలోనే
అయితే గానీ పితృదేవతలు రారు .వాళ్ళు రాకుండా తద్దినం ఎవరికోసం .
"వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారము వహించిన తండ్రికి క్రృతజ్ఞత చూపడము మానవత్వము విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం. అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని పురాణ వచనం.