Online Puja Services

ఇదెలా సాధ్యం ?

3.142.124.119

నూర్గురు  బిడ్డల తండ్రి బ్రహ్మచారి - మృష్టాన్న భోజన ప్రియుడు ఉపవాసి. ఇదెలా సాధ్యం ?
లక్ష్మీ రమణ 

ఒక పవిత్ర నదీ తీరంలో నదికి ఇవతలవైపు వసిష్ఠ మహర్షి, ఆవలివైపు అగస్త్య మహర్షి కుటీరాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు . వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. అగ్నివరుణుల పుత్రులు . మహా తపస్సంపన్నులు . మహిమోపేతులు.  సరే, వశిష్ఠమహర్షి భార్య అరుంధతీ మాత రోజూ భోజనం తీసుకెళ్లి అగస్త్య మహర్షికి పెట్టి వస్తుండేది . దానికోసం నిత్యం ఆమె నదిని దాటాల్సి వచ్చేది . ఈ క్రమం నదిలో నీటి ప్రవాహ ఉదృతి తక్కువుగా ఉన్నంతకాలం ఆమెకి అంతగా ఇబ్బందేమీ అనిపించలేదు . 

ఒకరోజు ఆ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అరుంధతీదేవి, వంట చేసుకొని కూర్చుంది . ఇప్పుడు వాటిని తీసుకొని ఆవలి వడ్డుకు వెళ్లేదేలా? అప్పుడామె వసిష్ఠులవారి దగ్గరికెళ్ళి తరుణోపాయం చెప్పమని అర్ధించింది . 

వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి, ‘దేవీ ! ఆ నది దగ్గరకి వెళ్లి , నమస్కరించి, అమ్మా ! బ్రహ్మచారియైన వశిష్ఠుని మాటగా అభ్యర్ధిస్తున్నాను , ఆవలివడ్డుకు వెళ్లేందుకు దారివదలమని ప్రార్ధించు ‘ అని చెప్పారు . ఆమె అలాగే చేసింది. దాంతో ఆ నది రెండుగా చీలి అరుంధతీదేవి సురక్షితంగా వెళ్లేందుకు దారిచ్చింది . 

వెళ్లనయితే, వెళ్ళింది . మరి తిరిగి వచ్చేదెలా ? అప్పుడామె చక్కగా వదినగారు పెట్టిన భోజనాన్ని ఆరగించి , పొట్టనిమురుకుంటూ కూర్చొని ఉన్న అగస్త్యుల వారిని సమీపించి ‘ నాయనా ఆవలి వడ్డుకు పోయేదెలా ?’ అని అడిగింది. ఆయన ఒక దరహాసాన్ని వదిలి ‘అమ్మా ! నిత్య ఉపవాస దీక్షా నిరతుడైన అగస్త్యుని మాటగా ప్రార్థిస్తున్నానని , దారివదలమని ఆ నదికి చెప్పమ్మా ! క్షేమంగా ఆన్నగారి దగ్గరకి చేరుకోగలవు ‘ అని చెప్పారు. ఆమె అలాగే చేసి తిరిగి వశిష్ట్యాశ్రమం చేరుకుంది . 

ఇది చదువుతుంటే, మనకొచ్చిన సందేహమే ఆమెకీ వచ్చింది . అప్పటికే నూరుగురు పుత్రులకి తండ్రి , తన భర్తయైన వసిష్ఠుడు ఎలా బ్రహ్మచారి అయ్యారు ? అలాగే అప్పుడే తన చేతులతో వడ్డించగా భుజించిన అగస్త్యుడు ఉపవాసదీక్షలో ఉన్నానని ఎలా చెప్పారు ? వాటిని ఆమోదిస్తూ ఆ నదీమతల్లి దారెలా ఇచ్చింది ? ఇవే సందేహాల్ని మహర్షి వశిష్ఠుల వారిని అడిగింది అరుంధతీమాత . 

అప్పుడా మహనీయుడు ఇలా చెప్పారట . ‘ వ్యక్తులలో ‘అహం’ అనేది ఏదైతే ఉందొ అది (‘నేను’ అనే భావన) నశించి పోయినవాడు , గృహస్తుడైనా , బ్రహ్మచారే ! అదేవిధంగా , అటువంటి వాడు భోజనం చేసినా ఉపవాసే ! ఇదీ దానిలోని ఆంతర్యం’ అని చెప్పారట .  కాబట్టి ఆ ‘నేను’ని గట్టిగా పట్టుకోవాలి. 

జ్ఞానులైన వారందరూ మొదట ఈ ప్రశ్న నుండే తమ ప్రయాణం మొదలు పెట్టారు . దీన్ని తెలుసుకోగలిగితే, ఇక తెలియదంటూ ఏదీ లేదు . రమణ మహర్షి రాసిన ‘నేను ఎవరు’ అనే పుస్తకాన్ని ఆధ్యాత్మిక పిపాసులు చదువగలరు . 

శుభం . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore