గయలో పిండం పెట్టడానికి
గయలో పిండం పెట్టడానికి , పితరులకు మోక్షం లభించడానికి సంబంధం ఏంటి ?
లక్ష్మీ రమణ
గయలో పిండం పెడితే , ఇక పునర్జన్మ లేనట్లే అనేది హిందువుల విశ్వాసం. పితృదేవతలకు ముక్తి క్షేత్రాలుగా మనదేశంలోని మూడు క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి . దేహమేరా దేవాలయం , చైతన్యమే సనాతన దైవం అని ఎందుకన్నారో ఈ క్షేత్రాల చరిత్రని తెలుసుకంటే అర్థం అవుతుంది . పురాణాంతర్గతమైన ఆ విశేషాలని తెల్సుకుందాం .
కృతయగంలో విష్ణు భక్తుడైన గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు . విష్ణు భక్తి చేత భూమిపైనున్న అన్ని పుణ్య క్షేత్రాలకన్నా తన దేహము పవిత్రమైన క్షేత్రంగా మారేవిధంగా వరాన్ని పొందుతాడు. ఆయన రాక్షసుడు జన్మచేతనే కానీ , ఆయన గాలి తగిలినంత మాత్రం చేతనే జీవులన్నీ కూడా క్రిమికీటకాదులతో సహా, వాటి పాపరాశి దగ్దమైపోయి పుణ్యలోకాలని పొందుతుండేవి . ఆయన తన పుణ్యఫలాన్ని అంతటితో ఆపలేదు . అశ్వమేధాది క్రతువులు , అనేకమైన పుణ్యకార్యాలూ చేసి , చక్కగా ఇంద్రపదవిని కూడా పొందాడు .
దాంతో ఇంద్రుడు కాస్తా తిరిగి తన పదవిని పొందేందుకు త్రిమూర్తులని గురించి తపస్సు చేశారు . గయాసురుడిని సంహరించి తనకి తిరిగి పదవిని అందించాల్సిందిగా కోరారు . నిజానికి గయాసురుడు గొప్పవాడే . ధర్మాత్ముడే . కానీ , ఆయన అనుచరులు అటువంటి ధర్మాత్ములు కారుకదా . అసురీ ప్రవృత్తితో చెలరేగిపోయారు . దాంతో త్రిమూర్తులూ ఆ వరాన్ని ఆయనకీ అనుగ్రహించారు . గయాసురుడు ధర్మాత్ముడు, భక్తుడు కాబట్టి , ఆయన్ని ఇతర అసురులని చంపినట్టు చంపలేరు కనుక , బ్రాహ్మణ రూపంలో వచ్చి పవిత్రమైన నీదేహం మాకు యజ్ఞవేదికగా కావాలని అడిగారు .
గయాసురుడు సరేనన్నాడు . దీర్ఘమైన దేహంతో బీహార్ లోని గయలో తల ప్రదేశము , పిఠాపురంలో పాదాలు , అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రం లోని జాజిపూర్ లో నాభి స్థానం ఉండే విధంగా విస్తరింపజేశారు .
మహాశివుడు ఒక షరతు పెడతాడు . ఏడురోజలపాటు జరిగే ఈ దివ్య యజ్ఞంలో ఆటంకం అనేది రాకూడదని , గయాసురుడు కదలకూడదని , అలా కదిలితే అతన్ని సంహరిస్తామనేది ఆ షరతు . సరేనని గయాసురుడు ఒప్పుకుంటాడు . ఆర్రోజలూ నిర్విఘ్నంగా ఆ దివ్యాయజ్ఞం కొనసాగుతుంది . ఏడవనాడు గడవకండానే , కోడిరూపంలో శివుడు కూతపెడతారు . గయాసురుడు తెల్లవారింది అనుకోని లేస్తాడు . దాంతో నియమ భంగం కలుగుతుంది . త్రిమూర్తులు కలిసి అతన్ని వధిస్తారు . కానీ దానికి ముందర ఆ గయాసురుడు వారిని ఒక వరం కోరుకుంటాడు . తన శరీరం లోని ఈ మూడు స్థలాలూ కూడా తనపేరుతో ప్రజలకి ముక్తిని ప్రసాదించే స్థానాలుగా ఉండాలని , ఆయా ప్రదేశాలలో త్రిమూర్తులూ కొలువై పూజలందుకోవాలనీ ప్రార్థిస్తారు . అలా ఈ మూడు గయలు ఆదిగయ, అంత్యగయ, మధ్యగయగా మారి ఇక్కడ పిండప్రదానం పొందినటువంటి పితరులకు దివ్యదేశాలని , ముక్తిని అనుగ్రహిస్తున్నాయి . ఇదీ గయ క్షేత్రాల వెనకున్న పవిత్ర గాథ .
అయితే ఈ గయస్థానాలు శక్తి పీఠాలు గాకూడా వర్ధిల్లుతున్నాయి .
అటువంటి వాటిల్లో శిరోభాగంలో ఉన్నది బీహార్ రాష్టంలోని విష్ణు క్షేత్రం , మంగళగౌరిగా అమ్మవారు పూజలందుకుంటున్న శక్తి క్షేత్రం పాదగయ .
నాభిస్థానంలో ఉన్నది యజ్ఞస్వరూప బ్రహ్మ , గిరిజాదేవి వెలసి ఉన్న దివ్య క్షేత్రం . ఇది ఒరిస్సా రాష్ట్రంలోని జాజిపూర్ లో ఉంది .
పాదగయ పిఠాపురం లో ఉంది . ఇక్కడ ఈశ్వర క్షేత్రం . స్వామి కుక్కుటేశ్వరుడు , అమ్మవారు పురుహూతికా దేవి .